కొరత.. కంటిన్యూ
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:42 AM
‘గతంలో కూలీలను పెట్టి వరి కోతలు కోయించే వాళ్లం. ఇప్పుడు పూర్తిగా యంత్రాలపై ఆధారపడ్డాం. ఆక్వా చెరువులకు ఆక్సిజన్ కొరత పట్టి పీడిస్తోంది. వీటి నివారణకు డీజిల్ లభించక ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ జిల్లావ్యాప్తంగా రైతులు వాపోతున్నారు.
రాత్రింబవళ్లూ బంకుల వద్దకు క్యూ..
అపోహలతో పలువురు వినియోగదారుల నిల్వలు
సక్రమ సరఫరాకు అధికారుల సన్నద్ధం
టోకెన్ పద్ధతిపై పంపిణీకి ఆదేశాలు
ఇంధనం లేక పలుచోట్ల ఆగిన ఆటోలు
పలుచోట్ల రెవెన్యూ, పోలీసుల తనిఖీలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి/న్యూస్ నెట్‌వర్క్)
‘గతంలో కూలీలను పెట్టి వరి కోతలు కోయించే వాళ్లం. ఇప్పుడు పూర్తిగా యంత్రాలపై ఆధారపడ్డాం. ఆక్వా చెరువులకు ఆక్సిజన్ కొరత పట్టి పీడిస్తోంది. వీటి నివారణకు డీజిల్ లభించక ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ జిల్లావ్యాప్తంగా రైతులు వాపోతున్నారు. గడిచిన మూడు రోజులుగా నెలకొన్న డీజిల్ కష్టాలు శనివారం కూడా కొనసాగాయి. ఇంధన కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపినా సరే జిల్లాకు కేటాయింపుల్లో తాత్సారం జరుగుతూనే ఉంది. జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వరి కోత యంత్రాలకు, రవాణా వాహనాలకు ఇబ్బంది లేకుండా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కోత యంత్రాలకు కూపన్‌లు ఇస్తున్నారు. ప్రతి బంకులోనూ డీజిల్ సరఫరాలో పరిమితులు విధించారు. వాహనానికి ఐదు లీటర్లకు మించి సరఫరా చేయడం లేదు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర్సాపురం పట్టణాల్లోని బంకుల్లో సమస్య అధికంగా ఉంది. డీజిల్‌కు డిమాండ్ ఏర్పడడంతో పలుచోట్ల లీటరుకు అదనంగా రూ.50 పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. కొందరు అవసరం లేకపోయినా ముందస్తుగా డీజిల్ కొని నిల్వ చేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీల నుంచి డీజిల్ ట్యాంకు వచ్చిన గంటల వ్యవధిలోనే అమ్ముడుపోతోంది. దాంతో నో స్టాక్ స్టిక్కర్‌లను బంకుల వద్ద అతికిస్తున్నారు.
బంకుల్లో బారులు
గణపవరం, సరిపల్లె, చినరామచంద్రాపురం, వరదరాజపురం, పిప్పర, మొయ్యేరులోని పెట్రోలు బంకుల్లో రైతులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. పగలు రాత్రీ తేడా లేకుండా గడిచిన రెండు రోజులుగా ఇక్కడే వుంటున్నారు. డీజిల్ కొరత కారణంగా మండలంలో చాలా చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. ఆక్వా చెరువుల్లో ఉష్ణోగ్రతల కారణంగా ఆక్సిజన్ లోపించి రొయ్యలు, చేపలు తేలిపోతున్నాయి. దీనిపై వారు ఆందోళన చెందుతు న్నారు. తహసీల్దార్ వైకేవీ అప్పారావు బంకులను తనిఖీ చేశారు. రైతులు తమ కష్టాలను తహసీ ల్దార్‌కు విన్నవించారు. దీనిపై ఆయన స్పందించి వరి మాసూళ్లు కోత యంత్రానికి ఎనిమిది లీటర్లు, ఆక్వా రైతులకు 75 నుంచి 100 లీటర్ల వరకు టోకెన్ పద్ధతిపై డీజిల్ ఇస్తామని ప్రకటించారు. బంకుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ మణికుమార్‌ను కోరారు.
ఆకివీడు పట్టణంలోని ఐదు బంకులు వున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభంలో రెండు మూతపడ్డాయి. మిగిలిన మూడింటిలో కేవలం పెట్రోలు మాత్రమే దొరుకుతోంది. డీజిల్ స్టాక్ లేదు. డీజిల్ తెచ్చేందుకు ట్యాంకర్లు వెళ్లాయని అర్ధరాత్రికి రావచ్చని సిబ్బంది చెబుతున్నారు. రైతులు, వాహనదారులు ఖాళీ డబ్బాలను తెచ్చి లైనుల్లో పెట్టారు.
తణుకు పైడిపర్రు, తేతలి పెట్రోల్ బంకుల్లో డీజిల్ అందుబాటులో లేని నో డీజిల్ బోర్డులు పెట్టారు. వాహనాలను లోనికి రాకుండా అడ్డంగా బోర్డులు పెట్టారు. శుక్రవారం రాత్రి రాష్ట్రపతి రోడ్డులోని రెండు బంకుల వద్ద డీజిల్ కోసం వాహనదారులు, డబ్బాలతో రైతులు బారులు తీరారు. రాత్రికి అయ్యి పోవడంతో వాహనాలు లోనికి రాకుండా అడ్డంగా గొలుసులు కట్టారు. బైపాసు రోడ్డులోని ముత్తయ్య బంకులో డీజిల్ కోసం డబ్బాలను క్యూ లైన్‌లో పెట్టారు.
అత్తిలి పరిసర ప్రాంత బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వరి మాసూళ్లు నిర్వహించే యంత్రాలకు, రవాణా వాహనాలకు డీజిల్ కొరత ఏర్పడింది. ఫలితంగా వరి మాసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కొన్ని బంకుల్లో పెట్రోలుకు కొరత ఏర్పడింది.
నరసాపురం తీర ప్రాంతంలో మూడో రోజు శనివారం లీటర్ డీజిల్ కోసం గంటల తరబడి బంకుల వద్ద నిరీక్షిస్తున్నారు. ఆటోలకు ఆయిల్ లేకపోవడంతో స్టాండ్‌లకే పరిమితం కావడంతో వందలాది మంది డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. కొన్ని బంకుల్లో లీటర్ ఇస్తున్నా అది దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సరిపోవడం లేదు. దీంతో ఎక్కడ ఆటో ఆగిపోతుందో తెలియక కిరాయిలకు వెళ్లడం లేదు. ప్రస్తుతం వరి నారుమళ్లు కోతకు వచ్చాయి. డీజిల్ లేక చేలల్లో చాలా వరి కోత మిషన్లు చేలల్లోనే నిలిచిపోయాయి. లారీలు కూడా కదలడం లేదు. దూర ప్రాంతాల నుంచి 216 మీదుగా వెళ్లే లారీలు డీజిల్ కోరతతో రోడ్డు పక్కనే నిలుపుదల చేస్తున్నారు. డీజిల్ మీదే నీటి తోడకంతోపాటు చెరువుల ఆక్సిజన్ మిషన్లు పని చేస్తుంటాయి. రోజుకు ఆక్వా రైతులకు ఐదు లీటర్లపైనే కావాలి. కొరత కారణంగా రెండు రోజుల నుంచి బంకుల వద్దే నిరీక్షిస్తున్నారు.
ఆచంట మండలం కొడమంచిలి బంక్‌కు డీజిల్ లారీ వచ్చిందని సమాచారం తెలుసుకున్న ప్రజలు డబ్బాలు, వివిధ వాహనాలతో వచ్చి గంటల కొద్దీ లైన్‌లో నిలబడి డీజిల్ కొనుగోలు చేసుకున్నారు. కొన్ని గంటలకే డీజిల్ అయిపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. శనివారం ఎక్కడా డీజిల్ లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి.
ఉండి పెట్రోల్ బంక్ ఉదయం ఎనిమిది వేల లీటర్ల డీజిల్ ట్యాంకర్ వచ్చింది. జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు తొలి ప్రాధాన్యత వరి కోతలకు సంబంధించి రైతులకు ఇచ్చారు. అప్పటికే చుట్టు పక్కల గ్రామాల నుంచి అనేక మంది వాహనాలు, క్యాన్లు, టిన్నులతో రావడంతో వారు ఆందోళన చెందారు. మరో బంక్‌కు డీజిల్ లోడు వచ్చిందని సమాచారం రావడంతో వాహనదారులు అక్కడకు వెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. తహశీల్దారు నాగార్జున, సిఎల్ డిటి సూర్యనారాయణరాజు, మండల వ్యవసాయాధికారి నిమ్మల శ్రీనివాస్‌లు పర్యవేక్షించారు.