బెట్టింగ్ రాయుళ్లకు షాక్ !
ABN , Publish Date - May 05 , 2026 | 01:01 AM
ఐదు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలపై జిల్లాలో జోరుగా పందేలు సాగాయి.
ప్రధానంగా బెంగాల్,
తమిళనాడులపై ఫోకస్
బుకీల కనుసన్నల్లో పందేలు
అంచనాలు తారుమారు
రూ.కోట్లలో సొమ్ము గల్లంతు
నరసాపురం, మే 4 (ఆంధ్రజ్యోతి): ఐదు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలపై జిల్లాలో జోరుగా పందేలు సాగాయి. తమిళనాడు, బెంగాల్ ఎన్నికలపైనే అందరి దృష్టి పడింది. నరసాపురంలో ఓ వ్యాపారి తమిళనాడు ఫలితాలపై సుమారు రూ.2 కోట్లు పందెం కాశాడు. డీఎంకె అధికారంలోకి వస్తుందని, టీవీకె పార్టీ విజయ్‌కు 30 సీట్లు మించి రావని పందెం పెట్టాడు. ప్రత్యేకంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల సర్వే చేసే సంస్థల నుంచి వివరాల సేకరించి మరీ పందెం కాశాడు. అయితే సోమవారం వచ్చిన ఫలితాలు ఆ వ్యాపారిని షాక్‌కు గురి చేశాయి. ఇదే ప్రాంతంలో ఇద్దరు బుకీలు కూడా కోట్లల్లో నష్టపోయారు. వారు కూడా ఇదే తరహాలో పందాలు కట్టారు. విజయ్‌కు 30 సీట్లు మించవని, బెంగాల్‌లో మమతకు 120 సీట్లు దాటి వస్తాయని బెట్టింగ్ పెట్టారు. వీరి బాటలో పలువురు క్రికెట్ బెటింగ్ రాయుళ్లు కూడా ఇదే పందెం పట్టారు. సుమారు రూ.4 కోట్లుపైనే పందెం కాసినట్లు అంచనా. భీమ వరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంల్లో కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరిగాయి. బెంగాల్, తమిళనాడు పైనే ఎక్కువుగా బెట్టింగ్‌లు జరిగాయి. అందులో విజయ్‌కు వచ్చే సీట్లుపైనే బెట్టింగ్ పెద్ద మొత్తంలో పెట్టారు. ఈ పందేలు క్రికెట్ బుకీల కను సన్నల్లోనే జరిగాయి. అత్యధికంగా భీమవరం ప్రాంతంలోనే జరిగినట్లు సమాచారం. ఇక్కడ కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి కోట్లలో పందేలు కాశారు. డీఎంకె అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో కోట్లల్లో బెట్టింగ్ పెట్టారు.ఎగ్జిట్‌పోల్స్ ఆధారంగా విజయ్‌కు 30 సీట్లు రావని కూడా పందేలు కాశారు. సోమ వారం ఫలితాలతో వీరి జేబులు ఖాళీ అయ్యాయి.
ఇక్కడా ఉత్కంఠ
ప్రస్తుతం ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బెంగాల్‌లో పాగా వేయాలని బీజేపీ, మళ్లీ అధికారంలోకి రావాలని మమత ఏడాది నుంచి ఎన్నికల వేడి కల్పించారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఎంట్రీతో హీట్ ఎక్కాయి. రాష్ట్ర నేతలు కూడా తమిళనాడు వెళ్లి ప్రచారం చేశారు.దీంతో ఇక్కడ ఫలితాలపై తెలుగు రాష్ర్టాల్లో ఉత్కంత నెలకొంది. ఇదే పందేలకు ఉసిగొలిపిది. ఎన్నికల ముందు నుంచే పందేలు మొదలయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకు పందేలు జరుగుతూ ఉన్నాయి. ఒక్క పశ్చిమలోనే రూ.100 కోట్లుపైనే బెట్టింగ్ జరిగినట్టు అంచనా.