Share News

ఈ సారైనా చూస్తామా ?

ABN , Publish Date - Aug 22 , 2026 | 01:26 AM

ఆ గ్రామాల్లో ఎన్నికలు జరిగి సుమారు 12 ఏళ్లు దాటుతోంది. అన్ని గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నా, ఆ గ్రామాల ప్రజలు మాత్రం వారి పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో పడిపోయారు.

ఈ సారైనా చూస్తామా ?

ఆ..పంచాయతీలకు ఎన్నికలు జరిగేనా ?

విలీన గ్రామాల్లో అయోమయం

కోర్టు సమస్యలు తొలగేనా ?

స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు

ఆశావహుల ఎదురు చూపులు

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 21(ఆంధ్ర జ్యోతి): ఆ గ్రామాల్లో ఎన్నికలు జరిగి సుమారు 12 ఏళ్లు దాటుతోంది. అన్ని గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నా, ఆ గ్రామాల ప్రజలు మాత్రం వారి పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో పడిపోయారు. పాలకవర్గం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన అందించే ఆర్థిక సంఘం నిధులు రాలేదు. ఉపాధి హామీ పథకం నిలిచిపోవడంతో ఆ గ్రామాల్లో అభివృద్ధి లేకుండా పోయింది. ప్రజలకు వారి గోడు చెప్పుకునేందుకు సరైన నాయకుడు లేకపోవడం మరో లోటుగా మారింది. ఈ గ్రామాలకు 2014లో ఎన్నికలు జరిగాయి తరువాత సర్పంచ్‌ ఎన్నికలే జరగలేదు. సార్వత్రిక ఎన్నికలు తప్ప స్థానిక ఎన్నికల్లో ఓటు వేయలేదు. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు పరిసరాల్లోని 18 గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంటే ఆ ఎన్నికలు ఎప్పుడు పెడతారో..ఏంటో అనే ఆలోచన పక్కన పెట్టి అసలు ఈ సారైనా తమ గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికలు జరుగుతాయా అన్న సందేహం అందరినీ తొలిచేస్తోంది. ఆశావహులు తమ గ్రామాల్లో ఎన్నికలు జరగాలని మొక్కులు కూడా మొక్కుతున్నారు.

కోర్టులో కేసులు ..

2020–21 సంవత్సరంలో తణుకు, తాడేపల్లి గూడెం, భీమవరం, పాలకొల్లు మునిసిపాలిటీల్లో సమీప గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపా దనలు చేశారు. ఆయా గ్రామాల్లో నాయకులు తాము మున్సిపాలిటీలోకి వెళ్లమని తాము గ్రామ పంచాయతీలుగానే కొనసాగించాలని కోర్టులో కేసులు వేశారు. దీంతో ఆప్పట్లో ఈ గ్రామాల్లో ఎన్నికలు జరగకుండా నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి నుంచి ఆ కేసులు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణపై జిల్లాలోని విలీన గ్రామాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. భీమవరంలో విలీన గ్రామాలైన తాడేరు, రాయలం, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు, కుంచనపల్లి, కొండ్రుప్రోలు, ఎల్‌.అగ్రహారం, పడాల గ్రామాలు, తణుకు సమీపంలోని పైడిపర్రు, వెంకటరాయపురం, వీరభద్రపురం గ్రామాలు, పాలకొల్లు సమీపంలోని కొంతేరు, అడవిపాలెం, పూలపల్లి, భగ్గేశ్వరరం, ఉలంపర్రు గ్రామాల విలీనానికి ప్రతి పాదనలు పంపారు. అయితే అప్పటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో ఆ గ్రామాల్లో పాలన స్థంభించింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో విలీన గ్రామాల ప్రజలు ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Aug 22 , 2026 | 01:26 AM