కొందామా..? వద్దా..?
ABN , Publish Date - May 13 , 2026 | 12:32 AM
ఇటీవల తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ బంగారంపై చేసిన ప్రకటన బులియన్ మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితికి దారితీసింది.
ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లు ఆపాలని ప్రధాని పిలుపు
బులియన్ మార్కెట్‌లో అనిశ్చితి
ధర మరింత తగ్గుతుందన్న భయం
జిల్లా మార్కెట్‌పై ప్రభావం
రెండు రోజులుగా తగ్గిన సందడి
భారీగా పడిన జ్యూవెలరీ షేర్లు
నరసాపురం/ భీమవరం క్రైం, మే 12(ఆంధ్రజ్యోతి) ఇటీవల తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ బంగారంపై చేసిన ప్రకటన బులియన్ మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితికి దారితీసింది. రెండు రోజులుగా స్టాక్ మార్కెట్‌లో జ్యూవెలరీ షేర్లు కుదేలయ్యాయి. ఆ ప్రభావం జిల్లా మార్కెట్‌పై కూడా పడింది. బంగారం ఏడాది పాటు కొనొద్దంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు వినియోగదారుల్లో తీవ్ర కలకలం రేపింది. కొనాలా.. వద్దా అన్న మీమాసంలో పడ్డారు. ప్రస్తుతం ధర తగ్గినా మార్కెట్‌లో సందడి లేదు. రెండు రోజులుగా జిల్లాలోని బులియన్ మార్కెట్ వెలవెలబోతున్నది.
ఉభయ పశ్చిమలో దాదాపు 800 వరకు జ్యూయలరీ షాపులు ఉన్నాయి. సీజన్‌లో రోజుకు రూ.40 నుంచి రూ.50 కోట్లు వ్యాపారం జరుగుతుంది. ప్రస్తుతం సగానికి పడిపోయింది. బులియన్ వ్యాపారుల మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ధర భారీగా పతనమైంది. యుద్ధ ప్రభావంతో దాదాపు గ్రాముకు రూ.6 వేలు వరకు తగ్గింది. ప్రస్తుతం అమ్మకాలు తగ్గినా మరో రెండు మూడు రోజుల్లో ఊపందుకుంటాయని వ్యాపారుల చెబుతున్నారు.రాష్ట్రంలో బులియన్ మార్కెట్‌కు పశ్చిమ పెట్టింది పేరు. అత్యధికంగా దుకాణాలు నరసాపురంలో ఉన్నాయి. ఇక్కడ దాదాపు 150 షాపులు ఉన్నాయి. సీజన్‌లో రోజుకు రూ.10 నుంచి రూ.20 కోట్లు వ్యాపారం ఒక్క నరసాపురంలోనే జరుగుతుంది. తరువాత భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగా రెడ్డిగూడెంలలో జ్యూవెలరీ షాపులు ఉన్నాయి. కార్పోరేట్ స్థాయి దుకాణాలు భీమవరం, ఏలూరులో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రోజూ రూ.40 కోట్ల పైబడి వ్యాపారం జరుగుతుందుని అంచనా. ఇక జైన్‌లకు సంబంధించిన షాపులు నరసాపురంలోనే అధికం. వెండి వ్యాపారం కూడా అత్యధికంగా ఇక్కడ రుగుతుంది.
బులియన్ మార్కెట్‌లో అనిశ్చితి
ఈ ఏడాది ఆరంభం వరకు పసిడి ధర దూసుకుపోతూ వచ్చింది. ఒకానొక దశలో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.20 వేలకు చేరింది. ఆర్నమెంట్ గ్రాము రూ.19 వేలు దాటింది. ఆక్కడ నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇరాన్, ఆమెరికా యుద్ధంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది. ఈ ప్రభావం బులియన్ మార్కెట్‌పై చూపింది. ఆ ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితిపై చూపింది. బంగారం ధర తగ్గడంతో దేశంలో కొనుగోళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో దిగుమతుల్ని తగ్గించాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభావం బులియన్ మార్కెట్‌పై పడింది. ప్రజల్లో కూడా కొత్త అనుమానాలకు దారితీసింది. ఇప్పటికే బ్యాంకుల్లో బంగారు రుణాలపై కొత్త విధానాలు అమల్లోకి వచ్చాయి. గతంలో మాదిరిగా రుణాలు ఇసున్నప్పటికీ వడ్డీ, యూజర్ చార్జీలు పెరిగాయి. ఈ కారణంగా చాలామంది బంగారం తాకట్టు పెట్టి మళ్లీ బంగారం కొనాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు కేంద్రం కొనుగోలుపై కొత్తగా ఆంక్షలు తీసుకురావచ్చునన్న భయం ప్రజల్లో నెలకొంది. బంగారం ధర ఇంకా తగ్గుతుందన్న ఆలోచనలో కూడా పడ్డారు. ఈ కారణాలతో రెండు రోజులుగా మార్కెట్‌లో కోనుగోళ్లు తగ్గాయి. ప్రస్తుతం శుభకార్యాలకు కూడా బ్రేక్ పడటంతో పసిడి దుకాణాల్లో కళ తగ్గింది. నిత్యం కళకళలాడే నరసాపురం బులియన్ మార్కెట్ వీధులు వెలవెల బోతున్నాయి. అమ్మకాలు కూడా సగానికి పడిపోయాయి.
కొనుగోళ్లు పుంజుకుంటాయి
అజిత్ కుమార్‌జైన్, జిల్లా బులియన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు
బంగారం ధర తగ్గడంతో దేశంలో కొనుగోళ్లు పెరిగాయి. దీనివల్ల దిగుమతులు పెరిగాయి. ఇప్పటికే యుద్ధ ప్రభావంతో క్రూడ్ ఆయిల్ భారీగా పెరగడంతో ఫారెక్స్ నిల్వలపై పడింది. వీటికి తోడు బంగారం దిగుమతులు కూడా పెరు గుతున్నాయి. వీటిని తగ్గించి దేశంలో ఫారెక్స్ నిల్వల్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో మోదీ ఈ ప్రకటన చేశారు. బంగారం కొనుగోళ్లపై కేంద్రం ఎటువంటి కొత్త ఆంక్షల్ని తీసుకురావడం లేదు. ప్రస్తుతం కొనుగోళ్లు తగ్గినా మళ్లీ పుంజుకుంటాయి.
వ్యాపారుల్లో ఆందోళన
ప్రధాని ప్రకటనతో వ్యాపారుల్లో కూడా ఆందోళన మొదలైంది. గతంలో చాలామంది భూమిపై పెట్టుబడులు పెట్టేవారు. లాభాలు వస్తుండడంతో బంగారంపై పడ్డారు. ఎక్కువ శాతం ప్రజలు బంగారం కొని నిల్వ చేసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కుదవపెట్టి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఏడాది పాటు బంగారం కొనొద్దు అని ప్రధాని చెప్పడంతో ఇటు వ్యాపారులు ఆందోళనకు గురవుతుండగా అటు కొనుగోలుదారుల్లో ఆలోచన మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్నా పెద్దా కలిపి సుమారు 500 బంగారం దుకాణాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి వేల సంఖ్యలో జీవనోపాధి పొందుతున్నారు. ఏడాదిపాటు కొనుగోళ్లు మా పరిస్థితి ఏమిటని బులియన్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. చిన్న చిన్న వ్యాపారులు కూడా దుకాణాలకు అద్దెలు కట్టలేని పరిస్థితులు ఉంటాయి. కొనుగోళ్లు ఆపితే పరిస్థితులు తీవ్రంగా మారతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.