ఇక పాఠశాలల వంతు..!
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:30 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15కాంటూరు లెవల్‌లో ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని నిర్వాసితులకు వ్యక్తిగత పునరావాస పరిహారం, కోల్పోతున్న ఇళ్లకు పరిహారం అందిస్తున్న ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా పరిహారం అందించిన గ్రామాలను ఖాళీ చేయించడానికి రెవెన్యూ అధికారులు నిర్వాసితులను సన్నద్దం చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నుంచి పాఠశాలల తరలింపు
ఇప్పటికే అధికారుల కసరత్తు
వేలేరుపాడు మండలంలో ప్రస్తుతం నాలుగు గుర్తింపు
ఈ విద్యా సంవత్సరం నుంచి పునరావాస కాలనీల్లో బోధన
త్వరలో మిగిలిన పాఠశాలలపైనా దృష్టి
కుక్కునూరు మండలంలో పది పాఠశాలలు
కుక్కునూరు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి):పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15కాంటూరు లెవల్‌లో ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని నిర్వాసితులకు వ్యక్తిగత పునరావాస పరిహారం, కోల్పోతున్న ఇళ్లకు పరిహారం అందిస్తున్న ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా పరిహారం అందించిన గ్రామాలను ఖాళీ చేయించడానికి రెవెన్యూ అధికారులు నిర్వాసితులను సన్నద్దం చేస్తున్నారు. గ్రామాలను ఖాళీ చేయిస్తుండటంతో పాటు ఆ గ్రామాల్లో చదువుకుంటున్న విద్యార్థుల చదువుకి అంతరాయం కలగకుండా పునరావాస ప్రాంతాలకు పాఠశాలలు తరలించడానికి ముందస్తూ చర్యల్లో భాగంగా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు చేసి ఒక నివేదిక రూపొందించారు. కుక్కునూరు మండలంలో 8, వేలేరుపాడు మండలంలో 31 గ్రామాలు 41.15 కాంటూరు లెవల్‌లో ముంపు పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ గ్రామాల నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించే ప్రక్రియ జరుగుతోంది.
వేలేరుపాడు మండలంలో
నాలుగు పాఠ శాలలు తరలింపు
వేలేరుపాడు మండలంలో ముందుగా నాలుగు పాఠశాలలను తరలించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరానికి నిర్దేశించిన పునరావాస కాలనీల్లో పాఠశాలలు ఆరంభం కానున్నాయి. కోయిదాలోని బాలుర ఆశ్రం పాఠశాలను బుట్టాయిగూడెంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీకి తరలిస్తున్నారు. కటుకూరు, చిగురుమామిడి, నార్లవరం కాలనీ ప్రాథమిక పాఠశాలలను ఆ గ్రామాలకు ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ప్రారంభం కానున్నాయి. ఇక మిగిలిన గ్రామాలకు సంబంధించి నిర్వాసితులకు పరిహారం అందించిన తర్వాత పునరావాస కాలనీల్లో నిర్మిస్తున్న పాఠశాలల్లో తరలింపు జరగనుంది.
కుక్కునూరు మండలంలో 10 పాఠశాలలు
కుక్కునూరు మండలంలో 41.15 కాంటూరు లెవల్‌లో 8 ముంపు గ్రామాలున్నాయి. ఇందులో జీపీఎస్ భువనగిరి, పీఎస్.దామరచర్ల, యూపీఎస్ దామరచర్ల, పీఎస్ చీరవల్లి, జిల్లా పరిషత్ చీరవల్లి, పీఎస్ కివ్వాక, పీఎస్ కుక్కునూరు, జిల్లా పరిషత్ కుక్కునూరు, పీఎస్ గొమ్ముగూడెం, జీపీఎస్ లచ్చిగూడెం పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 506 మంది విద్యార్థులు చదువుతు న్నట్లు గుర్తించారు. పునరావాస కాలనీలో ఈ పాఠశాలను తరలించడానికి సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ముంపు గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లను గుర్తించే ప్రక్రియ పూర్తయింది. ప్రతి నిర్వాసిత పునరావాస కాలనీలోకి తరలివచ్చి విద్యార్థులకు అనుగుణంగా అక్కడ అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
ముంపు పాఠశాలలను గుర్తించాం..
కుక్కునూరు మండలంలో ఎనిమిది ముంపు గ్రామాల్లో పది ముంపు పాఠశాలలను గుర్తించాం. దీనికి సంబంధించి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపించాం. ముంపు గ్రామాల్లోని నిర్వాసితులంతా తరలి వెళ్లిన క్రమంలో వారి పిల్లలకు విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు పునరావాస కాలనీల్లో పాఠశాలల నిర్మాణాలు జరుగుతు న్నాయి.
– గిరిభగవాన్‌దాస్, ఎంఈవో