Share News

స్కూళ్లకు చేరిన బుక్స్‌

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:46 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు అన్ని పాఠశాలలకు పుస్తకాలు చేరాయి.

స్కూళ్లకు చేరిన బుక్స్‌

సంస్కృతం, ఉర్దూ పెండింగ్‌

ఇంకా రాని యూనిఫారాలు

జూన్‌ 20 నాటికి చేరేవిధంగా విద్యాశాఖ అధికారుల చర్యలు

తాడేపల్లిగూడెం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు అన్ని పాఠశాలలకు పుస్తకాలు చేరాయి. అధికారుల గణాంకాల ప్రకారం 99 శాతం పుస్తకాలు తాడేపల్లిగూడెంలోని బుక్‌డిపోకు చేరాయి. ఇంకా ఉర్దూ, సంస్కృతం పుస్తకాలు రావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12,87,866 పుస్తకాలు కావాలని డీఈవోల ద్వారా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇండెంట్‌ పెట్టారు. వీటిలో 11,37,178 పుస్తకాలు బుక్‌ డిపోకు చేరాయి.విద్యార్థుల చేరికను దృష్టిలో పెట్టుకుని 5 శాతం అదనంగా డిపోలో పెడతారు.

యూనిఫాంలు రావాలి

పశ్చిమగోదావరి జిల్లాలో 1 నుంచి 10 వరకు తరగతులు నిర్వహించే పాఠశాలలు 1,354 ఉన్నాయి. వీటిలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం టౌన్‌, రూరల్‌, పెంటపాడుకు కలిపి సుమారు 12 వేలు యూనిఫారాలు చేరాయి. జిల్లాలకు 86,258 యూని ఫారాలు అవసరమ వుతాయని హెచ్‌ఎంలు ఇండెంట్‌ పెట్టారు. ఈనెల 12వ తేదిన స్కూళ్లు తెరచుకోనున్నాయి. ఇప్పటివరకు కేవల ఒక పట్టణం, రెండు మండలాకు మాత్రమే యూని ఫారాలు అందజేశారు. మరో పది రోజుల్లో పాఠశాలలు తెరుస్తారు. ఈనెల 20 తేదీలోపు యూనిఫారాలు పాఠశాలకు అందజేస్తారని జిల్లా విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. తొలుత పాఠశాలలకు వచ్చిన పుస్తకాలు, నోట్‌బుక్స్‌ అందజేసిన తరువాత యూనిఫారాలను అందిస్తారని సమాచారం. ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్‌, బ్యాగ్‌, షూ, రెండు సాక్స్‌ ఇస్తారు. బెల్ట్‌లు 1 నుంచి 5వ తరగతి చదివే బాలికలకు మాత్రమే ఇస్తారు. పెట్రోలు, డీజిల్‌ చార్జీలు, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు పెరగడంతో యూనిఫారాలు స్కూళ్లకు చేరడానికి జాప్యం జరిగినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఏలూరు జిల్లాకు చేరని యూనిఫారాలు

ఏలూరు జిల్లాలో 1,748 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ స్కూళ్లు 1,728 ఉండగా, ఎయిడెడ్‌ స్కూళ్లు 20 ఉన్నాయి. జిల్లాకు 1,14,575 యూనిఫారాలు కావాలని ఇండెంట్‌ పెట్టారు. అయితే ఒక్క స్కూల్‌కు కూడా ఇప్పటి వరకు యూని ఫారాలు అందలేదు. నోట్‌బుక్‌, టెక్స్ట్‌బుక్స్‌ మాత్రం 98 శాతం వరకు చేరాయి.

99 శాతం సరఫరా పూర్తి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న పాఠశాలకు 99 శాతం పుస్తకాలను సరఫరా చేశాం. ఉర్దూ, సంస్కృతం పుస్తకాలు రావాల్సి ఉంది. ఇవి రాగానే వీటిని కూడా పాఠ శాలకు సరఫరా చేస్తాం. విద్యార్థులు పాఠశాలల్లో చేరే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని 5 శాతం పుస్తకాలు రిజర్వులో ఉంచుతాం. ముందు ఇచ్చిన ఇండెంట్‌ ప్రకారం సరఫరా పూర్తిచేశాం.

– జిల్లా బుక్‌డిపో మేనేజర్‌ సుధాకర్‌

Updated Date - Jun 03 , 2026 | 12:46 AM