దేవుడే దిక్కు!
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:55 AM
వేసవి సెలవుల నిమిత్తం గురువారం తరగతి గదులు/ పాఠశాలలను మూసివేయడంతో ఇక బోధనా తర గతులు లేక, విద్యార్థుల సందడిలేక, ఉపాధ్యాయుల పర్యవేక్షణలేక ప్రభుత్వ పాఠశాలల్లో విలువైన ఆస్తు లు ఏమమవుతాయోనన్న భయాందోళనలు నెల కొన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విలువైన ఆస్తులకు భద్రత ఏదీ?
1,541 ప్రభుత్వ పాఠశాలలు.. 195 హైస్కూళ్లకే రాత్రి కాపలాదారులు!
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): పిల్ల లకు, ఉపాధ్యాయులకు శుక్రవారం నుంచి వేసవి సెలవులు. మళ్లీ జూన్ 12న పునఃప్రారంభమ వుతా యి. బంధువుల ఇళ్లకో, పర్యాటక ప్రాంతాలకో, శీతల ప్రదేశాలకో సమ్మర్ టూర్/ట్రిప్‌కు సమాయత్త మయ్యేవారితో శుక్రవారం నుంచి రైళ్లు, బస్సులు, విమానయాన, తదితర రవాణావ్యవస్థన్నీ ఫుల్ బిజీ. ఇదంతా నాణేనికి ఓవైపునుంటే, వందలకోట్ల రూపా యల నిధులతో సర్వాంగ సుందరంగా, సకల సదు పాయాలతో తరగతి గదులు, ప్రాంగణాలను తీర్చి దిద్దిన ప్రభుత్వ పాఠశాలల భద్రత వేసవి సెలవుల్లో ఎలా అన్నది మరోవైపు పరిశీలించాల్సిన స్థితి. వేసవి సెలవుల నిమిత్తం గురువారం తరగతి గదులు/ పాఠశాలలను మూసివేయడంతో ఇక బోధనా తర గతులు లేక, విద్యార్థుల సందడిలేక, ఉపాధ్యాయుల పర్యవేక్షణలేక ప్రభుత్వ పాఠశాలల్లో విలువైన ఆస్తు లు ఏమమవుతాయోనన్న భయాందోళనలు నెల కొన్నాయి. జిల్లాలో 2,228 పాఠశాలలున్నాయి. వీటి లో ప్రభుత్వరంగంలో పాఠశాల విద్యాశాఖ నిర్వహి స్తున్న పాఠశాలలు 27 స్టేట్ గవర్నమెంట్, 1,494 ఎంపీపీ/ జడ్పీపీ, 48 మున్సిపల్ పాఠశాలలున్నాయి. ఇవన్నీ కలిపితే మొత్తం 1541 ప్రభుత్వ పాఠశాలలు కాగా, కేవలం 195 హైస్కూళ్లకు మాత్రమే నైట్ వాచ్‌మెన్లు ఉన్నారు. మిగతా 1,247 ప్రాథమిక, 81 ప్రాథమికో న్నత, మరో 18 ఉన్నత పాఠశాలలకు రాత్రి కాపలాదారుల్లేరు. నైట్ వాచ్‌మన్లున్న హైస్కూళ్లలో సాయంత్రం 6గంటల నుంచి మరు సటి రోజు ఉదయం స్కూలు హెచ్‌ఎం లేదా ఫస్ట్ అసిస్టెంట్ విధు లకు వచ్చే వరకు కాపలా కాస్తారు. ఇక మిగతా పాఠశాలల్లో వేసవి సెలవుల్లో భద్రతకు దేవుడే దిక్కని చెప్పాల్సిన దుస్థితి.
విలువైన ఆస్తులెన్నో..
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్/ప్రైవేటు పాఠ శాలలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నాడు– నేడు, మన బడి–మన భవిష్యత్తు పేరిట ప్రభు త్వాలు బ్రిటన్ గ్రాంట్లు, సాల్ట్ స్కీం నిధులతో ఆధు నిక హంగులతో తీర్చిదిద్దాయి. ఈ క్రమంలో తరగతి గదికి 4 సీలింగ్ ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, విద్యార్థుల సంఖ్యకు సరిపడా డ్యూయల్ డెస్క్‌లు అమర్చాయి. వీటితోపాటు డిజిటల్ విధానంలో పాఠ్యాంశాల బోధనకు అత్యాధునిక ఐఎఫ్‌పి(ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్)లు హైస్కూళ్లలో తరగతిగది/సెక్షన్‌కు ఒకటి చొప్పున, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక స్మార్ట్ టీవీ వంతున అందజేశారు. ఆ ప్రకారం ఒక్కో హైస్కూలుకు సగటున 10 నుంచి 14, అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే ఐఎఫ్‌పీలున్నాయి. ఇవిగాక శుద్ధి చేసిన తాగునీటిని విద్యార్థులకు సరఫరా చేసేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లను అమ ర్చారు. ప్రతి హైస్కూలు, ప్రాథమికోన్నత పాఠశాల లో విలువైన కంప్యూటర్లతో కూడిన ల్యాబ్‌లున్నాయి. వీటితోపాటు టీఎల్‌ఎం మెటీరియల్ కింద ఒక్కో స్కూలుకు రూ.లక్షలు విలువచేసే ప్రింట్‌రిచ్ మెటీ రియల్స్, తరళ్ కిట్స్, చైల్డ్ ఫ్రెండ్లీ ఫర్నీచర్, ఔట్ డోర్ ప్లే మెటీరియల్స్, జాదూపితారా కిట్స్, ఎఫ్‌ఎల్‌ఎన్ లెర్నింగ్ కిట్స్ కొద్దిరోజుల క్రితమే అందజేశారు. ఇక పాఠశాలల్లో విద్యాసంబంధిత విలువైన రికార్డులు ఎలాగూ ఉంటాయి. సాధారణంగా స్కూలు పనిదినాల్లోనే పాఠశాల ఆవరణ లోకి అవాంఛనీయ శక్తులు, అసాంఘిక కార్యకలాపాలు, మద్యపానం, పేకాటరాయుళ్లు ప్రవేశించి దేవాలయంలాంటి విద్యాప్రాంగణాలను పాడుచేస్తుండడం, ఆకతాయిలు స్కూలు ఆస్తులను ధ్వంసం చేస్తుండడంపై పలువురు హెచ్‌ఎంలు ఫిర్యాదు చేస్తున్న విషయం విదితమే. ఇప్పుడు 50 రోజుల పాటు కొనసాగే వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల భద్రతకు ఎవరు హామీ ఇస్తారు? ఎవరు పర్యవేక్షిస్తారు? అనే సందేహాలు వస్తున్నాయి. ‘ప్రభుత్వం హైస్కూళ్లకు మాత్రమే నైట్ వాచ్‌మన్లను నియమించింది. మిగతా పాఠశాలల్లో భద్రతా బాధ్యతలను స్కూలు హెచ్‌ఎంలే స్వచ్ఛందంగా తీసుకోవాలి. ఇందులో స్కూలు మేనేజ్‌మెంట్ కమిటీ, పేరెంట్స్ కమిటీల సహకారాన్ని కోరాలి. మన బడి – మన ఆస్తిగా సమష్టిగా భావించాల’ంటూ డీఈవో వెంకటలక్ష్మమ్మ పేర్కొన్నారు.