Share News

స్కూల్‌ బస్సులకు భద్రత ఎంత..?

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:59 PM

పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే తల్లిదండ్రుల ఆశలకు స్కూల్‌ బస్సుల భద్రత తూట్లు పొడు స్తోంది. కొన్ని విద్యాసంస్థల బస్సుల నిర్వహణ, డ్రైవర్ల పనితీరు, నిబంధనల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

స్కూల్‌ బస్సులకు భద్రత ఎంత..?
ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద ప్రమాదానికి గురైన ప్రైవేటు స్కూల్‌ బస్సు (ఫైల్‌)

థర్ట్‌ పార్టీ కాంట్రాక్టులతో డ్రైవర్ల ఇష్టారాజ్యం

పర్యవేక్షణ గాలికొదిలేసిన యాజమాన్యాలు, అధికారులు

15 ఏళ్లు నిండిన బస్సులు 63. నిబంధనల అమలు శూన్యం

ఏలూరు క్రైం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే తల్లిదండ్రుల ఆశలకు స్కూల్‌ బస్సుల భద్రత తూట్లు పొడు స్తోంది. కొన్ని విద్యాసంస్థల బస్సుల నిర్వహణ, డ్రైవర్ల పనితీరు, నిబంధనల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. థర్డ్‌ పార్టీ కాంట్రాక్టుతో డ్రైవర్లు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 997 విద్యాసంస్థల బస్సులు ఉండగా, వీటిలో 63 బస్సులు 15 ఏళ్ల వయసు దాటినవే. గత ఆరు నెలల్లో జిల్లాలో నాలుగు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. వీటిపై అధికారు లు దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలి.

తమ పిల్లలు భద్రంగా వెళ్లి ఇంటికి చేరుకుంటారని, కార్పొరేట్‌ స్థాయిలో చదువులు నేర్చుకుంటారని తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లకు పంపుతున్నారు. ఇందుకోసం వేలాది రూపాయలు ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారు. అయితే, ఏలూరు జిల్లాలో కొన్ని విద్యాసంస్థలు మాత్రం ఈ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి. స్కూల్‌ బస్సుల నిర్వహణలో నిబంధనలు గాలి కొదిలేయడంతో విద్యార్థుల భద్రత గాల్లో దీపం గా మారుతోంది. సరైన శిక్షణ లేని డ్రైవర్లు, థర్డ్‌ పార్టీ కాంట్రాక్టుల కారణంగా స్కూల్‌ బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

డ్రైవర్లకు శిక్షణ ఏదీ?

చాలా పాఠశాలలు స్కూల్‌ బస్సుల నిర్వ హ ణను థర్డ్‌ పార్టీ ఏజెన్సీలకు కాంట్రాక్టుకు ఇస్తు న్నాయి. ఈ ఏజెన్సీలు తక్కువ జీతాలకు అను భవం లేని డ్రైవర్లను నియమిస్తున్నాయి. వీరికి బస్సు నడపడంపై సరైన శిక్షణ, పిల్లలతో వ్యవహరించే విధానంపై అవగాహన ఉండటం లేదు. నిత్యం ప్రయాణించే మార్గంలో ఎక్కడ గుంతలున్నాయి, ఎక్కడ మలుపులున్నాయి, స్కూల్‌ జోన్లలో ఎంత వేగంతో వెళ్లాలి వంటి కనీస విషయాలపై కూడా అవగాహన లేకుం డా బస్సులు నడుపుతున్నారు. దీనికితోడు యాజమాన్యాల పర్యవేక్షణ కరువవడంతో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

నిబంధనలు బేఖాతరు

స్కూల్‌ బస్సుల నిర్వహణకు సంబంధించి రవాణా శాఖ, పోలీసు అధికారులు పలు సూచ నలు చేస్తున్నా అవి కాగితాలకే పరిమితమవు తున్నాయి. బస్సుల్లో సీసీ కెమెరాలు, డ్యాష్‌ బోర్డు కెమెరాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనలు అమలు కావడం లేదు. డ్రైవర్లకు క్రమం తప్పకుండా బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహించాలన్న ఆదేశాలను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో మొత్తం 997 స్కూల్‌ బస్సులు ఉండగా, అందులో 63 బస్సు లకు ఇప్పటికే 15 ఏళ్ల కాలపరిమితి ముగిసింది. కాలం చెల్లిన బస్సుల్లో పిల్లలను తరలిస్తుం డటం ఆందోళన కలిగిస్తోంది.

అధికారుల చర్యలేవి?

స్కూల్‌ బస్సుల ప్రమాదాలపై జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఈఓకు నోటీసులు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. యాజ మాన్యాలు నిబంధనలు పాటించకపోయినా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విద్యాసంస్థల యాజ మాన్యాలు, ఆర్టీఏ అధికారులు సమన్వయంతో పనిచేసి స్కూల్‌ బస్సుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Oct 08 , 2026 | 11:59 PM