Share News

ఫిట్‌'లెస్‌' !

ABN , Publish Date - May 08 , 2026 | 12:14 AM

విద్యా సంస్థల బస్సులు ఇటీవల ప్రమాదాలకు గురవుతున్నాయి. విద్యార్థులు స్వల్ప గాయాలతోనే, క్షేమంగానో బయట పడుతు న్నారు.

ఫిట్‌'లెస్‌' !

అధికారుల విస్తృత తనిఖీలు

జిల్లాలో 391 స్కూల్‌ బస్సులు

చెక్‌ చేస్తే 84 వాహనాలకు లోపాలు

ఇవన్నీ ఏటీఎస్‌లో ఫిట్‌నెస్‌ పొందినవే

మళ్లీ ఏటీఎస్‌ కేంద్రాలకు వెళ్లాల్సిందే..

విద్యా సంస్థలకు నోటీసులు

ఇతర వాహనాల మాటేమిటి ?

విద్యా సంస్థల బస్సులు ఇటీవల ప్రమాదాలకు గురవుతున్నాయి. విద్యార్థులు స్వల్ప గాయాలతోనే, క్షేమంగానో బయట పడుతు న్నారు. ట్రావెల్‌ బస్సులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఫిట్‌నెస్‌ సక్రమంగా లేక పోవడమో..సాంకేతిక లోపమో... లేదా డ్రైవర్‌ల నిర్లక్ష్యంతో ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. గడచిన ఏడాదిలోనే ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనిపైనే ఇప్పుడు అధికార యంత్రాంగంలో తర్జన భర్జన పడుతున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తాజాగా ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను అధికారులు తనిఖీ చేశారు. అప్పటికే అవి ఏటీఎస్‌ (ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌) కేంద్రాల్లో ఫిట్‌నెస్‌ పొందాయి. అయినా లోపభూయిష్టంగా ఉన్నా యంటూ నోటీసులు జారీచేశారు. జిల్లాలో ప్రస్తుతం విద్యా సంస్థలకు వెళ్లి బస్సులను పరిశీలిస్తున్నారు. రవాణా శాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పాడ్డారు. ఇప్పటిదాకా 44 పాఠ శాలలు, కళాశా లలకు వెళ్లారు. మొత్తంపైన 391 బస్సులను తనిఖీ చేశారు. జిల్లాలో సుమారు 1200 బస్సులున్నాయి. అందులో మూడో వంతు తనిఖీలు నిర్వహించారు. అందులో 84 బస్సులను నిబంధన లకు అనుగుణంగా లేవని గుర్తించారు. విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు జారీచేశారు. వాస్తవానికి రవాణా శాఖ అధికారులు గతంలో తనిఖీలు నిర్వహించేవారు. ఫిట్‌నెస్‌ లేకపోతే మళ్లీ తిప్పి పంపేవారు. ప్రస్తుతం ఏటీఎస్‌ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఏజన్సీలకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో అటువంటి కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. ఇటీవల ఏలూరులోనూ అందు బాటులోకి వచ్చింది. కోనసీమ జిల్లాలో అమలాపురం, తూర్పుగోదావరి జిల్లాలో రాజా నగరం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడలో తనిఖీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. రవాణా వాహనాలను ఈ కేంద్రాల్లో ఎక్కడికైనా తీసుకువెళ్లి ఫిట్‌నెస్‌ పొందే అవకాశం ఉంది. అయితే వాటిని మళ్లీ రవాణా అధికారులు తనిఖీలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాహనాలు రాకపోకలు నిర్వహించి నప్పుడు కూడా ఫిట్‌నెస్‌ పరీక్షిస్తారు. అప్పుడు సరిగా లేవంటే జరిమానాలు విధిస్తారు. ఏటీఎస్‌ కేంద్రాలు అమలులోకి వచ్చిన తర్వాత ఇతర జిల్లాల్లో ఇటువంటి సమస్యలే ఉత్పన్నమవు తున్నాయి. ఏటీఎస్‌ల వద్ద ఫిట్‌నెస్‌ పొందినప్పటికీ రవాణా శాఖ తనిఖీల్లో లోపాలు బయట పడుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలోనూ ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి.

తనిఖీ చేయకపోయినా సమస్యే

ఏటీఎస్‌ కేంద్రాల్లో ఫిట్‌నెస్‌ పొందిన వాహనాలను మళ్లీ తనిఖీ చేయకపోతే సమస్యలు ఎదురు కానున్నాయని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రైవేటు రవాణా బస్సులు ప్రమాదానికి గురైనప్పుడు రవాణా అధికారులు విస్రృతంగా తనిఖీలు నిర్వహించారు. కనీసం లైసెన్స్‌ లేకుండా బస్సులు తిరుగుతున్నట్టు గుర్తించారు. ఫిట్‌నెస్‌ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఇక పాఠశాల బస్సులపై పర్యవేక్షణ లేకపోతే మరింత ఇబ్బందులు తలెత్తనున్నాయి. విద్యార్థులు ప్రయాణించే బస్సుల విషయంలో రవాణా అధికారులు కాస్త జాగ్రత్త పడుతున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో లారీలు, మినీ ట్రక్కులు, ట్రాక్టర్‌లు , ఆటోలు దాదాపు 40 వేల వరకు ఉన్నాయి. వాటిని ఇతర జిల్లాలో ఉన్న ఏటీఎస్‌ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా అన్ని విధాలుగా తనిఖీలుంటున్నాయి. అయితే రవాణా అధికారుల తనిఖీల్లో మళ్లీ సమస్యలు న్నట్టు గుర్తిస్తున్నారు. అలాంటప్పుడు మరోసారి ఫిట్‌నెస్‌ తీసుకోవాలంటే ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది.

కోరుకల్లులో ఏటీఎస్‌

జిల్లాలో పాలకోడేరు మండలం కోరుకొల్లులో ఎటిఎస్‌ కేంద్రం సిద్ధమవుతోంది. అది అందు బాటులోకి వస్తే వాహనదారులకు కాస్త ఉపయుక్తంగా ఉంటుంది. రవాణా అధికారుల తనిఖీల్లో లోపాలు నిర్ధారణ అయితే ఫిట్‌నెస్‌ తీసుకునే సౌకర్యం జిల్లాలోనే అందుబాటులోకి రానుంది. రవాణా శాఖ అధికారులు మ్యాన్యువల్‌గా అన్నింటినీ తనిఖీ చేసేవారు. ఫిట్‌నెస్‌ ఉంటేనే సర్టిఫికెట్‌లు జారీ చేసేవారు. ఇప్పుడు అంతా ఆటోమెటిక్‌ మిషన్‌ల ద్వారా చూస్తున్నారు. అయితే రవాణా అధికారుల తనిఖీల్లో కొన్ని సమస్యలు తెరపైకి వస్తున్నాయి. వాటికి ఇప్పుడు నోటీసులు జారీచేస్తున్నారు. మళ్లీ సర్టిఫికేట్‌లు పొందాలంటే ఇతర జిల్లాలకు వాహనాలు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు రవాణా రంగంలో పెద్ద సమస్యగా మారింది.

Updated Date - May 08 , 2026 | 12:14 AM