Share News

ఫీజులు చెల్లించండి

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:05 AM

ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై కళాశాలలు ఒత్తిడి చేస్తున్నాయి.

ఫీజులు చెల్లించండి

ఫీజులు చెల్లించండి

విద్యార్థులపై కళాశాలల ఒత్తిడి

బకాయిల చెల్లింపునకు జీవో విడుదల చేసిన ప్రభుత్వం

మూడు నెలలుగా ఎదురుచూపులే

జిల్లాలో రూ.210 కోట్ల బకాయిలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి): ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై కళాశాలలు ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తే తిరిగి చెల్లిస్తామంటున్నాయి. కొద్ది రోజులుగా విద్యార్థుల్లో ఫీజుల విషయం కలవరపెడుతోంది. తల్లిదండ్రులకు కళాశాలల నుంచి ఫోన్‌లు వెళుతున్నాయి. చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఒకేసారి ఫీజులు చెల్లించడం కష్టం అవుతోందని గుబులు చెందుతున్నారు. మూడేళ్ల నుంచి ప్రభుత్వం బకాయి లు విడుదల చెయ్యకపోవడంతో తక్షణమే కొత్త ఫీజులు చెల్లించాలంటూ ఫోన్‌లు చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ కళాశాలు, డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలలు ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. జిల్లాలో ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం రూ.35 కోట్లు కళాశాలల ఖాతాలో జమ చెయ్యాలి. గత ప్రభుత్వంలో మూడు నెలలకు ఒకసారి బటన్‌ నొక్కేవారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో రీయింబర్స్‌మెంట్‌ సొమ్ములు జమయ్యేవి. వాటిని కళాశాలకు చెల్లించాల్సి వచ్చేది. ప్రభుత్వం నుంచి జాప్యం జరిగితే యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కళాశాలల ఖాతాకే జమ చేస్తామని ప్రకటించడంతో ఇటు విద్యార్థులు, అటు యాజమాన్యాలు ఉపశమనం పొందాయి. అయితే సొమ్ములు జమ కాకపోవడంతో కళాశాల ల నిర్వహణ దినదినగండంగా మారింది. జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం రూ.250 కోట్ల బకాయిపడింది.

పుట్టని అప్పులు

ప్రతీనెల సిబ్బంది వేతనాలు, కళాశాలల నిర్వహణ కోసం అప్పులు చేస్తున్నారు. గతంలో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఎగబడేవి. రుణాలు ఇస్తామంటూ బ్యాంకర్లు కళాశాలల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు యాజమాన్యాలే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాయి. అయినా అప్పు పుట్టడం లేదు. రుణాలు కల్పించేందుకు బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. సొంత ఆస్తులు తాకట్టు పెట్టి కొద్దోగొప్పో రుణాలు ఇస్తున్నాయి.

ఎస్పీ విద్యార్థుల ఫీజులు ఏమైనట్లు ?

ఉన్నత విద్య చదువుకునే ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఫీజలు చెల్లిస్తోంది. మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఎస్సీ కేటగిరీ విద్యార్థుల ఫీజలు మాత్రం వారి ఖాతాలోనే జమ చేస్తున్నారు. ఇలా జమయిన నిధులను విద్యార్థుల నుంచి కళాశాలలు వసూలు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు 40 శాతం ఫీజును చెల్లించేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం చెల్లించే 60 శాతం ఫీజు ఇప్పటివరకు జమ కాలేదు. వీటిని విద్యార్థుల నుంచి వసూలు చేసేందుకు యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తల్లిదండ్రులకు ఫోన్‌లు చేస్తున్నారు.

Updated Date - Apr 23 , 2026 | 12:05 AM