అమ్మో.. జూన్!
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:24 AM
జూన్ వచ్చిందంటే విద్యార్థుల తల్లిదండ్రులకు హడల్.. సెలవుల అనంతరం పాఠశాల, కళాశాలకు వెళ్లాలని పిల్లల భయం..
విద్యా సంవత్సరం ఆరంభం
ప్రైవేటు వైపే తల్లిదండ్రుల మొగ్గు
స్కూల్ ఫీజులు.. పుస్తకాల బరువు
సామాన్యులకు మోయలేని భారం
జూన్ వచ్చిందంటే విద్యార్థుల తల్లిదండ్రులకు హడల్.. సెలవుల అనంతరం పాఠశాల, కళాశాలకు వెళ్లాలని పిల్లల భయం.. ఫీజులు, పుస్తకాలు డబ్బులు వెతుక్కోడానికి తల్లిదండ్రులకు ఆందోళన. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏటా ఎదుర్కొనే ఆర్థిక గండం ఇది. పిల్లలకు ఉత్తమ విద్యనందించి ఉన్నత స్థానానికి చేర్చాలని తల్లిదండ్రుల ఆరాటం. ఎంత దూరమైనా, ఫీజుల భారాన్ని మోస్తూనే పిల్లలను చదివించుకుంటున్నారు. పిల్లల పుస్తకాలు, దుస్తులు, యూనిఫాం, స్కూల్స్, కాలేజీ ఫీజు సొమ్ము కోసం ప్రయత్నాల్లో తల్లిదండ్రులు తలమునకలవుతున్నారు.
జంగారెడ్డిగూడెం రూరల్, మే 31(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం అన్ని విద్యా సంస్థల్లో విద్యా ర్థుల ప్రవేశాలు చేపట్టారు. గత ఏడాది ఫీజులు బకాయిలతో పాటు కొత్త ఫీజుల విషయంపై వివిధ విద్యాసంస్థల నుంచి తల్లిదండ్రులకు ఫోన్‌లు వచ్చాయి. మీ అబ్బాయి ఫీజులు కట్టాలి.. పుస్తకాలు కొనాలంటూ వరస ఫోన్ కాల్స్‌తో కంగారు పెట్టేస్తున్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా పుస్తకాలు, యూనీఫారంలు, బస్సు, హాస్టల్, స్కూల్ ఫీజులు కట్టడం తలభారంగా మారింది. ఇక హాస్టల్‌లో చదువుతున్న వారి తల్లిదండ్రులకు మరింత ఆర్థిక భారం.
గత విద్యాసంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయా పాఠశాలకు చెల్లించాల్సిన ఫీజు బకాయి కట్టారు. ఏప్రిల్‌లో విద్యా సంస్థలు మూతబడడంతో పిల్లలంతా నాన్నమ్మలు, తాత య్యల ఇంటికి బయల్దేరారు. మరలా విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న క్రమంలో పిల్లలు ఇంటికి వచ్చి పాఠశాలలకు వెళ్లేందుకు కావలసిన వస్తువుల కొనుగోలుపై తల్లిదండ్రుల పై ఒత్తిడి తెస్తున్నారు. గడిచిన ఏప్రిల్, మేలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక భారం మోయాల్సి వచ్చింది. భానుడి ప్రతాపంతో చాలామంది అప్పు చేసి మరీ ఫ్రిజ్‌లు, కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలను కొనుగోలు చేశారు. వాటి అప్పులు తీరకముందే మరలా స్కూల్స్ తెరవ డంతో మరో ఆర్థిక భారం పడింది.
ఫీజుల మోత
సామాన్యులు సైతం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపడంతో మౌనంగా భారం భరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కూడా మంచి మార్కులు వచ్చినా ఎక్కువ శాతం తల్లిదండ్రులు ప్రైవేటు బాట పడుతున్నారు. ఇది అలుసుగా తీసుకుని ప్రైవేటు పాఠశాలలు గట్టిగానే వసూలు చేస్తు న్నాయి. ఫీజులు ఏ స్థాయిలో ప్రైవేట్ స్కూల్స్ లోనే చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది ఫీజు బకాయిలతో పాటు కొత్త విద్యా సంవత్సరానికి వేల రూపాయలు వెచ్చిం చాలి. పుస్తకాలు, యూనిఫాం ఖర్చు అదనం.
బస్సు ఫీజు లేదా హాస్టల్ ఖర్చు!
ఫీజుతో పాటు గ్రామీణ ప్రాంత పిల్లలను పట్టణాల్లోని ప్రైవేట్ స్కూల్స్‌కు పంపడానికి బస్సు ఫీజు లేదా హాస్టల్ ఫీజు మాట వింటేనే గుండె ఝల్లుమంటుంది. వేలు దాటి లక్షల రూపాయల భారం సామాన్య, మధ్య తరగతి కుటుంబాల జీవనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రైవేట్ స్కూల్‌లో ఎల్‌కేజీ విద్యార్థికి సైతం వేలాది రూపాయాలు చెల్లించాలి. పుస్త కాలకు కూడా ఎల్‌కేజీ విద్యార్థి నుంచే వేలల్లో పుస్తకాలకే తీసుకుంటున్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలు చదువుతుంటే ఆ కుటుంబంపై మరింత భారం పడనుంది..! ఒక పక్క ఫీజుల ఖర్చుతో పాటు నెలవారీ వ్యయంతో సతమతమయ్యే కుటుంబాలకు జూన్ భయపెడుతోంది.