Share News

సాస్కీ పనులకు రీ టెండర్లు

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:30 AM

రాష్ట్ర రహదారుల నుంచి పంచాయతీలకు అనుసంధానించే రోడ్ల కోసం సాస్కీ పథకం కింద గడిచిన ఆర్థిక సంవత్సరంలో నిధులు మంజూరుచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టెండర్లు పిలిచినప్పటికి ఒకటే రావడంతో దానిని రద్దు చేసి, ప్రభుత్వం రీటెండర్‌కు వెళ్లింది.

సాస్కీ పనులకు రీ టెండర్లు

గ్రామాల్లో రూ.111 కోట్లతో 88 రహదారుల నిర్మాణం

స్పందించని కాంట్రాక్టర్లు.. మళ్లీ పిలుపు.. 3 వరకు గడువు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర రహదారుల నుంచి పంచాయతీలకు అనుసంధానించే రోడ్ల కోసం సాస్కీ పథకం కింద గడిచిన ఆర్థిక సంవత్సరంలో నిధులు మంజూరుచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టెండర్లు పిలిచినప్పటికి ఒకటే రావడంతో దానిని రద్దు చేసి, ప్రభుత్వం రీటెండర్‌కు వెళ్లింది. వచ్చే నెల మూడో తేదీ వరకు టెండర్‌ గడువు ఇచ్చారు. జిల్లా పరిధిలో 88 రహదారులకు రూ.111 కోట్లు కేటాయించారు. నియోజకవర్గాల వారీగా టెండర్లు పిలిచినా అత్యధిక మంది పాల్గొనే అవకాశం ఉండేది. ఒకే ప్యాకేజీలో పనులు ఖరారు చేస్తే నిర్ణీత గడువులోగా పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది. పంచాయతీలకు ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తం నిధులను కేటాయించడం ఇదే ప్రథమం. కొన్నేళ్లుగా వీటిని పట్టించుకోకపోవడంతో గ్రామాలకు వెళ్లే బీటీ రహదారులు దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వంలో పల్లెల్లో రహదారులు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతులకు నిధులు మంజూరు చేయలేదు. తాజాగా సాస్కీ నిధులు కేటాయింపుంతో పల్లె రహదారులు వృద్ధి చెందనున్నాయి.

ఆంక్షలతోనే ఇబ్బందులు

ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యే కాధికారుల పాలన సాగుతోంది. బిల్లుల మంజూరుకు గతంలో డివిజన్‌ స్థాయి అధికారి పర్య వేక్షణ ఉండేది. ఇప్పుడు డీపీవో అనుమతి తీసుకోవాలి. ప్రతి పం చాయతీ నుంచి ఎం.బుక్‌లను డీపీవోకు పంపాలి. అక్కడ అనుమతి పొందితేనే బిల్లులు మంజూరు కానున్నాయి. నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఈ ఆంక్షలు పెట్టింది. దీనివల్ల అత్యవసర పనులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పంచాయతీలు గగ్గోలు పెడుతున్నాయి. పంచాయతీలకు రావాల్సిన రిజిస్ర్టేషన్‌ శాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ బకాయిలు రావడం లేదు. దీని ప్రభావం పరోక్షంగా ఇతర టెండర్లపై పడుతోంది. రోడ్లు, డ్రెయిన్లు వంటి పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇదే కోవలో సాస్కి పనులు చేరాయి.

Updated Date - Jun 25 , 2026 | 12:30 AM