ఆకట్టుకున్న సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:29 AM
పాలకొల్లులో భోగి పండుగరోజు బుధవారం మన దేశ సంస్కృతి, సంప్రదాయలను ప్రతిభింబించే విధంగా సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి.
ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు
ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత
పాలకొల్లు అర్బన్/పాలకొల్లుటౌన్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి):పాలకొల్లులో భోగి పండుగరోజు బుధవారం మన దేశ సంస్కృతి, సంప్రదాయలను ప్రతిభింబించే విధంగా సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆరు రోజులుగా కొనసాగుతున్న సంక్రాంతి సంబరాలు బుధవారం రాత్రితో ముగిశాయి. స్థానిక బీఆర్‌ఎంవీఎం హైస్కూల్ గ్రౌండ్‌లో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో మహిళలకు ముగ్గుల పోటీలు, దివంగత ఆడిటర్ కలిదిండి రామరాజు పేరుతో జరిగిన ఎమ్మెల్యే కప్ జాతీయ స్థాయి పురుషులు, మహిళలకు కబడ్డీ పోటీలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా గ్రౌండ్‌లో పల్లె వాతావరణం తలపించే విధంగా పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు, భార్య సూర్యకుమారి, కుమార్తె శ్రీజ, అల్లుడు పవన్ కుమార్, వియ్యాల వారు యిర్రింకి సూర్యసత్యనారాయణ, కరుణామణి దంపతులతో కలిసి ప్రాంగణం అంతా సందడి చేశారు.
విజేతలకు బహుమతులు అందజేత
పాలకొల్లు పట్టణం, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలు నియోజక వర్గస్థాయిలో ముగ్గులు వేశారు. విజేతలకు ప్రథమ బహుమతి కౌరు జలదుర్గకు ఎల్‌ఈడి టీవీ, ద్వితీయ బహుమతి దాడి భీమేశ్వరిదుర్గకు ఫ్రిజ్, ఇంకా చింతా నాగేశ్వరి, ఆడారు లక్ష్మీదుర్గ,గంటా నాగమణి, సీహెచ్ నాగలక్ష్మి, మామిడి శెట్టి దుర్గా భవానీ, పితాని ఓంకార విద్య, కొండేటి జ్యోతి, గుడిమెట్ల బాల గాయత్రి గ్రైండర్లు అందుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, పెద్ద ఎత్తున బాణసంచా కాల్పులు జరిపారు.