కంపు.. కొడుతోంది
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:46 AM
నరసాపురం పట్టణ జనాభా 60 వేలు. రోజుకు 32 టన్నుల చెత్త వస్తుంది. డంపింగ్ యార్డు సమస్య కారణంగా గడిచిన పది రోజులుగా దీనిని రోడ్లపై నుంచి తొలగించడం లేదు.
నరసాపురం పట్టణంలో లోపించిన పారిశుధ్యం
మళ్లీ మొదటికొచ్చిన డంపింగ్ సమస్య
10 రోజులుగా రోడ్ల మీదే చెత్త కుప్పలు
వాసన భరించలేక ప్రజలు గగ్గోలు
నరసాపురం పట్టణ జనాభా 60 వేలు. రోజుకు 32 టన్నుల చెత్త వస్తుంది. డంపింగ్ యార్డు సమస్య కారణంగా గడిచిన పది రోజులుగా దీనిని రోడ్లపై నుంచి తొలగించడం లేదు. ఫలితంగా జనం ముక్కులు మూసుకు వెళుతున్నారు. ఇదే పరిస్థితి కొన్ని రోజులు కొనసాగితే రోగాలు రావడం ఖాయం.
నరసాపురం, ఏప్రిల్ 3(ఆంద్రజ్యోతి): పట్టణంలో చెత్త సమస్య తీరలేదు. గుడి లేదు.. బడి లేదు.. ఎక్క డపడితే అక్కడ చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. పది రోజుల నుంచి చెత్తను తొలగించకపోవడంతో రోడ్లన్నీ కుప్పలతో నిండిపోతున్నాయి. వీధుల్లో రోజువారీ చెత్త సేకరణ మానేశారు. ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను తెచ్చి ఆ కుప్పల వద్దే పడేస్తున్నారు. ఇలా చెత్త పేరు కుపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోంది. సమీప ప్రజలు బయటకు రాలేక తలుపులు, కిటికీలు మూసుకుని ఇళ్ల ల్లోనే ఉంటున్నారు. పగలు ఈగలు, రాత్రుళ్లు దోమలు విజృంభిస్తున్నాయి.మునిసిపల్ అధికారులు ఈ చెత్తను ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఏడాదిగా ఈ సమస్య ఉన్నప్పటికీ ఖాళీ స్థలాల్లో వేస్తూ నెట్టుకొస్తున్నారు. కొంతకాలం మొగల్తూరు మండలం లో వేశారు. అక్కడ నిండిపోయింది. మరికొన్ని రోజులు గుంటూరు పవర్ ప్లాంట్‌లోకి తరలించారు. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకోవడంతో నిలిపివేశారు. ఇటీవల మునిసిపల్ ఆర్‌జేడీ నాగనరసింహారావు నరసాపురం లో పర్యటించిన సమయంలో చెత్తను విశాఖకు తర లించాలని ఆదేశించారు. అక్కడ 30 టన్నులు మాత్ర మే తీసుకుంటామన్నారు. ప్రస్తుతం టౌన్‌లో 100 టన్నులకు పైనే చెత్త పేరుకుపోయింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత మండలంలోని మంగళగుంట పాలెం వద్ద కంపోస్టు యార్డు కోసం రూ.3.75 కోట్లతో స్థలం కొనుగోలు చేసింది. అక్కడికి తరలించేందుకు ప్రయత్నిస్తుంటే గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. పట్టణంలో పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరిం చే దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలి.
మూడు గంటలు హైటెన్షన్
నరసాపురం రూరల్ : మండవారిగరువు వద్ద కొనుగోలు చేసిన స్థలంలో పట్టణంలోని చెత్తను శుక్ర వారం వేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకో వడంతో మూడు గంటలపాటు హైటెన్షన్ నెలకొంది. గ్రామస్థులు, మహిళలు చెత్త వాహనాలను అడ్డుకు న్నారు. చేతుల్లో పురుగుల మందు డబ్బాలను పట్టుకు ని చెత్త వేస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తూ బైఠాయించారు. కమిషనర్ వెంకట్రామిరెడ్డి, సీఐలు యాదగిరి, దుర్గాప్రసాద్ వారికి సర్ది చెప్పినప్పటికి వారు ససేమిరా అనడంతో చేసేది లేక వెళ్లిన వాహ నాలు వెళ్లినట్లే వెనక్కి వచ్చాయి. చివరకు స్థానికులు ఆందోళన విరమించారు.