ఇసుక రీచ్‌లకు.. క్లియరెన్స్!
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:04 AM
జిల్లాలో వేసవి సీజన్‌తో పాటు, ఏడాది పొడవునా ఇసుక నిల్వలకు ఢోకా లేకుండా ఐదు ఓపెన్ రీచ్‌లకు యంత్రాంగం అన్ని అనుమతులను జారీ చేసింది. మరోవైపు పోలవరం ప్రాంతంలో డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా ఇసుకు నిల్వలను ప్రజల అవసరాలకు సిద్ధం చేయడానికి చకచకా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం మీద 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను మైనింగ్‌శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేశారు.
కొత్తగా మూడింటికి అనుమతులు
డీసిల్టింగ్ పాయింట్లలోనూ ఇసుక నిల్వలు
4.30 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధం
భవన నిర్మాణాలకు, ఇళ్లకు ఢోకా లేనట్లే
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో వేసవి సీజన్‌తో పాటు, ఏడాది పొడవునా ఇసుక నిల్వలకు ఢోకా లేకుండా ఐదు ఓపెన్ రీచ్‌లకు యంత్రాంగం అన్ని అనుమతులను జారీ చేసింది. మరోవైపు పోలవరం ప్రాంతంలో డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా ఇసుకు నిల్వలను ప్రజల అవసరాలకు సిద్ధం చేయడానికి చకచకా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం మీద 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను మైనింగ్‌శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేశారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగా ఉన్నప్పుడు ఇసుక రీచ్‌లతో దండిగా ప్రజల అవసరాలను ఆయా రీచ్‌లు తీర్చేవి. జిల్లాల విభజన అనంతరం చాలాకాలంగా ఏలూరు జిల్లాకు ఇసుక రీచ్‌లు లేని కొరత తీర బోతోంది. మైనింగ్, జలవనరులశాఖ, పర్యావరణ శాఖ తో పాటు ఇతర శాఖల సహకారంతో జిల్లాలో ఐదు ఇసుక రీచ్‌లను గోదావరి పరీవాహక ప్రాంతంలో సిద్ధం చేశారు. దీంతో నాణ్యమైన ఇసుక అందుబాటు లోకి రానుంది.
పక్కా ఏర్పాట్లతో రీచ్‌లు
జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతమైన కుక్కు నూరు, వేలేరుపాడు మండలాల్లో ప్రధానంగా ఐదు రీచ్‌ల ద్వారా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక రూపొం దించారు. ప్రయోగాత్మంగా గతంలో వింజరం, దాచా రంల్లో ఇసుక నిల్వలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగా, ఈ ఏడాది రుద్రంకోట–1, రుద్రం కోట–2, ఇబ్రహీంపేటల్లో కొత్తగా మూడు రీచ్‌లను అధికారులు గుర్తించారు. గిరిజన సొసైటీ పరిధిలో నమోదైన ఆదివాసీ సంఘాలకు రూ.10 లక్షల పైబడి డిపాజిట్లతో ఇసుక రీచ్‌లు కేటాయిస్తూ మైనింగ్‌శాఖ అధికారులు ఇటీవల అనుమతులు ఇచ్చారు. గిరిజన సొసైటీలో తొమ్మిదిమంది సభ్యులు ద్వారా ఇసుక నిల్వలను వెలికి తీస్తారు. క్యూబిక్ మీటరుకు రూ.55 కింద చెల్లించి ఇసుకను వివిధ రంగాలకు తీసుకెళ్లవచ్చు.
పోలవరం పరిధిలో డీసిల్టింగ్ పాయింట్లు
జిల్లాలో పోలవరం మండలం పరిధిలో గోదావరి పరీవాహక ప్రాంతంలో గూటాల–1, గూటాల –2, పట్టిసీమల వద్ద డీసిల్టింగ్ పాయింట్లు మూడింటి ద్వారా బోట్స్‌మెన్ సొసైటీల ద్వారా ఇసుక నిల్వలు తరలింపు చేస్తారు. మూడింటికి కలిపి 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు వెలికితీయాలని నిర్ణయించారు. అన్నిచోట్ల ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ఇసుకను తరలించు కునే వెసులుబాటు కల్పించారు. త్వరలో అన్నిచోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ చేపట్టనున్నారు. యంత్రాల వాడకాలను నిషేధించారు.
పారదర్శకంగా ఇసుక సరఫరా
ఇసుక కొరత లేదు. పారదర్శకంగా ఇసుక సరఫరాను చేస్తాం. సీఆర్‌డీఏ పరిధిలో కొన్ని కంపెనీ లను ప్రభుత్వం ఎంపిక చేసింది. 350 ఎకరాలను ఆరు కంపెనీలకు ఇచ్చారు. సీఆర్‌డీఏ పరిధిలో పనులకు ఇబ్బందులు లేకుండా తహసీల్దార్ల ఎన్‌వోసీల ఆధారంగా వారికి ఇసుక కేటాయింపులకు చేస్తున్నాం. ఎడ్లబళ్లపై ఉచితంగా ఇసుకు తీసుకెళ్లవచ్చు.
– బి.జగన్నాథరావు, ఇన్‌చార్జి మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్