Share News

ఇసుక కష్టాలకు...చెక్‌!

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:20 AM

ప్రభుత్వం ఇసుక విధానంలో జిల్లా అవసరాలకు ఇసుకను సిద్ధం చేయడానికి ఎనిమిది ఓపెన్‌ ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. సుదీర్ఘంగా ఎనిమిది నెలల కసరత్తు తర్వాత గోదావరి పరివాహాక ప్రాంతంలో కొత్త ఇసుక రీచ్‌లకు యంత్రాంగం అనుమతిలిచ్చింది.

ఇసుక కష్టాలకు...చెక్‌!
ఇబ్రహీంపట్నం వద్ద ఇసుక (ఫైల్‌)

జిల్లాలో ఎనిమిది రీచ్‌లు సిద్ధంజిల్లాలో ఎనిమిది రీచ్‌లు సిద్ధం

సుదీర్ఘ కసరత్తు తర్వాత అనుమతులు

4.18 లక్షల మెట్రిక్‌ టన్నుల లభ్యత

ఎడ్లబండ్ల ద్వారా పేదల ఇళ్లకు ఉచితం

ఇతర అవసరాలకు మెట్రిక్‌ టన్నుకు రూ.95 ధర

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ఇసుక విధానంలో జిల్లా అవసరాలకు ఇసుకను సిద్ధం చేయడానికి ఎనిమిది ఓపెన్‌ ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. సుదీర్ఘంగా ఎనిమిది నెలల కసరత్తు తర్వాత గోదావరి పరివాహాక ప్రాంతంలో కొత్త ఇసుక రీచ్‌లకు యంత్రాంగం అనుమతిలిచ్చింది. దీంతో నిర్మాణ రంగానికి, పేదల ఇళ్లకు ఇసుకను తరలించుకోవడానికి ఇక్కట్లు తీరనున్నాయి.

ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 16 ఇసుక రీచ్‌ల ద్వారా నలుమూలలకు ఇసుక తరలించుకునేవారు. జిల్లాల విభజన తర్వాత ఏలూరులో ఒక రీచ్‌ కూడా లేకుం డా పోయింది. దీంతో ఇసుక రీచ్‌ల అన్వేషణకు యంత్రాంగం చేపట్టిన కసరత్తులు ఫలించాయి ఇటీవలే జిల్లా కమిటీలో ఓపెన్‌ రీచ్‌లు 5, డీసిల్టేషన్‌ పాయింట్ల మూడు చోట్ల నుంచి ఇసుక తరలింపునకు వివిధ కమిటీలు, పర్యావరణశాఖ అనుమతులతో ఇటీవల కొలిక్కి వచ్చాయి. కొత్తగా ఐదు రీచ్‌లు ఏర్పాటు కాగా, పోలవరం పరిసరాల్లో మరో మూడు పాత రీచ్‌లను పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉగాది నాటికి పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలను చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కొత్త రీచ్‌ల రాకతో పేదల ఇళ్లకు ఇసుక కొరత సమస్య పరిష్కారానికి ఆస్కారం ఏర్పడింది.

ముంపు మండలాల్లోనే రీచ్‌లు

జిల్లాలో ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణ అవసరా లకు ఇసుక నిల్వలను అందుబాటులోకి తీసుకురావడానికి ఎనిమిది ఇసుక రీచ్‌లకు యంత్రాంగం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం 4లక్షల18 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక లభ్యత ఉంటుందని అంచనా. గోదావరి పరివాహాక ప్రాం తంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో దాచారంలో 62,528 మెట్రిక్‌ టన్నులు, ఇబ్రహీంపట్నంలో

74,084 మెట్రిక్‌ టన్నులు, వింజరంలో 73,650, రుద్రమకోట–1,2 ఇసుక రీచ్‌ల్లో 74,400 వేల చొప్పున మొత్తం 3.58,161 మెట్రిక్‌ టన్నులను సిద్ధం చేయనున్నారు. ఈ ఐదింటికి మైనింగ్‌, పర్యావరణ, ఇతర శాఖల అనుమతులన్నీ పూర్తి చేశారు. అవసరాన్ని బట్టి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ మెట్రిక్‌ టన్ను ఇసుక రూ.95 చొప్పున విక్రయాలు చేస్తారు. పేదలు ఎడ్లబండ్ల ద్వారా ఇళ్లకు ఇసుకను ఉచితంగా తరలించుకోవచ్చు. పీసా చట్టం ప్రకారం గిరిజన సంఘాలకు ఇసుక తోలకం పనులు అప్పగించనున్నారు.

పోలవరంలో మూడు రీచ్‌లు

పోలవరం మండలంలోని గూటాల–1, గూటాల–2 రీచ్‌ల్లో 15 వేల మెట్రిక్‌ టన్నులు, పట్టిసీమ రీచ్‌ నుంచి 30 వేల మెట్రిక్‌ టన్నులు కలిపి మొత్తం 60 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక లభ్యత ఉంటుందని అంచనా వేశారు. ఇక్కడ జలవనరులశాఖ అనుమతితో బోట్స్‌మెన్‌ సొసైటీలకు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలను కేటాయించనున్నారు. ఇక్కడ గతంలో నిల్వలు తగ్గిపోవడంతో ఆపేశారు. తాజా నిల్వలతో కొద్దిరోజుల్లో తోలకాలకు అనుమతులిస్తారు.

పక్కాగా ఏర్పాట్లు

జి.పాపారావు, మైన్స్‌ డీడీ

జిల్లాలో ఎనిమిది రీచ్‌ల్లో ఇసుక నిల్వలను జిల్లా స్థాయి కమిటీ కలెక్టర్‌ వెట్రిసెల్వి అధ్యక్షతన ఆమోదించారు. ఈ మేరకు ఇసుక నిల్వలను ప్రజల అవసరాలు తరలించుకునేలా, విక్రయాలు జరిపేలా అన్ని అనుమతులిచ్చాం. ఈ ఏడాది ఇక ఇసుక కొరత ఉండదని భావిస్తున్నాం.

Updated Date - Feb 03 , 2026 | 12:20 AM