Share News

ర్యాంపులున్నా ఇసుకకు ఇక్కట్లే..

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:08 AM

ఆచంటలో ర్యాంప్‌లు ఉన్నప్పటికీ ఏ ర్యాంప్‌ నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఇసుక లేని పరిస్థితి నెలకొంది.

ర్యాంపులున్నా ఇసుకకు ఇక్కట్లే..
కోడేరు ఇసుక ర్యాంప్‌

ఆచంట, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మాణ రంగం ఊపందుకుంది. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చినప్పటికి ఆచంట నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఆచంట నియోజకవర్గంలో సిద్దాంతం, నడిపూడి, కోడేరు, కరుగోరుమిల్లిలో నాలుగు ఇసుక ర్యాంప్‌లు ఉన్నాయి. గత ఏడాది నాలుగు నెలలుపాటు ఇసుక ర్యాంప్‌లు నడిచాయి. నియోజకవర్గంలో ర్యాంప్‌లు ఉన్నప్పటికీ ఏ ర్యాంప్‌ నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఇసుక లేని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లాలోని ప్రజలకు ఇసుకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

కొడమంచిలి స్టాక్‌ పాయింట్‌ ఖాళీ

ఇసుకకు కొరత లేకుండా ఉండేందుకు అధికారులు పలుచోట్ల ఇసుక స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. కొడమంచిలిలో పాయింట్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ కూడా ఇసుక అందుబాటులో లేదు. ర్యాంప్‌లు ప్రారంభించలేనప్పటికి కనీసం స్టాక్‌ పాయింట్‌లో అయినా ఇసుక నిల్వలు పెట్టాలని పలువురు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ సోమేశ్వరరావు మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లోనే స్టాక్‌ పాయింట్‌కు ఇసుక అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Updated Date - Apr 14 , 2026 | 12:08 AM