Share News

తీరం.. గుల్ల..గుల్ల

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:42 PM

తీరంలో మళ్లీ ఇసుక తవ్వకాలు యఽథేచ్ఛగా సాగుతున్నాయి. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని సముద్ర తీరం వెంబడి ఇసుక తవ్వి సరిహద్దులు దాటిస్తున్నారు.

తీరం.. గుల్ల..గుల్ల
వేములదీవిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు

నరసాపురం, మొగల్తూరు మండలాల్లో

యఽథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు

పక్క జిల్లాలకు తరలింపు

పట్టించుకోని అధికార యంత్రాంగం

నరసాపురం రూరల్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): తీరంలో మళ్లీ ఇసుక తవ్వకాలు యఽథేచ్ఛగా సాగుతున్నాయి. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని సముద్ర తీరం వెంబడి ఇసుక తవ్వి సరిహద్దులు దాటిస్తున్నారు. రోజుకు వందల ట్రాక్టర్లలో తరలించేస్తున్నారు. కొందరు అక్రమార్కులు నాయకులు, అధికారుల అండ దండలతో ఈ దందా చేస్తున్నారు. ఇసుక తవ్వకాల వల్ల సముద్రతీరానికి పెనుముప్పు వాటిల్లనున్నది. గత ప్రభుత్వ హయాంలో ఈ దందా జోరుగా సాగేది. లారీల్లో కూడా రాత్రి సమయాల్లో సరిహద్దులు దాటించేవారు. లేఅవుట్ల పూడిక, రోడ్ల నిర్మాణం, ఇళ్ల పూడిక పనులకు బొండు ఇసుక వినియో గిస్తున్నారు.గతంలో దీనికి డిమాండ్‌ ఉండేది కాదు. అయితే రోడ్ల నిర్మాణాలు, లేఅవుట్లు పెరగడంతో డిమాండ్‌ వచ్చి పడింది. ట్రాక్టర్‌ ఇసుక రూ.2 వేలు, అదే లారీ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. ఈ సొమ్ముంతా అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయి. అధికారులకు కొద్ది ముట్ట జెప్పి లక్షల్లో సంపాదిస్తున్నారు. తీర ప్రాంత రోడ్లపై నిత్యం ట్రాక్టర్లు, లారీలు ఇసుకతోనే దర్శనమిస్తున్నాయి. తీర ప్రాంత మండలంలో ఓ అధికారి కన్నుసన్నల్లోనే ఇదంతా సాగుతుందన్న ఆరోపణలు లేక పోలేదు. నరసాపురంలో చినలంక, పీఎం లంక, మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం, పేరుపాలెం, మోళ్లపర్రు గ్రామాల నుంచి ఎక్కువుగా ఇసుక ఎగుమతి జరుగుతోంది. బుధవారం వేములదీవి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న ఐదు బొండు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో అక్రమార్కులు, గ్రామస్థుల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తం ఈ దందాను నియత్రించాల్సిన పని రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌ శాఖల పరిధిలో ఉంది. వీరు పట్టించుకోకపోవడం వల్ల ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయ లుగా సాగుతోంది.

Updated Date - Mar 25 , 2026 | 11:42 PM