ఆగని ఇసుక దందా
ABN , Publish Date - May 05 , 2026 | 12:05 AM
ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ అబాసుపాలు అవుతూనే ఉంది.
ర్యాంపుల్లో లారీకి రూ.5 వేలు వసూళ్లు
వాస్తవంగా ఉండ్సాలిన ధర రూ.1800
మంత్రి రవీంద్రను కలిసిన టిప్పర్
లారీ యూనియన్ నాయకులు
పాలకొల్లు, మే 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ అబాసుపాలు అవుతూనే ఉంది. పలువురు అధికార పార్టీ నాయకులే ర్యాంపులలో దందాకు పాల్పడటంతో లారీ యజ మానులు, మరో వైపు ఇసుక కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ రీచ్‌లలో సౌకర్యాల మేరకు 5 యూనిట్లు ఇసుక ఎగుమతికి రూ.1800 నుంచి 2 వేలు వసూలు చేయాల్సి ఉండగా నేరుగా లారీలు నదిలోకి వెళ్లి ఎగుమతి చేసుకునే అవకాశం ఉన్న ర్యాంపుల్లో సైతం ఒక్కొ లారీకి రూ.4500 వసూలు చేస్తున్నారు. ఈ విధానాన్ని నిరసిస్తూ టిప్పర్ లారీ యజమానులు ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్నారు.లారీలు నిలుపుదల చేసి సమ్మె చేశారు. ఇప్పటికీ ర్యాంపులలో కొందరు రాజకీయ నాయకులు దోపిడీ, లారీలు రోడ్డెక్కితే కేసులు పేరుతో విజిలెన్స్, మైనింగ్ పోలీసు శాఖల ఇబ్బందులతో లారీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పడవల ద్వారా ఇసుక తెచ్చి ఎగుమతి చేసే జీడిగుంట, వాడపల్లి, ఔరంగాబాద్, కొవ్వూరు, పలు ర్యాంపులలో రూ.3 వేల నుంచి రూ.4 వేలు వసూలు చేస్తుంటే రెండు రోజులు క్రితం ఓపెన్ అయిన పెండ్యాల ర్యాంపులో 5 యూనిట్లు లారీ ఇసుకకు రూ.5500 ధర నిర్ణయించడంపై లారీ యజ మానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల ఆందోళనల అనంతరం రూ.500 తగ్గించి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో ఉభయ గోదా వరి జిల్లాల టిప్పర్ లారీ యూనియన్ నాయకులు మంత్రి కొల్లు రవీంద్రను క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిసి ఇబ్బందులను వివరించారు. అక్రమ కేసులు బనాయించకుండా ఓపెన్ రీచ్‌లలో ఇసుక ప్రభుత్వ నిర్ణీత ధరకే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు యూనియన్ నాయకుడు రావూరి చెప్పారు.