Share News

ఉప్పునీటి కయ్యలు ఆ.. గ్రామాలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:06 AM

ఒకప్పుడు స్వచ్ఛమైన గోదావరి జలాలతో కళకళలాడిన గ్రామాలు ఆక్వా చెరువుల ప్రభావం తో ఉప్పు కయ్యలుగా మారుతున్నాయి.

ఉప్పునీటి కయ్యలు ఆ.. గ్రామాలు

కాలువల పక్కనే ఆక్వా చెరువులు

పంట కాలువలు, తాగునీటి

చెరువులు కలుషితం

వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు

కాళ్ల మండలం.. ఆందోళనకరం

అధికారుల నిఘా శూన్యం

ఒకప్పుడు స్వచ్ఛమైన గోదావరి జలాలతో కళకళలాడిన గ్రామాలు ఆక్వా చెరువుల ప్రభావం తో ఉప్పు కయ్యలుగా మారుతున్నాయి. వరి పంటకు గిట్టుబాటు లేకపోవడంతో రైతులు డాలర్ల పంట వైపు మొగ్గు చూపడంతో వరిచేల స్థానంలో ఆక్వా చెరువులు వెలిశాయి. కొన్నిచోట్ల రొయ్యల సాగు కోసం అక్రమంగా ఉప్పునీటి బోర్లు తవ్వేస్తున్నారు. ఉప్పునీటి బోర్లు వల్ల భూగర్భ జలాలు పాడై పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాళ్ళ, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ఆక్వా జోన్‌ పేరిట జిల్లాలో ఇష్టానుసారం చెరువులు తవ్వడం, పంట కాలువల వెంబడి ఎగువ ప్రాంతంలో సాగు చేస్తున్న చేపలు, రొయ్యల చెరువుల నీటిని పంట కాలువల్లోకి వదిలేయడంతో తాగు, సాగునీరు కలుషితమవుతోంది. ఏ పంట కాలువ, మంచి నీటి చెరువుల్లో చూసినా ఉప్పునీటి శాతం సుమారు ఐదు శాతం ఉంటుందని అధికారుల అంచనా. ఈ నీరు తాగి వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇటీవల క్యాన్సర్‌ వ్యాధి బారిన పడిన వారిలో అత్యధిక శాతం గోదావరి జిల్లాలోని శివారు ప్రాంతాల వారిదే అని, దీనికి కలుషిత నీరే కారణమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

ఎక్కడ బోరు వేసినా ఉప్పు నీరే

జిల్లాలో శివారు మండలమైన కాళ్ళ మండలంలోని ఏలూరుపాడు, జువ్వలపాలెం, కలవపూడి, ప్రాతాళ్ళమెరక, పల్లిపాలెం, మోడి, బోస్‌ కాలనీ, మాలవానితిప్ప, ఆనందపురం, ఎల్‌ఎన్‌ పురం, ఇసుకలంక, మేకలదిబ్బ, గోగుతిప్ప, గాంధీనగర్‌, సత్యనారాయణపురం తదితర గ్రామాల్లో తాగునీటి కోసం ఎక్కడ బోరు వేసినా ఉప్పునీరు వస్తుందని ప్రజలు తెలుపుతున్నారు. ఒకప్పుడు ఈ గ్రామాలను ఆనుకుని ఉన్న పంట, మురుగు కాలువలు స్వచ్ఛమైన జలాలు ఉండటంతో ఆ నీటినే తాగడంతోపాటు వాటిలో ఉండే మత్స్య సంపదతో జీవనం సాగించేవారమని, ఇప్పుడు ఈ పరిస్థితి లేదని, కనీసం వాడకానికి కూడా నీరు పనిచేయడం లేదని ప్రజలు తెలుపుతున్నారు. తాగునీటి కోసం ప్రైవేట్‌ ఆర్‌వో ప్లాంట్‌లపై ఆధారపడాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు పంట, మురుగు కాలువల ప్రక్షాళన చేపట్టారు. ప్రభుత్వం, దాతల సహకారంతో మైక్రో మినరల్‌ వాటర్‌ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు కూడా పట్టించుకుని ఉప్పునీటి బోర్లను శాశ్వతంగా తొలగించి పంట కాలువలను, మంచినీటి చెరువులను కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ప్రభుత్వమే ఆర్వో వాటర్‌ ఉచితంగా అందించాలి

ఆక్వా సాగులో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉప్పు నీటి బోర్లు వేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. దీనివల్ల తాగునీరు కలుషితమై ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు వీటిని నిలువరించడంతోపాటు ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఆర్‌వో వాటర్‌ అందించి ఆరోగ్యాన్ని కాపాడాలి.

– గొర్ల రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు

Updated Date - Apr 14 , 2026 | 12:06 AM