Share News

ఉప్పునీటి గండం!

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:06 AM

ఉప్పుటేరులోకి ముందస్తుగానే సముద్రపు ఉప్పునీరు రావడంతో కొండంగి 1, 2 ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరా నిలుపుదల చేశారు. దీంతో చేపలసాగు ప్రశ్నా ర్థకంగా మారింది.

ఉప్పునీటి గండం!
ఉప్పుటేరులోకి చేరిన సముద్రపు ఉప్పు నీరు

ముందస్తుగానే ఉప్పుటేరులోకి రాక

కొండంగి ఎత్తిపోతలు నుంచి నీటి సరఫరా నిలిపివేత

చేపల సాగుపై ప్రభావం.. ఆక్వా రైతుల ఆవేదన

కలిదిండి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి):ఉప్పుటేరులోకి ముందస్తుగానే సముద్రపు ఉప్పునీరు రావడంతో కొండంగి 1, 2 ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరా నిలుపుదల చేశారు. దీంతో చేపలసాగు ప్రశ్నా ర్థకంగా మారింది. మండలంలో సుమారు 30 వేల ఎకరాల్లో చేపలసాగు చేస్తున్నారు. ప్రధానంగా ఉప్పుటేరు పైనే ఆధారపడి చేపలసాగు చేస్తున్నారు. గతంలో ఏప్రిల్‌, మే నెల వరకు ఉప్పునీరు వచ్చేది కాదు. ఈ ఏడాది దాళ్వాసాగు లేకపోవడంతో కాల్వలు కట్టేయడంతో కాల్వల నీరు ఉప్పుటేరులోకి దిగకపోవడంతో ఫిబ్రవరి లోనే ముందస్తుగానే ఉప్పునీరు వచ్చింది. చెరువులకు నీరు తోడుకోవ డానికి తీపినీరు లేక ఆక్వారైతులు అవస్థలు పడుతున్నారు. తీపినీటిలో మాత్రమే తెల్లచేపలు, శీలావతి, బొచ్చు పెరుగుతాయి. లక్షలాది రూపాయల పెట్టుబడితో చేపల సాగు చేస్తున్న రైతులు ఉప్పునీరు ముందుగా రావడంతో చిన్నచేపలనే పట్టుబడి చేసి అయినకాడికి అమ్ముకుని నష్టాల పాలవుతున్నారు. ఆగస్టు వరకు ఉప్పుటేరులో నీరు తీపిబడే అవకాశం కనిపించడం లేదని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పు టేరులో చిన్నగొల్లపాలెం వద్ద రెగ్యులేటర్‌ నిర్మిస్తే ముందస్తు ఉప్పునీటి సమస్య పరిష్కారం అవు తుందని పేర్కొంటున్నారు.

ఉప్పుటేరుపై రెగ్యులేటర్లు నిర్మించాలి

ఉప్పుటేరులోకి ముందస్తుగా ఉప్పునీరు రావడంతో ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేశాం. ఐదు నెలల పాటు ఉప్పునీరు ఉంటుంది. గతంలో మంజూరైన ఆకివీడు సమీపంలో కొట్టాడ, చిన్నగొల్లపాలెం సమీపంలో రెగ్యులేటర్లను నిర్మిస్తే ఉప్పునీటి ముంపు తప్పుతుంది. లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయి.

– వేగిరెడ్డి చిన్నారావు, ఎత్తిపోతల కమిటీ చైర్మన్‌

Updated Date - Feb 19 , 2026 | 12:06 AM