సదరం..ఓ నరకం!
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:10 AM
దివ్యాంగులకు ఆత్మస్థైర్యం కల్పించడానికి తోడుగా, అండగా మేము ఉన్నామంటూ ప్రభుత్వాలు వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి పెన్షన్ పథకం చేపట్టింది.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగుల ఇబ్బందులు
కానరాని హెల్ప్‌డెస్క్‌లు.. అందుబాటులో లేని వీల్‌చైర్స్
నేడు, రేపు సదరం సర్టిఫికెట్ల జారీకి వైద్య పరీక్షలు
ఏలూరు క్రైం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి):దివ్యాంగులకు ఆత్మస్థైర్యం కల్పించడానికి తోడుగా, అండగా మేము ఉన్నామంటూ ప్రభుత్వాలు వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి పెన్షన్ పథకం చేపట్టింది. వివిధ వ్యాధుల కేటగిరిని బట్టి రూ.ఆరువేల నుంచి రూ.15 వేల వరకు ఒక్కొక్కరికి నెలకు ప్రభుత్వం అందిస్తుంది. ఈ పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉండితీరాలి. ఈ ఆధార్‌కార్డు ద్వారా సచివాలయంలో సదరం స్లాట్‌ను ఏ కేటగిరి అంగవైకల్యం ఉందో ఆ కేటగిరికి స్లాట్ బుక్ చేసుకోవాలి. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రులను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో గతనెల 25న అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 22 రకాల వివిధ వైకల్యాలకు సదరం సర్టిఫికెట్లు జారీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతనెల 30వ తేదీ నుంచి సదరం సర్టిఫికెట్ జారీ చేయడానికి వైద్య పరీక్షలను చేపట్టారు. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి గతనెల 30, 31 తేదీల్లో స్లాట్‌లు బుక్ చేసుకున్న పలువురు దివ్యాంగులు వైద్య పరీక్షల నిమిత్తం వచ్చారు. వీరిలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారికి సంబం ధించిన సర్టిఫికెట్లు ఎక్కడ జారీ చేస్తారో, ఎవరు పరీక్షలు జరుపుతారు, ఎక్కడకు వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వీల్‌చైర్స్ కావాలంటే..
నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల ప్రయోజనార్థం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వందలాది వీల్ చైర్లను దాతలు అందించినా అవి అందుబాటులో లేకుండా గదుల్లో భద్రపరిచారనే విమర్శలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న కొన్ని వీల్‌చైర్స్ ఎక్కడ ఇస్తారో తెలియని పరిస్థితి. పైగా ఆ వీల్ చైర్ పొందాలంటే వచ్చినవారి ఫోన్, ఆధార్ కార్డు కాని వారి వద్ద జామీనుగా పెట్టాలి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వీల్‌చైర్స్‌తో ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలు సిద్ధంగా ఉంటారని వారే సంబం ధిత వైద్య విభాగాల వద్దకు తీసుకెళ్తారని దివ్యాంగులు చెబుతున్నారు. ఇక్కడ కనీసం వీల్‌చైర్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఒక విభాగానికి వెళ్లితే ఇక్కడ కాదంటూ మరో విభాగానికి వెళ్లమంటున్నారని చివరకు తమకు నరకం చూపిస్తున్నారంటూ దివ్యాంగులను తీసుకొచ్చిన కుటుం బ సభ్యులు వాపోతున్నారు. ఈనెల 6, 7 తేదీల్లోను సదరం సర్టిఫికెట్ జారీకి వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని, ఏ రూములో ఏ అంగవైకల్య పరీక్షలు జరుపుతారో వివరాలు చెప్పేందు కు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని లేదా కనీసం బోర్డులను ఏర్పాటు చేయాలని, వీల్ చైర్‌లను హెల్ప్‌డెస్క్ వద్ద అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.