Share News

ముంచేశారు..!

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:49 AM

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. సంఘాలకు మంజూరైన కమీషన్‌ సొమ్ము దుర్వినియోగం అవుతుందన్న ఉద్దేశంతో నాటి పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ మహిళా సమాఖ్య భవనాలకు ప్రతిపాదన చేశారు.

ముంచేశారు..!
అలంపురంలో మహిళా సమాఖ్య భవనం

ఉమ్మడి పశ్చిమకు 903 మహిళా సమాఖ్య భవనాల మంజూరు

251 పూర్తి.. వివిధ దశల్లో మిగిలినవి.. బిల్లులు రాక కాంట్రాక్టర్ల గగ్గోలు

ధాన్యం కమీషన్‌ సొమ్ములు రాకపోవడంతో ఆగిన చెల్లింపులు

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. సంఘాలకు మంజూరైన కమీషన్‌ సొమ్ము దుర్వినియోగం అవుతుందన్న ఉద్దేశంతో నాటి పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ మహిళా సమాఖ్య భవనాలకు ప్రతిపాదన చేశారు. దానికోసం కమీషన్‌ సొమ్ములు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. 903 పంచాయతీల్లోనూ మహిళా భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అందులో 251 భవనాలను పూర్తిచేశారు. మిగిలినవి వివిధ దశల్లో నిలిచిపోయాయి. అయితే నిర్మాణాలు చేపట్టిన కాంట్ర్టాక్టర్ల బిల్లులు రూ.20 కోట్లు రాలేదు. దీంతో వారంతా ఘొల్లుమంటున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాలో అప్పటి కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ప్రతి పంచాయతీ లోనూ సమాఖ్య భవనం నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి రూ.7 లక్షలు, గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి రూ.6 లక్షల నిధులు కేటాయిం చారు. మొత్తంపైన ఒక్కో భవనానికి రూ.13 లక్షల అంచనాతో నిర్మాణాలు మొదలెట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో బిల్లులు మంజూరయ్యాయి. వీటిలో పూర్తయిన 251 భవనాలకు వాటికి రూ.15 కోట్లు, నిర్మాణంలో వున్న వాటికి రూ.5 కోట్లు వరకు రావాల్సి వుంది. గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో కేటాయించిన నిధులకు మాత్రం బిల్లులు ఇవ్వలేదు. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పౌరసరఫరాల కార్పొ రేషన్‌ ద్వారా డీఆర్‌డీఏకు ధాన్యం కమీషన్‌ సొమ్ములు రావాలి. అక్కడ నుంచి బిల్లులు మం జూరు కావాలి. కానీ 2018 నుంచి కమీషన్‌ సొమ్ములను మంజూరు చేయడంలో జాప్యం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలును నిలిపివేశారు. సహకార సొసైటీలకు మాత్రమే ధాన్యం కొనుగోలు భాధ్యతలు అప్పగించారు.

ఆరా తీస్తున్న నేతలు

పంచాయరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ పర్యవే క్షణలో గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఆ బాధ్యతలను ఏలూరు, జంగారెడ్డిగూడెం, నర్సాపురం డివిజన్‌ల పరిధిలోని పంచాయతీ రాజ్‌ ఈఈలకు అప్పగించారు. పనులు చేపట్టారు. కానీ డీఆర్‌డీఏ నిధులకు సంబంధించి బిల్లులు మంజూరు కాలేదు. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లాలోనే మహిళా సమాఖ్య భవనాలను నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో దానిపై పట్టించుకోలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా భవన నిర్మాణదారుల్లో ఆశలు చిగురించాయి. బకాయిల కోసం డీఆర్‌డీఏ అధికారుల చుట్టూ తిరిగారు. కూటమి నేతలను సంప్రదించారు. ముఖ్యంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయంపై అధికారులతో చర్చలు జరిపారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ నుంచి రూ.100 కోట్లు బకాయిలు రావాలంటూ డీఆర్‌డీఏ అధికారులు చెప్పుకొచ్చారు. అవి నిలిచిపోవడం వల్లే బకాయిలు చెల్లించకపోయారంటూ తేలింది. భవనాలు మధ్యలోనే నిలిచిపోయాయి. జిల్లా పరిషత్‌ సమావేశంలోనూ దీనిపై చర్చ జరుగుతోంది. కానీ బిల్లులు మాత్రం రావడం లేదు. గతంలో బకాయి పడ్డ కమీషన్‌ను పౌరసరఫరాల కార్పొరేషన్‌ విడుదల చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Updated Date - Feb 03 , 2026 | 12:49 AM