Share News

వ్యర్థ ప్రయత్నం

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:29 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోయడం ద్వారా అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా, కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాలకు సాగు నీరందించేందుకు వేలేరుపాడు మండలం రుద్రమ్మకోటలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 2005లో శ్రీకారం చుట్టారు.

వ్యర్థ ప్రయత్నం
రుద్రమ్మకోట ఎత్తిపోతల పథకం కోసం నిర్మించిన హైలెవెల్‌ ట్యాంకులు

అర్ధంతరంగా నిలిచిపోయిన రుద్రమ్మకోట ఎత్తిపోతల పథకం

భారీ ఇనుప పైపుల అపహరణ

రూ.800 కోట్లు మట్టిపాలు

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంతో బ్యాక్‌ వాటర్‌ను ఖమ్మం, కృష్ణా జిల్లాలకు తాగు, సాగు నీరుగా మళ్లించడానికి 2005లో రుద్రమకోట ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. రూ.800 కోట్ల పనులు పూర్తయిన దశలో అర్థాంతరంగా పథకం నిలిచిపోయింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేదు.. పథకం ఊసే లేదు. అయితే పథకం నిర్మాణానికి వినియోగించే భారీ ఇనుప పైపులైన్‌ను అక్రమార్కులు కట్‌చేసి పాత ఇనుప సామగ్రిగా తరలించేస్తున్నారు.

వేలేరుపాడు, మే 31(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోయడం ద్వారా అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా, కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాలకు సాగు నీరందించేందుకు వేలేరుపాడు మండలం రుద్రమ్మకోటలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 2005లో శ్రీకారం చుట్టారు. తొలుత రూ.1630 కోట్లు అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా పనులు మొదలయ్యే సమయానికి రూ.2400 కోట్లకు పెంచేశారు. 2008 నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రుద్రమ్మకోట వద్ద భారీ పంపులతో కాల్వ ద్వారా అల్లూరి నగర్‌ వద్ద నిర్మించే భారీ సంపులోకి నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి మరోసారి మోటార్లు ద్వారా హైలెవెల్‌ ట్యాంకులకు నీరు తోడి అక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని ఇప్పటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద ఉన్న బేతుపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు పనులు ప్రారంభించారు. దీనికోసం అల్లూరి నగర్‌ వద్ద భారీ సంపు నిర్మాణం, 3 హైలెవెల్‌ ట్యాంకులు నిర్మాణం చేపట్టారు. దాదాపు 60శాతం మూడు వరుసల పైపులైన్లను కూడా నిర్మించారు. మొదటి దశ రూ.1445 కోట్లు కేటాయించగా సుమారు రూ.800 కోట్లు ఖర్చు చేశారు. ప్రతిపాదిత రుద్రమ్మకోట ప్రాంతం ఎత్తిపోతలకు అనువుగా ఉందా లేదా చూడకుండా మిగతా పనులు ప్రారంభించారు. పోలవరం పూర్తయ్యేలోపే రుద్రమ్మకోట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేది అప్పటి ప్రభుత్వ లక్ష్యం. అనంతరం కాలంలో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తరువాత ఈ ఎత్తిపోతల పథకాన్ని రుద్రమ్మకోట నుంచి మండలంలోని తిరుమలాపురం వద్ద ప్రారంభించేందుకు అధికారులు సర్వే చేశారు. ఈలోపు రూ.800 కోట్లు ఖర్చు చేసి కొన్ని పనులు పూర్తి చేశారు. అనంతరం పరిణామాలతో రుద్రమ్మకోట ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది.

భారీ పైపులు చోరీ

రుద్రమ్మకోట ఎత్తిపోతల పథకం పైపులైన్ల నిర్మాణానికి వందల సంఖ్యలో భారీ ఇనుప పైపులను వినియోగించారు. పనులు నిలిచిపోవడంతో కొన్ని పైపు మిగిలిపోయాయి. ఒక్కొక్క పైపు రూ.3లక్షలు విలువ ఉంటుందని అప్పటి అంచనా. భారీ పైపులను రాత్రికి రాత్రే గ్యాస్‌ కట్టర్లతో కత్తిరించి వాహనాల ద్వారా విజయవాడలోని పాత ఇనుప సామాన్ల కొట్లకు తరలించుకుపోతున్నారు. ప్రాజెక్టు కోసం ఖర్చుపెట్టిన రూ.800 కోట్లు వృథా కాగా పైపులు సైతం అపహరిస్తున్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:29 AM