Share News

ముంపులో మన ‘మూలాలు’

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:51 AM

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట గ్రామంలో ఆదిమానవుల జీవనానికి అద్దంపట్టే ఆనవాళ్లు బయటపడ్డాయి. 2018లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో అతి పురాతన భారీ సమాధులు వెలికివచ్చాయి.

ముంపులో మన ‘మూలాలు’
ఆది మానవుల సమాధి

పోలవరం ప్రాజెక్టు పరిధిలో రుద్రం కోట

కాకతీయ సామ్రాజ్ఞీ వేసవి విడిది ప్రాంతం

ఆదిమానవుల ఆనవాళ్లు ఇక్కడ లభ్యం

10 అడుగుల సమాధుల్లో పూసలు, పాత్రలు

రుద్రమ ప్రతిష్ఠించిన శివలింగానికి ఇప్పటికీ పూజలు

గోదారిలో కనుమరుగు కాకముందే మేల్కొనాలి

వాటిని తరలించి ప్రభుత్వం పరిరక్షించాలి

(వేలేరుపాడు, ఆంధ్రజ్యోతి)

సాధారణంగా ఒక ప్రాంతానికి ప్రాచీన గతమో లేక చారిత్రక ఘనతో ఉంటుంది. కానీ, రుద్రమ కోట...అటు మన ప్రాచీన మూలాలను, ఇటు కాకతీయ సామ్రాజ్ఞీ రాణి రుద్రమ గుర్తులను తనలో దాచుకుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలో గ్రామం ఉండటంతో... ఇలాంటి అరుదైన, అపురూపమైన ఆనవాళ్లు కనుమరుగు కానున్నాయి. ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని గ్రామంలోని చారిత్రక, పురాతన ఆధారాలను వేరే ప్రాంతానికి తరలించి వాటిని పరిరక్షించాలి.

ఆది..మూలాలు..

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట గ్రామంలో ఆదిమానవుల జీవనానికి అద్దంపట్టే ఆనవాళ్లు బయటపడ్డాయి. 2018లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో అతి పురాతన భారీ సమాధులు వెలికివచ్చాయి. అప్పటి వరకు ఈ సమాధులను స్థానికులు రాతి గుట్టలుగా భావించారు. అయితే, వాటి లోపల లభించిన వస్తువులను బట్టి ఆది మానవుల ఉనికిని తెలుసుకోగలిగారు. నాడు వారు విలాస జీవితం గడిపారనేందుకు గుర్తులుగా సమాధుల్లో పూసలు లభించాయి. దీన్నిబట్టి మరణించినవారితోపాటు వారికి ఇష్టమైన వాటినీ సమాధిలో ఉంచే సంప్రదాయం ఆది నుంచీ ఉన్నదని తెలుస్తోంది. ఆది మానవులు బహుబలుల్లా ఉండేవారనేందుకు సాక్ష్యంగా ఒక్కో సమాధి ఆరు అడుగుల వెడల్పు, పది అడుగుల పొడవు ఉంది. సింధు నాగరికతకంటే ముందే ఈ ప్రాంతంలో ఆది మానవులు ఉన్నారనేందుకు గుర్తుగా ఇనుప గొడ్డళ్లు, కత్తులు లభ్యమయ్యాయి. గృహ అవసరాల కోసం వాడిన మట్టి పాత్రలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇనుప పనిముట్ల కర్మాగారం మొదలు అలంకరణ సామగ్రి తయారీ కేంద్రాల వరకు.. ఇక్కడ నుంచే నిర్వహించి గుజరాత్‌ వరకు వర్తకం చేసే వారన్న దానికి ఆధారాలు లభించాయి.

రుద్రమ గుర్తులు..

కాకతీయ సామ్రాజ్యం విస్తరించిన ముఖ్య ప్రాంతాల్లో రుద్రంకోట ఒకటి. రాణీ రుద్రమ ఇక్కడ వేసవిలో విడిది చేసేవారు. దీనికోసం గ్రామం పక్కనే గుట్టపై కోటను నిర్మించారు. ఆ కోట వల్ల ఈ గ్రామం పేరు రుద్రమ కోట అయింది. ఇక్కడ సైనిక స్థావరాలు, ఆయుధాగారాలు ఉండేవనేందుకు ఆధారాలు లభిస్తున్నాయి. కాకతీయ శిల్ప కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నాడు రాతితో చెక్కన స్తంభాలు అనేకం కనిపిస్తున్నాయి. శివ భక్తులైన రాణీ రుద్రమ దేవి ఇక్కడ ఆలయాన్ని, బహు ఉపాలయాలను నిర్మించినట్లు ఆధారాలున్నాయి. కాలక్రమంలో ఇవన్ని భూగర్భంలో కలిసిపోగా, 1986లో గోదావరి వరదలకు భారీగా నేలకోతకు గురై రుద్రమ దేవి నిర్మించిన శివాలయం బయట పడింది. ఆమె ప్రతిష్ఠించిన శివ లింగం, నంది విగ్రహాలు కంటపడటంతో గ్రామస్థులు ఒక ఆలయాన్ని నిర్మించి తిరిగి వాటిని పునఃప్రతిష్ఠించారు. ఇలా వందల వేల ఏళ్ల నాటి ఘనచరిత్ర కలిగిన రుద్రమ కోట గ్రామం క్రమక్రమంగా తన ప్రాభావాన్ని కొల్పోతూ కళావిహీనంగా మారుతోంది. పూర్వకాలంలో జమీందార్లతో పోటీ పడే విధంగా స్థానికుల జీవనం ఉండేది. అది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈ ప్రాంతంలోని వారు వేరే ప్రాంతాల్లో స్థిరపడి అక్కడ జీవనం సాగిస్తుండగా, వారు వదిలివేసి వెళ్లిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ కొంతమందే ఇక్కడ ఉంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ పరిస్థితి కూడా కనుమరుగు కానుంది. ఈ లోపే ప్రభుత్వం స్పందించి ప్రాచీన శిలా స్తంభాలు, విగ్రహాలను భద్రపరచాలి. పర్యాటకులకు గత వైభవాన్ని ప్రదర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jul 21 , 2026 | 12:51 AM