సంక్రాంతి అదిరింది !
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:40 AM
ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో అత్యధికంగా ఈనెల 19వ తేది సోమవారం ఆర్టీసీకి అత్యధిక ఆదాయం లభించింది.
పండుగ రోజుల్లో ఆర్టీసీకి రూ.2.92 కోట్ల ఆదాయం
భీమవరంటౌన్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో అత్యధికంగా ఈనెల 19వ తేది సోమవారం ఆర్టీసీకి అత్యధిక ఆదాయం లభించింది. ఒక లక్షా 18 వేల కిలోమీటర్ల బస్సులను నడపటం ద్వారా 102 ఓఆర్ రావడంతోపాటు అత్యధికంగా రూ.66 లక్షల 89 వేలు ఆదాయం లభించింది. జిల్లాలోని నాలుగు డిపోల్లో భీమవరం డిపో అత్యధికంగా 20 లక్షల 12 వేల 430 ఆదాయం వచ్చింది. మిగిలిన డిపోలు కూడా అనుకున్నదాని కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందాయి. సంక్రాంతి సీజన్‌లో 5 రోజుల పాటు 6 లక్షల 17 వేల 351 వేల కిలోమీటర్లు బస్సులను నడిపి రూ.2 కోట్ల 92 లక్షల 58 వేలు ఆదాయాన్ని ఆర్జించారు. ఇందులో అందరి కృషి ఉందని జిల్లా ప్రజా రవాణాధికారి అన్నారు. సంక్రాంత్రి సీజన్‌లో అత్యధిక ఆదాయంతో పాటు లక్షమంది దాకా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు. గ్యారేజిలోని సిబ్బందికి కండక్టర్లకు, డ్రైవర్లకు స్వీట్స్ పంపిణీ చేశారు. ట్రాఫిక్ సీఐ సురేష్ బాబు ఆర్‌ఎం ఆఫీస్ సూపరింటెండెంట్ బాలు సుబ్రహ్మణియన్, ప్రకాష్, డీఎం కృష్ణ తదితరులు ఉన్నారు. భీమవరం డిపో 36 వేల కి.మీ నడిపి రూ.20 లక్షల 12వేల ఆదాయం వచ్చింది.నరసాపురం డిపో 27 వేల కిలోమీటర్లు నడిపి రూ.16 లక్షలు, తాడేపల్లిగూడెం డిపోలో 24 వేల కి.మీ మీటర్లు నడిపి రూ.14.66 లక్షలు, తణుకు డిపోలో 29 వేల కి.మీకు రూ.16.04 లక్షలు ఆదాయం సాధించాయి.
కార్గో సేవలకు ప్రథమస్థానం
ఆర్టీసీ సంస్థ కార్గో సర్వీస్‌ల్లో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్ధానం దక్కించుకుంది. కార్గో మాసోత్సవాల్లో డోర్ డెలివరీ బుక్కింగ్‌లో ఇచ్చిన లక్ష్యాలను మించి బుక్ చేసింది. జిల్లాలో అత్యధిక శాతం సాధించి తాడేపల్లిగూడెం ప్రథమ స్థానంలో నిలిచింది. ఆర్టీసీ కార్గో సర్వీసును ప్రారంభించిన తరువాత ప్రతీ ఏడాది డిసెంబరు 20 నుంచి జనవరి 19 వరకు కార్గో డెలివరీ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. కార్గో సర్వీసులపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో బుక్కింగ్‌లు కూడా పెరుగుతున్నాయి. మారుమాలు గ్రామలకు సైతం కార్గో సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. సోమవారంతో మాసోత్సవాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాఽధికారులు ర్యాంకులను ఇచ్చారు. ఈనెల 26న జరిగే రిపబ్లిక్ డేలో ఆర్టీసీ ఎండీ చేతుల మీదుగా ఆర్‌ఎం ప్రసాదరావు, కార్డో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మాధవరావు అవార్డు అందుకోనున్నారు. జిల్లాకు 4,482 బుక్ చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించగా నాలుగు డిపోల్లోను కలిపి ఇచ్చిన లక్ష్యం కంటే అత్యధికంగా 13,057 డోర్ డెలివరీలు బుక్ చేసి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది.