ఉచిత ప్రయాణం.. మాకు లేదా!?
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:11 AM
ప్రజా రవాణలో చింతలపూడి మండలం బాగా వెనుకబడి ఉంది. మండలంలోని సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ సర్వీసు లేవు. గత ఐదేళ్లలో రోడ్లు బాగోలేదన్న నెపంతో చాలా సర్వీసులు రద్దు చేశారు.
చింతలపూడి మండల మహిళల నిట్టూర్పు
తెలంగాణ సరిహద్దులోఉండడమే కారణం..
అంతర్రాష్ట్ర సర్వీసుల నెపంతోఅనుమతించని వైనం..
చింతలపూడి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా రవాణలో చింతలపూడి మండలం బాగా వెనుకబడి ఉంది. మండలంలోని సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ సర్వీసు లేవు. గత ఐదేళ్లలో రోడ్లు బాగోలేదన్న నెపంతో చాలా సర్వీసులు రద్దు చేశారు. ఈ మండలం తెలంగాణ సరిహద్దులో ఉంది. మండలం లోని చాలా గ్రామాలకు బస్సు సర్వీసులు లేక పోవడంతో స్త్రీ శక్తి పథకాన్ని విని యోగించుకోలేకపోతున్నామని మహిళలు నిట్టూర్చు స్తున్నారు. చింతలపూడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణించాలంటే ఇక్కడ నుంచి నడిచే సర్వీసుల్లో సగం తెలంగాణ రాష్ట్ర సర్వీసులే ఉన్నాయి. మరోవైపు అంతరాష్ట్ర సర్వీసుల పేరుతో ఏలూరు డిపోకు చెందిన బస్సుల్లో ఏలూరు నుంచి సత్తుపల్లి వెళ్లే వరకు మధ్యలో ఉన్న ఏ ఒక్క గ్రామానికి మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అనుమతించడం లేదు.
ఏలూరు నుంచి సత్తుపల్లికి 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చింతలపూడి మండలం రాష్ట్ర సరిహద్దు నుంచి సత్తుపల్లికి సుమారు పది కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఈ పది కిలోమీటర్ల దూరానికి అంతరాష్ట్ర సర్వీసు పేరుతో 70 కిలోమీటర్ల మేర స్త్రీ శక్తి పథకం వర్తించ దంటూ మహిళలను దింపేస్తున్నారు. మండలంలో 38 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. చింతలపూడి నుంచి ఏలూరుకు తిరిగే షటిల్ సర్వీసులను కూడా కాలం చెల్లిన బస్సులనే నడుపుతున్నారు. ఇవి మార్గమధ్యలో ఎక్కడ ఆగిపోతాయోనని బస్సు ఎక్కే ముందే ప్రయాణికులు భయాం దోళనలు చెందుతున్నారు.
రాష్ట్ర సరిహద్దులో ఉన్న తెలంగాణలోని అశ్వారావు పేటకు ఏలూరు నుంచి వయా చింతలపూడి– ఎర్ర గుంటపల్లి– జీలుగుమిల్లి మీదుగా సర్వీసులు నడిపే వారు. ప్రస్తుతం ఈ సర్వీసులను జీలుగుమిల్లి వరకే పరిమితం చేశారు. ఒక బస్సును మాత్రమే అశ్వారావు పేట వరకు నడుపుతున్నారు. అయితే అంతరాష్ట్ర సర్వీసు పేరిట ఈ బస్సులో స్ర్తీ శక్తి పథకం అమలు కావడం లేదు. దీంతో నేరుగా అశ్వారావుపేట వెళ్లే మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
జూ మరోవైపు చింతలపూడి మీదుగా ఒక్క ఎక్స్‌ప్రెస్ సర్వీసూ నడవడం లేదు. విజయవాడ వెళ్లడానికి సర్వీసులు లేవు. నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం బస్సు డిపో ఉన్నా ఆ డిపో వల్ల చింతలపూడి, లింగ పాలెం, కామవరపుకోట రూరల్ గ్రామాలకు ఉపయో గం లేదు. ఈ మూడు మండలాల్లో సర్వీసులు ఒకటి, అర తప్ప పెద్దగా లేవు. అంతరాష్ట్ర సర్వీసు పేరుతో నడిచే పల్లెవెలుగు బస్సులకు స్త్రీ శక్తి పథకం అమలు చేయాలని, లేదంటే మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఉపయోగం లేకుండా పోతుందని ఎమ్మెల్యే రోషన్‌కుమార్ జిల్లా సమీక్షా సమావేశంలోను ఆర్టీసీ అధికారులకు, కలెక్టర్‌కు పలుమార్లు విన్నవించారు. ఈ ప్రాంతంలో రాత్రి సర్వీసులు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తెచ్చారు. అయినా ఏ మార్పులేదు. కనీసం రాష్ట్ర సరిహద్దు గురుభట్లగూడెం, మరోవైపు మేడిశెట్టివారిపాలెం వరకు ఏపీ ఆర్టీసీ సర్వీసులు నడిస్తే మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఉపయోగం ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు వేశారు. రోడ్లు వేసిన గ్రామాలకు గతంలో నడిపిన సర్వీసులు పునః ప్రారంభించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఉచితం వర్తించదా..?
మాదాసు ధనలక్ష్మీ, మాజీ సర్పంచ్ వెంకటాపురం
మండలంలో సుమారు 20 గ్రామాలకు 16 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. రోడ్లు బాగోలేదని నిలిపివేశారు. ఇప్పుడు రోడ్లు వేసినా బస్సుల్లేవు. ఏలూరు నుంచి గురుభట్లగూడెం, సీతానగరం రాకపోకలు చేయాలంటే టికెట్ వసూలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలోని ఆంధ్ర బస్సులకు స్త్రీ శక్తి పథకం వర్తించదా ? ఈ గ్రామాల్లోని మహిళలకు ఉచితం దూరమేనా..?
మాకు ఉచితం లేదట..!
బైరా సీతమ్మ, మత్స్యకారిణి, శెట్టివారిగూడెం
మా గ్రామం నుంచి చింతలపూడి వెళ్లి ఏలూరు బస్సు ఎక్కితే ఇది ఉచితం కాదు.. ఎక్కడికైనా టికెట్ తీసుకోవా లని చెబుతున్నారు. మా గ్రామస్థులకు ఉచితం ఇవ్వడం లేదు. అదేమంటే ఈ బస్సుకు ఉచితం లేదని చెబుతున్నారు.