Share News

దివ్యాంగ శక్తి

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:53 AM

దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారిని శక్తివంతులను చేయడమే దివ్యాంగ శక్తి పథక ఉద్దేశమని కలెక్టర్‌ నాగ రాణి అన్నారు.

దివ్యాంగ శక్తి

జిల్లాలో ఉచిత ప్రయాణం ప్రారంభించిన కలెక్టర్‌, ఎమ్మెల్యేలు

26 వేల మందికి ప్రయోజనం

భీమవరం టౌన్‌/తణుకు రూరల్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారిని శక్తివంతులను చేయడమే దివ్యాంగ శక్తి పథక ఉద్దేశమని కలెక్టర్‌ నాగ రాణి అన్నారు. భీమవరం కొత్త బస్టాండ్‌ ఆవరణలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణాన్ని కలెక్టర్‌ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజ నేయులు (అంజిబాబు) బుధవారం ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వైకల్యంతో ఉన్న వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్య, వృత్తిపరంగా వారు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. జిల్లాలో 26 వేల మంది దివ్యాంగులు ఈ పథకంలో ప్రయోజనం పొందవచ్చన్నారు. దివ్యాంగులతో పాటు కలెక్టర్‌ నాగరాణి, ఆర్డీవో కె.ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం ఎస్‌.గిరిధర్‌ కుమా ర్‌ వీరవాసరం వరకు బస్సులో ప్రయాణం చేసి కలెక్టరేట్‌లో దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. పలువురు దివ్యాంగులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మహిళల కోఆపరే టివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పీతల సుజాత, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు.

చాలా అవసరం..

చిన్న చిన్న చేతివృత్తులు చేసుకునే దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం చాలా అవసరం. సొంత ఊరి నుంచి పట్టణాలలో చేతి వృత్తులు చేసుకునే వారికి, పనులకు వెళ్లేవారికి ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణం ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో ఇటువంటి సౌకర్యాలు లేకపోవడం వలన దివ్యాంగులు ఇంటిలో ఒంటరిగా దిగులుగా జీవించే స్థితి నుంచి ఉచిత ఎంత దూరమైన వెళ్లి ఉపాధి పొందవచ్చు. దీనితో మాలో ఆత్మస్థైర్యం పెరిగి ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అండగా నిలిచింది.

–ముప్పిడి సోమేశ్వరరావు, కవిటం

చాలా సంతోషం..

ఇంటి నుంచి మరో గ్రామం, పట్టణం వెళ్లాలంటే దివ్యాంగులకు చాలా ఇబ్బందులున్నాయి. మూడు చక్రాల సైకిళ్లు ఉన్నప్పటికీ దూరం వెళ్లాలంటే తిప్పలు పడాల్సిందే. బస్సు ప్రయాణం చేయాలంటే సమయానికి సొమ్ములు లేక సతమతం అవుతున్నాం. దివ్యాంగ శక్తితో ప్రభుత్వం ఇచ్చిన ఆర్టీసీ బస్‌లో ఉచిత ప్రయాణంతో ఖర్చు లేకుండా బయట ప్రపంచంలోకి రావడానికి, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం అందించిన ఉచిత బస్‌ ప్రయాణంతో చాలా సంతోషంగా వుంది.

– బి.రాధాకుమారి, చిలకపాడు

Updated Date - Mar 19 , 2026 | 12:53 AM