కిక్కిరిసిన ప్రయాణాలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:11 AM
జిల్లా ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ)ని బస్సులు, కండ క్టర్ల, డ్రైవర్ల కొరత వేధిస్తోంది. ఏ మార్గంలో చూసిన కిక్కిరిసిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయి బస్సులు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది.
ఆర్టీసీని వేధిస్తున్న సిబ్బంది కొరత
అవుట్‌సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్ల సేవలు
అవసరం మేరకు బస్సులు లేవు
రెండేళ్లలో 15 బస్సులు మూలకు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లా ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ)ని బస్సులు, కండ క్టర్ల, డ్రైవర్ల కొరత వేధిస్తోంది. ఏ మార్గంలో చూసిన కిక్కిరిసిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయి బస్సులు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. సంస్థాప రంగా కొత్తబస్సులు డిపోలకు చేరకపోవడం, ఉన్న సంస్థ బస్సులు నెలకు రెండు చొప్పున మూలకు చేరుతు న్నాయి. ఫిట్‌నెస్ లోపించిన కారణంగా కూడా సూపర్ లగ్జరీ బస్సులు అటు, ఇటూ మార్చి ఏలూరు మీదుగా తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెంలకు పల్లెవెలుగు సర్వీసుల కింద నడుపుతున్నారు.
జిల్లాలో గడిచిన రెండేళ్లలో పల్లెవెలుగు బస్సులు 15 వరకు మూలకు చేరాయి. ఏలూరు–సత్తుపల్లి రూట్‌లో 2, ఏలూరు– రాజమండ్రి రూట్‌లో 2, ఏలూరు– మచిలీ పట్నం రూట్‌లో 2 బస్సులను ఎత్తివేసినట్లు సమాచా రం. భీమడోలు–ద్వారకాతిరుమల బస్సులు రెండు ఇలా దాదాపుగా 15 బస్సులు ఫిట్‌నెస్ లేక షెడ్డులో పెట్టేశారు. గత ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు స్ర్తీశక్తి పథకం అమలు చేసినప్పటికి నుంచి బస్సులకు అన్ని సర్వీసులకు విపరీ తమైన డిమాండ్ ఉంటోంది. దీనికి తగ్గట్టుగా ఉదయం 11 గంటల తర్వాత, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల లోపు, రాత్రి 7 గంటల దాటిన కాలం నుంచి బస్సు సర్వీసుల కోసం ప్రజలు వెంపర్లాడుతున్నారు. ఏ రూట్ లో చూసిన బస్సుల కోసం ప్రజలు ఈ సమయాల్లో పడిగాపులు కాస్తూనే ఉన్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు డిపోలోనే తీవ్రమైన బస్సుల కొరత వేధిస్తోంది.
అరకొర సిబ్బంది..
ఆర్టీసీలో డ్రైవర్ల కొరత విపరీతంగా ఉన్నట్లు సమా చారం. ఏలూరు పరిధిలోనే 40 మంది అవుట్‌సోర్సింగ్ డ్రైవర్లు, 42 మంది అవుట్ సోర్సింగ్ కండక్టర్లతో బస్సు లు నడపాల్సిన దుస్థితి నెలకొంది. కండక్టర్‌కు రోజుకు రూ.900, డ్రైవర్‌కు రోజుకు రూ.వెయ్యి చొప్పున ఎంగేజ్ చేస్తున్నారు. కొన్ని రూట్లలో అవసరాన్ని బట్టి కండక్టర్లతో డబుల్ డ్యూటీ కూడా చేయిస్తున్నారు. ఏలూరు కొత్త బస్టాండ్ వద్దే 40 మంది వరకు ఆన్‌కాల్ డ్రైవర్లతో రెగ్యులర్ బస్సులను నడుపుతున్నట్లు సమాచారం. జంగారెడ్డిగూడెంలో పరిధిలో 30 మంది అవుట్‌సోర్సింగ్ డ్రైవర్లను ఎంగేజ్ చేసుకుంటున్నారు. కొద్దో గొప్పో నూజివీడు డిపోలో సిబ్బంది కొరత లేదు.
సత్తుపల్లి రూట్ తెలంగాణదే..!
ఉచిత బస్సు పథకం అమలు నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు మార్గంలో సత్తుపల్లి బస్సు సర్వీసులను తగ్గించేశారు. తెలంగాణకు చెందిన సత్తుపల్లి డిపో నుంచి తాజాగా మూడు బస్సులు ఏలూరు–చింతలపూడి మీదుగా అక్కడ బస్సుల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తు న్నారు. ఈ బస్సులు డిమాండ్ ఉన్నప్పటికి ఏలూరు డిపో నుంచి పెంచలేని దుస్థితి.
మచిలీపట్నం, విజయవాడకు అంతంతే
రెండు జిల్లా కేంద్రాలైన మచిలీపట్నం(కృష్ణా), విజయవాడ (ఎన్టీఆర్) జిల్లాలకు ఏలూరు డిపో నుంచి రాత్రివేళ్లల్లో పల్లెవెలుగు బస్సులు అంతంతమాత్రంగా ఉన్నాయి. రాత్రి 8 గంటలు దాటితే పల్లెవెలుగు ఎక్క డం గగనమే. మచిలీపట్నం వెళ్లడానికి జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడ వెళ్లే ఇతర ఎక్స్‌ప్రెస్‌లు ఆధారం. అది దాటితే ఆటోలో వెళ్లాల్సిందే. హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లే సూపర్ లగ్జరీ సర్వీసుల్లోకి ఎక్కడానికి ప్రయత్నించిన ప్రయాణికులను డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కనీయరు. ఇలా రాత్రి ఎనిమిది దాటితే ప్రయాణా లకు ఆటోల్లో హనుమాన్ జంక్షన్‌కు వెళ్లి.. అక్కడ నుంచి నూజివీడు, మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.