కార్మికుల సంక్షేమానికి రూ.615 కోట్లు
ABN , Publish Date - May 02 , 2026 | 12:43 AM
రాష్ట్రంలోని 88 లక్షల మంది అసంఘటిత కార్మికుల శ్రేయస్సు కోసం ఏడాదికి రూ.615 కోట్లు వెచ్చిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జి అన్నారు.
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ వలవల
తాడేపల్లిగూడెం అర్బన్, మే 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 88 లక్షల మంది అసంఘటిత కార్మికుల శ్రేయస్సు కోసం ఏడాదికి రూ.615 కోట్లు వెచ్చిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జి అన్నారు. మే డే సందర్భంగా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వం ఈ ఏడాది 80 వేల మంది కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న దృక్పథంతో ఉంది. ఈ శిక్షణ ద్వారా వారు ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా స్థానికంగా ఉపాధి పొందే అవకాశాలు మెరుగు పడతాయి. వైసీపీ హయాంలో భవన కార్మికుల సమస్యలు ఏమీ తీర్చలేదు. కూటమి ప్రభుత్వం రాకతో సీ ఎం చంద్రబాబు ప్రత్యేక కమిటీని వేశారు. దీని నివేదిక ఆధారంగా కార్మికుల సంక్షేమానికి కృషిచేస్తాం. కార్మికుల కుటుంబాల్లో పెళ్లిళ్లకు రూ.20 వేలు, ప్రసూతికి రూ.30 వేలు, సాధారణ మరణానికి రూ.60 వేలు అందజేస్తున్నాం’ అని తెలిపారు. 19వ వార్డులో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఆకాశపు స్వామి, గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పెనుమర్తి నారాయణ పాల్గొన్నారు.