రూ.191 కోట్లు.. 201 పనులు
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:32 AM
మరో ఏడాదిలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈసారి పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాలతో అన్ని శాఖలు భారీగా ప్రతి పాదనలు తయారు చేశాయి.
అనుమతుల కోసం నరసాపురం మునిసిపాలిటీ ఎదురుచూపు
2015లో భారీగా నిధులు
ఈసారి ఏం చేస్తారో ?
నరసాపురం, జూన్ 21 (ఆంద్రజ్యోతి): మరో ఏడాదిలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈసారి పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాలతో అన్ని శాఖలు భారీగా ప్రతి పాదనలు తయారు చేశాయి. 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే పుష్క రాలకు కూడా ఈసారి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తూగా అవసరమైన పనులకు ప్రతిపాదనలు చేయాలని ప్రభుత్వం అన్నిశాఖల్ని ఆదేశించింది. గత ఏడాదిలోనే కొన్ని శాఖలు ప్రభుత్వానికి నివేదించారు. వీటిలో కొన్ని పనులకు ఇప్పటికే ఆమోదం లభించింది. ఈ క్రమంలో పురపాలక సంఘం చేపట్టాల్సిన పనుల్ని మూడు విభాగాలుగా విభజించి ప్రభుత్వానికి రూ.191 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. అందులో 201 పనులు ఉన్నాయి. మూడు విభాగాలుగా ఈ పనుల్ని చేపడతామని నివేదించారు. అయితే ఇంతవరకు ఒక్కపనికి కూడా అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో పుష్కరాలకు ఏ మేరకు నిధులు వస్తాయి, ఎన్ని పనులు చేస్తారన్న సందేహం సర్వత్రా నెలకొంది. గతంలో పుష్కరాలకు రాజమండ్రి, కొవ్వూరులోనే జరిగేవి. 2003లో అప్పటి మంత్రిగా ఉన్న సుబ్బారాయుడు నరసాపురంలో పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారు. గోదావరి బండ్‌తో పాటు పట్టణంలోని పలు రహదార్లను అభివృద్ధి చేశారు. ప్రభుత్వ ప్రచారంతో ఆ పుష్కరాలకు లక్షల్లో భక్తులు విచ్చేశారు. 2015లో కూడా ప్రభుత్వం నరసాపురం పుష్కరాలకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసింది. కాశీ నుంచి అఘోరాలు కూడా విచ్చేశారు. దీంతో నరసాపురం పుష్కరాలకు ఊహించని స్ధాయిలో భక్తులు విచ్చేసి పుణ్య స్నానాలు చేశారు. 60 లక్షలకు పైగా భక్తులు విచ్చేశారని అధికారులు అంచనా వేశారు
ఈసారి కోటికి పైనే రావొచ్చు
ఈసారి పుష్కరాలకు కోటికి పైనే భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 216 రహదారి అభివృద్ధి , నరసాపురానికి రైళ్ల సంఖ్య పెరగడం, అంతర్వేది, త్రివేణి సంగమానికి నరసాపురం రేవులు సమీపంలో ఉండటంతో ఈసారి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ పనులు పురపాలక సంఘం చేపట్టాల్సి ఉండటంతో మొత్తం 201 పనుల్ని ప్రతిపాదించారు. వీటిని మూడు విభాగాలుగా విభజించి చేపడ తామని ప్రభుత్వానికి నివేదించారు. అందులో మొదటి విడతలో రూ.80 కోట్లతో 86 పనులు ఉన్నాయి. రెండో విడతలో రూ.40 కోట్లతో 62 పనులు, మూడో విడతలో 72 కోట్లతో 53 పనులు ఉన్నాయి. గోదావరి రేవులకు, భక్తులకు ప్రాధాన్యం ఇచ్చే పనులు మొదటి విడతలో ఉన్నాయి.డ్రైనేజీలు, రోడ్లు, కరెంట్, సుందరీకరణ, మంచినీళ్లు, మరుగుదొడ్లు, శానిటేషన్ తదితర పనులు మిగతా వాటిలో ఉన్నాయి.
నేటికి నో గ్రీన్‌సిగ్నల్
పుష్కరాలకు ఇంకా ఏడాది మాత్రమే ఉంది. చేపట్టే పనులు పూర్తవ్వలంటే ఇప్పటి నుంచే టెండర్లు పిలిచి చేపట్టాల్సి ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నిల్ రాలేదు.ఎన్ని పనులకు అనుమతి వస్తుందో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటి వరకు పనులకు సంబంధించి ఎటువంటి సందడి లేకపోవడంతో ఈసారి గతంలో మాదిరిగా నిధులు వస్తాయా అన్న సందేహం నెలకొంది.
ఈసారి ఘనంగా నిర్వహిస్తాం
ఈసారి పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలన్న యోచనలో ఉంది. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలె త్తకుండా అవసరైన పనులు చేపట్టాలని అదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగానే ప్రతిపాఽధనలు తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చాం. త్వరలో నిధులు వస్తాయి. అవసరమైన పనుల్ని మొదటి విడదలో చేపడతాం.
–నాయకర్, నరసాపురం ఎమ్మెల్యే
పుష్కర దారులు
మూడు నియోజకవర్గాల్లో 15 రోడ్ల అభివృద్ధి
జిల్లాకు రూ.76 కోట్లు ..ప్రభుత్వం అనుమతి
ఆర్థిక శాఖ వద్ద పెండింగ్
(భీమవరం–ఆంధ్రజ్యోతి) :పుష్కరాల్లో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసే పనిలో నిమగ్నమైంది, ఆర్థిక శాఖ వద్ద రికార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో తొలి విడతగా రూ. 76 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సుము ఖంగా ఉంది. జిల్లాలోని నర్సాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో 15 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. పుష్కరఘాట్‌లకు వెళ్లే రహదారులకు ముందుగా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. మొదటి విడతలో నిధులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ వద్ద క్లియరెన్స్ లభిస్తే టెండర్‌లు పిలవను న్నారు. పనులు ప్రారంభిం చనున్నారు. వాస్తవానికి జిల్లాలో పుష్కరాల కోసమని రహదారుల అభివృద్ధికి రూ. 410 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. జిల్లాలోని అన్ని రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. అయితే ప్రభుత్వం తొలుత గోదావరి ఘాట్లకు సమీపంలోని రహదారులపై దృష్టి పెట్టింది. అత్యంత ప్రాధాన్యమైనవిగా గుర్తించి ఆర్థిక శాఖకు పంపింది. అక్కడ క్లియరెన్స్ లభిస్తే ఇక నిధులకు ఢోకా ఉండదు. దానికోసం జిల్లా అధికారులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మంజూరు కానున్నాయని ఆశిస్తున్నారు.