రూట్ క్లియర్
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:38 AM
భీమవరం ప్రజల ఆకాంక్ష నెరవేరనున్నది. యనమదుర్రు డ్రెయిన్‌లపై వంతెనలకు అప్రోచ్ రహదారులు నిర్మించేలా ప్రభుత్వం 24.70 కోట్లు నిధులు మంజూరు చేసింది.
రెండింటికి నిధులు కేటాయించిన ప్రభుత్వం
విలువ రూ. 24.70 కోట్లు
త్వరలో మరో అప్రోచ్‌కు అనుమతులు
నెరవేరనున్న భీమవరం ప్రజల ఆకాంక్ష
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
భీమవరం ప్రజల ఆకాంక్ష నెరవేరనున్నది. యనమదుర్రు డ్రెయిన్‌లపై వంతెనలకు అప్రోచ్ రహదారులు నిర్మించేలా ప్రభుత్వం 24.70 కోట్లు నిధులు మంజూరు చేసింది. టెండర్‌లు పిలిచేందుకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. భీమవరం చేపల మార్కెట్, గొల్లవానితిప్ప వద్ద వంతెనలకు అప్రోచ్‌లు నిర్మించనున్నారు. వాస్తవానికి భీమవరం రూరల్ మండల పరిధిలో మూడు వంతెనలు నిర్మించారు. ఒకేసారి రూ. 30 కోట్లు దాటితే నిధులు మంజూరు జాప్యం అవుతుంది. పరిపాలనా అనుమతులు జారీ చేయడంలోనూ ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఫలితంగా రెండు అప్రోచ్‌ల నిర్మాణానికి ప్రస్తుతం నిధులు కేటాయించారు. గూట్లపాడు వద్ద వంతెనకు తదుపరి నిధులు విడుదల చేయనున్నారు.
మారనున్న భీమవరం రూపు రేఖలు
యనమదుర్రు వంతెనలకు అప్రోచ్ రహదారులు నిర్మిస్తే భీమవరం రూపు రేఖలు మారనున్నాయి. భీమవరం నుంచి గొల్లవానితిప్ప, యనమదుర్రుల వైపు నిర్మాణాలు పెరగనున్నాయి. పట్టణ ప్రజలు రాకపోకలకు అనువుగా ఉంటుంది. యనమదుర్రుకు ఇరువైపులా ఎదురెదురుగా ఉన్న గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. గతంలో అంజిబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వంతెనలు నిర్మించారు. మళ్లీ ఆయన హయాంలోనే అప్రోచ్‌ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ పడింది. కూటమి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఎమ్మెల్యే అంజిబాబు వీటికోసం ప్రస్తావించారు. నిధులు మంజూరు చేయాలని కోరారు. అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్‌ల సమావేశంలోనూ జిల్లా కలెక్టర్ నాగరాణి సైతం అప్రోచ్ వంతెనలను ప్రస్తావించారు. మొత్తానికి ప్రభుత్వం నిఽధులు మంజూరు చేసింది. పరిపాలనా అనుమతులు జారీచేసింది. మరోవైపు భీమవరం పట్టణానికి రెండు కిలో మీటర్ల దూరంలోనే 165 నంబర్ జాతీయ రహదారి ఏర్పాటు కానున్నది. ఇవన్నీ భీమవరం పట్టణ అభివృద్ధికి దోహదపడనున్నాయి.
ఆర్‌అండ్‌బీకి అప్పగింత
యనమదుర్రు వంతెనపై అప్రోచ్ రహదారుల నిర్మాణ బాధ్యతను అర్‌అండ్‌బీకి అప్పగించారు. ప్రతిపాదన లను ఆర్‌అండ్‌బీ సిద్ధం చేసింది. ప్రభుత్వానికి పంపింది. అనుమతులు రావడంతో టెండర్లు పిలవడానికి మార్గం సుగమం అయ్యింది. అప్రోచ్‌లు నిర్మించేందుకు ఏజన్సీలు కూడా ముందుకు రానున్నాయి. ఎట్టకేలకు నిధులు మంజూరు కావడంతో భీమవరం నియోజకవర్గ వాసుల్లోనూ ఒకింత ఆనందం వ్యక్తమవుతోంది.