భీమవరంలో రౌడీ షీటర్ల వార్
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:13 AM
భీమవరంలో రౌడీయిజం మళ్ళీ పుంజుకునేలా కనిపిస్తుంది. కొంత కాలంగా పట్టణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ శుక్రవారం జరిగిన సంఘటనతో మళ్ళీ పోలీసులు ఉలిక్కిపడ్డారు.
ఒక వర్గంపై మరో వర్గం
కత్తులతో దాడికి యత్నం
ప్రాణాలు దక్కించుకున్న
రఘు వర్గం
కోర్టు సమీపంలోనే ప్రత్యర్థి
కారును ఢీకొట్టి దాడికి యత్నం
కత్తులతో రోడ్లపై పరుగులు.. భయబ్రాంతులకు
గురైన స్థానికులు
భీమవరం క్రైం, ఫిబ్రవరి 27 (ఆంధ్ర జ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రౌడీయిజం మళ్ళీ పుంజుకునేలా కనిపిస్తుంది. కొంత కాలంగా పట్టణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ శుక్రవారం జరిగిన సంఘటనతో మళ్ళీ పోలీసులు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే... భీమవరం రాయలం ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ రౌతుల రఘు (రాయలం రఘు) గతం నుంచి వివాదాల్లో ఉంటాడు. అయితే శుక్రవారం 2017లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి ముగ్గురితో కలిసి రఘు భీమవరం రెండవ పట్టణంలోని డీఎన్నార్ కళాశాల సమీపంలో క్రిమినల్ కోర్టుకు మారుతీ రిడ్జ్ కారులో వాయిదాకు హాజరయ్యాడు. వాయిదా అనంతరం బయటకు వచ్చి కారులో బయలుదేరుతుండగా అవతలి వర్గం కారుతో ఢీకొట్టారు. దీంతో రఘు, అతని వర్గం కారు దిగి పరుగులు తీశారు. అవతలి వర్గం కత్తులు పట్టుకుని, మాస్కులు ధరించి రఘు వర్గంపై దాడి చేసేందుకు పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. రఘు వర్గం తప్పించుకుని ఒక నివాసంలో తలదాచుకున్నారు. చివరకు పోలీసులు చేరుకుని ఆ ప్రాంతాన్ని పోలీసు వలయంలో ఉంచారు. చివరకు రౌడీషీటర్ రౌతుల రఘును, వారి వర్గాన్ని పోలీసులు రక్షణతో పంపించారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, సీఐ కాళీచరణ్ వెంటనే స్పందించి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ దాడికి పాల్పడిన బెవర గోవిందు, అతని వర్గం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
కోర్టు, పోలీస్ స్టేషన్ సమీపంలో దాడులు
పట్టపగలు 12 గంటల సమయంలో కోర్టు దగ్గరలో.. అలాగే పోలీస్‌స్టేషన్‌కు అతి కూత వేటు దూరంలో ఈ సంఘటన జరగడం పెద్ద చర్చనీయాంశమైంది. నిత్యం వందలాది మంది తిరిగే రోడ్డులో ఇలాంటి సంఘటన జరగడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. బెవర గోవిందు సోదరుడు విజయ్‌ను కూడా అప్పట్లో పోలీస్ స్టేషన్ సమీపంలోనే హతమార్చారు. పట్టపగలు ఇలాంటి సంఘటన జరుగుతూ ఉండటంతో పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎప్పుడు ఏ సంఘటన ఎక్కడ జరుగుతుందో అన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతుంది.
ఘర్షణ వెనుక కారణం
2022–23 సంవత్సరాల మధ్య కాలంలో రౌతుల రఘు సోదరుడు ఏసుపై రౌడీ షీటర్ బెవర గోవిందు, అతని వర్గం బీసీ కాలనీలో అర్ధరాత్రి దాడి చేసి హత్య చేశారు. ఆ సమయంలో రౌతుల రఘు ఒక కేసులో జైలులో ఉన్నాడు. రఘు బయటకు వచ్చిన అనంతరం తన సోదరుడైన ఏసును హతమార్చిన వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భీమవరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఒక ఆదివారం రౌడీ షీటర్ల కౌన్సెలింగ్‌కు అందరూ హాజరయ్యారు. ఆ సమయంలో రఘు పక్కా ప్లాన్ ప్రకారం గొల్లవానితిప్ప రోడ్డులోని ఒక దేవాలయం వద్ద కారుతో బెవర గోవింద్‌ను హత్య చేసేందుకు పన్నాగం వేశాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బెవర గోవిందు, అతని సోదరుడు విజయ్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. అయితే ఆ సమయంలో గోవిందు కాలువలోకి దూకి తప్పించుకున్నాడు. విజయ్ రఘు వర్గానికి దొరకడంతో కత్తులతో పొడిచి హతమార్చారు. అప్పట్లో ఈ హత్య కేసు సంచలనమైంది. దీనిపై కక్ష పెంచుకున్న గోవిందు రఘును హత మార్చాలని కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కోర్టు వద్ద రఘు, అతని వర్గాన్ని హతమార్చేందుకు అతని ముగ్గురు స్నేహితులతో పన్నాగం పన్నాడని చెబుతున్నారు. ఇది కాస్తా బెడిసికొట్టింది.