Share News

రోడ్లు..తూట్లు!

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:05 AM

జిల్లాలో రోడ్లు భవనాలశాఖ రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఆగస్టు నుంచి భారీ వర్షాలు, వరుసగా ఆర్నబ్‌, మురసు తుఫాన్‌లతో రహ దారులు అన్నిచోట అధ్వానంగా మారాయి. ఆర్‌అండ్‌బీ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది.

రోడ్లు..తూట్లు!
జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెం వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డు

వరుస తుపాన్లు.. వరదలతో ఛిద్రం

జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.231 కోట్ల నష్టం

తాత్కాలిక మరమ్మతులకు రూ.4.42 కోట్ల అంచనా వ్యయం

పూర్తిస్థాయిలో అభివృద్ధికి రూ.49.90 కోట్లతో ప్రతిపాదనలు

(ఏలూరు/జీలుగుమిల్లి/కొయ్యలగూడెం/ కైకలూరు/కలిదిండి/చాట్రాయి/పెదపాడు,ఆంధ్రజ్యోతి):

జిల్లాలో రోడ్లు భవనాలశాఖ రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఆగస్టు నుంచి భారీ వర్షాలు, వరుసగా ఆర్నబ్‌, మురసు తుఫాన్‌లతో రహ దారులు అన్నిచోట అధ్వానంగా మారాయి. ఆర్‌అండ్‌బీ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాహనదారులతో పాటు జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తాత్కాలిక మరమ్మతులకు అంచ నాలు రూపొందించారు.

వైసీపీ హయాంలో వివిధ పథకాల కింద రాని నిధులు కూడా కూటమి ప్రభుత్వం తీసు కొచ్చి రోడ్లను భారీగా బాగు చేసింది. ప్రస్తుతం ఏ మండల ప్రధాన రహదారి చూసినా గుంత లు పడ్డాయి. రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులు నామరూపల్లేకుండా కొట్టుకు పోయాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజి వీడు పట్టణాల్లోను రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నా యి. పోలవరం నియోజకవర్గంలోని కుక్కు నూరు, వేలేరుపాడు, కొయ్యలగూడెం, బుట్టాయ గూడెంల్లోను భారీగా రహదారులు దెబ్బతిన్నా యి. కొల్లేరు నియోజకవర్గాలైన కైకలూరు, ఏలూ రు, దెందులూరు నియోజకవర్గాల పరిధిలోను రోజుల తరబడి వరద నీరు రోడ్లపై నిలిచి పోవడంతోనే నష్టం భారీగానే సంభవించింది. జిల్లా వ్యాప్తంగా తుఫాన్ల ప్రభావంతో 334.51 కిలోమీటర్ల పరిధిలో రహదారుల వ్యవస్థ దెబ్బతినడంతో రూ.231 కోట్ల నష్టం ఆర్‌అండ్‌బీకి వాటిలినట్టు ఆ శాఖ ఇంజనీరింగ్‌ అధికారుల నివేదికలు తెలుపుతున్నాయి.

పొంచి ఉన్న తుఫాన్‌తో గుబులు

మళ్లీ తుఫాన్‌ ప్రభావం జిల్లాకు పొంచి ఉండటంతో రాబోయే రోజుల్లో నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక పాడైన, భారీగా గోతులు తేలిన రహదారులను ఏ విధంగా బాగు చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా రహ దారు లు, కల్వర్టులు, అప్రోచ్‌లకు తాత్కాలిక మరమ్మ తులకు రూ.4.42 కోట్లు, పూర్తిస్థాయిలో అభి వృద్ధికి రూ.49.90 కోట్ల అంచనా వ్యయం అవు తుందని అధికారులు లెక్కగట్టారు. జిల్లాలో కేంద్ర బృందం పర్యటించిన తర్వాత వారు ఇచ్చే నివేదిక అధారంగా నష్టపరిహారాలు, మరమ్మతు లకు నిధులను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

జీలుగుమిల్లి మండలంలో పలు గ్రామాల్లో రహదారులు ఛిద్రంగా మారాయి. గిరిజన గ్రామాలకు వెళ్లే కల్వర్టులు కొట్టుకుపోయి మరమ్మతులు కూడా చేయలేనివిగా మారాయి. పి.అంకంపాలెం నుంచి వయా చీడూరు, కొరుటూరు, గంగన్నగూడెం, మీదుగా చల్లవారిగూడెం వెళ్లే రహదారి వరదనీటికి పూర్తిగా కొట్టుకుపోయింది. నాలుగేళ్ల క్రితం ఇక్కడ రోడ్డుకు వరదల వల్ల గండి పడటంతో కొన్నాళ్ల పాటు సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఈ రహదారి మీదుగా ద్విచక్రవాహనం సైతం వెళ్లే వీలులేకుండా పాడైంది. వంకవారిగూడెం వాగువద్ద, రైతుగూడెం బ్రిడ్జి, టి.గంగన్నగూడెం– దిబ్బగూడెం, ముగలంపల్లి గ్రామాల మధ్య రోడ్డు, పి.రాజవరం వాగు వద్ద రహదారికి గండ్లు పడ్డాయి. దీంతోపాటు పలు గిరిజన గ్రామాల్లో పొలాలకు వెళ్లే పుంతరోడ్లు వరదనీటి కోతకు గురై నిలువు లోతు గోతులు మిగిలాయి. ఒకవైపు పంటలు పాడై, మరోవైపు మిగిలిన వరి పంటను తరలించేందుకు దారి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కొయ్యలగూడెం మండలంలో గ్రామీణ రోడ్లతో పాటు జాతీయ రహదారి సైతం ధ్వంసం అయ్యాయి. బయ్యనగూడెం– కొయ్యలగూడెం గ్రామాల మధ్య జాతీయ రహదారి, కొయ్యలగూడెం నుంచి రాజమండ్రికి వెళ్లే జాతీయ రహదారి మార్జిన్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పొంగుటూరు నుంచి యర్నగూడెం వెళ్లే రహదారిపై పొంగుటూరు వద్ద శ్రీరాములకట్టు చెరువు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు మార్జిన్‌లు దెబ్బతిన్నాయి. మండలంలో 550 ఎకరాలకు పైగా వరి పంటకు నష్టం వాటిల్లింది. మినప, మిరప, పొగాకు తోటలకు నష్టం వాటిల్లింది.

కైకలూరు మండలంలో కైకలూరు–కలిదిండి ఆర్‌అండ్‌బీ రహదారిలో రాచపట్నం వద్ద రహదారిపై పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. వరహాపట్నం నుంచి ఉప్పుటేరు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారిలో సీతనపల్లి వద్ద రహదారి ముంపు బారిన పడింది. రహదారిలో పెద్దపెద్ద గోతులు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జూ కలిదిండి మండలంలో లంక గ్రామాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. మంటగుంట– పెదలంక ప్రధాన రహదారి నాలుగు కిలోమీటర్ల మేర కంకర కొట్టుకుపోయింది. రోడ్డుపై పడిన గోతుల్లో వాహనాలు దిగబడుతున్నాయి. మద్వానిగూడెం – కొండంగి ప్రధానరోడ్డు మూడు కిలోమీటర్ల మేర గోతులుపడి అధ్వానంగా ఉంది. ఈ రహదారిపై ఆటోలు రాకపోకలు సాగించక పోవడంతో విద్యార్థులు, ఆసుపత్రికి వెళ్లే పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెదలంక–మూలలంక ప్రధాన రహదారి మూడు కిలోమీటర్ల మేర తారు కొట్టుకు పోయింది. రోడ్డు పైపడిన గోతుల్లో మట్టి పైకి రావడంతో బురదకయ్యిగా మారింది. ఈ గోతుల్లో బస్సులు దిగబడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

చాట్రాయి మండలంలో పలు రోడ్లు దెబ్బతిన్నాయి. కోటపాడు–కాకర్ల, నరసాపు రం–చిన్నంపేట, పోలవరం–రమణక్కపేట రోడ్లు గోతులు పడి అధ్వానంగా మారాయి. ఈ రోడ్లపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ప్రజలు అవస్థలు పడుతున్నారు.

పెదపాడు బస్టాండ్‌ సెంటర్‌ ఎదురుగా వున్న పెదపాడు–వట్లూరు వెళ్లే ప్రధాన రహదారిలో వున్న కల్వర్టు అత్యంత ప్రమాదకరంగా మారింది. గతంలోనే జీర్ణావస్థకు చేరుకున్న కల్వర్టు ఇటీవలి తుఫాన్‌ ప్రభావంతో పెద్దఎత్తున వరద నీరు కల్వర్టు మీదుగా ఉధృతంగా ప్రవహించడంతో కల్వర్టు కింద నేల కోతకు గురై మరింత కుంగిపోయింది. కల్వర్టు మధ్యలో పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడి అక్కడి నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ కల్వర్టు మీదుగా వాహనాల రాకపోకలకు ప్రయాణికులు హడలిపోతున్నారు. ఈ రహదారి చుట్టూ వ్యవసాయ భూములు ఉండటం, పశుగ్రాసం, ఎరువులు, పంట తరలింపు ప్రమాద కరంగా మారిందని, పూర్తిగా శిథిలమైన కల్వర్టును పునః నిర్మించాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.

పంట నష్టాల పరిశీలనకు రేపు కేంద్ర బృందం పర్యటన

జిల్లాలో ఇటీవల తుఫాన్‌ కారణంగా జరిగిన నష్టాలను కేంద్ర బృందానికి సవివరంగా విశ దీకరించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారు లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం జిల్లాలో తుఫాన్‌ నష్టాల అంచనాలపై ఈనెల 13న పర్యటించనున్న అంతర్‌– మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం పర్యటనపై సంబం ధించి సంబధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ ఈనెల 13న జిల్లాలో అంతర్‌– మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం పర్యటిస్తుం దన్నారు. బృందం ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి కారులో ఏలూరు బయలుదేరి వస్తుందని, అనంతరం జిల్లా లోని వివిధ ప్రాంతాలను సందర్శించి మురసు తుఫాన్‌ కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టాలను పరిశీలిస్తుందన్నారు. వ్యవ సాయ, అనుబంధ శాఖలు, రహదారి భవ నాలు, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, విద్యుత్‌ , తదితర శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించి జరిగిన నష్టాలపై ఫొటో ఎగ్జి బిషన్‌ ద్వారా కేంద్ర బృందానికి తెలపాల న్నారు. సాయంత్రం 5.30 గంటలకు బృందం ఏలూరు నుంచి రాజమహేంద్రవరం బయలు దేరి వెళ్తుందన్నారు. సమీక్షలో జేసీ అభిషేక గౌడ, ఏపీఈపీడీసీఎల్‌, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, రహదారులు భవనాల శాఖల ఎస్‌ఈలు అంబేడ్కర్‌, రమేష్‌, గుణకనకా రావు, విజయరత్నం, జిల్లా వ్యవసాయ శాఖాధికారి షేక్‌ హబీబ్‌బాషా, ఉద్యాన శాఖ డీడీ షాజానాయక్‌, హౌసింగ్‌ పీడీ సత్య నారాయణ పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 12:05 AM