Share News

పల్లె దారులకు సీసీ కళ!

ABN , Publish Date - Nov 16 , 2026 | 11:58 PM

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామీణ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.

పల్లె దారులకు సీసీ కళ!
భీమవరం – తాడేరు రహదారిపై నిలిచిన నీరు

68 గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్ల గుర్తింపు

108 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణం

ప్రభుత్వానికి నివేదిక పంపిన ఆర్‌అండ్‌బీ అధికారులు

క్షేత్రస్థాయిలో పరిశీలించిన బృందం

భీమవరం రూరల్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామీణ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెల్లో తారు రోడ్లు తరచూ దెబ్బతింటున్న నేపథ్యంలో, వాటికి శాశ్వత పరిష్కా రంగా సీసీ రోడ్లు వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 68 గ్రామాల పరిధిలో 108 కిలోమీటర్ల పొడవునా సీసీ రోడ్లను నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. నిధులు మంజూరైతే ఏళ్ల తరబడి పల్లెవాసులకు రోడ్డు కష్టాలు తీరనున్నాయి.

గోతులకు చెక్‌.. శాశ్వత పరిష్కారం

సాధారణంగా గ్రామాల పరిధిలో తారు రోడ్లు పల్లంగా ఉండటం, వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో కొద్ది కాలానికే భారీ గోతులు పడుతున్నాయి. వర్షం కురిసినప్పుడల్లా రోడ్లపై రెండు, మూడు రోజుల పాటు నీరు నిలిచిపోతోంది. తారు రోడ్లపై 78 గంటలకు పైబడి నీరు నిలిచి ఉంటే వాటి నాణ్యత పూర్తిగా దెబ్బతింటుందని అధికారులు చెబుతున్నారు. గతంలో నివాసాలు ఉన్న ప్రాంతాల వరకే సీసీ రోడ్లు వేయగా.. ఇప్పుడు గ్రామ పరిధి దాటే వరకు వాటిని విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనివల్ల ఏళ్ల తరబడి రోడ్లు చెక్కుచెదరకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.

క్షేత్రస్థాయిలో పరిశీలన

జిల్లాలో ఎక్కడెక్కడ తారు రోడ్లు అధ్వానంగా ఉన్నాయో గుర్తించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించింది. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించిన యంత్రాంగం.. 68 గ్రామాల్లో సీసీ రోడ్లు అవసరమని నిర్ధారించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఇటీవల ప్రత్యేకాధికారులు జిల్లాకు వచ్చి రోడ్ల పరిస్థితిని సమీక్షించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ఇచ్చిన నివేదికకు ఈ బృందం ఆమోదం తెలిపితే.. ఆయా గ్రామాల్లో సుదీర్ఘకాలం మన్నే సీసీ రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల వర్షాకాలంలో గ్రామస్తులకు, వాహనదారులకు బురద, గోతుల తిప్పలు తప్పుతాయి.

Updated Date - Nov 16 , 2026 | 11:58 PM