గోదావరి పుష్కరాలకు రయ్..రయ్
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:55 AM
మొగల్తూరు ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారి విస్తరణకు ఎట్టకేలకు మార్గం సుగమమవుతోంది.
మొగల్తూరు రహదారి విస్తరణకు రూ.8 కోట్లతో ప్రతిపాదనలు
పుష్కరాల నాటికి 18 అడుగుల
వెడల్పుతో అభివృద్ధికి ప్రతిపాదన
ఇరుకు రహదారితో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, గ్రామస్థులు
మొగల్తూరు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి):మొగల్తూరు ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారి విస్తరణకు ఎట్టకేలకు మార్గం సుగమమవుతోంది. రహదారి వెడల్పు తగ్గిపోవ డంతో ఎన్నో ఏళ్లుగా ఎదురవుతున్న ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు రూ.8 కోట్లతో విస్తరణ పనులకు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నాగరాణి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఆర్ అండ్‌బీ అధికారులకు ప్రతిపాదనలు పంపారు. గోదావరి పుష్కరాలకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి నరసాపురం వచ్చే వారికి ఈ రహదారి ప్రధాన మార్గం కావడంతో కనీసం 18 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
హైవే నిర్మాణంతో మారిన పరిస్థితి
మొగల్తూరు మీదుగా జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టే సమయంలో జాతీయ రహదారుల శాఖ మొగల్తూరు పాతకాలువ సెంటర్ నుంచి లాకు వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారిని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి రహదారి అభివృద్ధి పనుల కోసం హైవే వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగించేవి. తర్వాత మొగల్తూరు పంచాయతీ పరిధిలోని అవుట్‌కట్స్ నుంచి కొత్త హైవేను నిర్మించారు. అనంతరం పాత కాలువ నుంచి లాకు వరకు ఉన్న పాత ఆర్‌అండ్‌బీ రహ దారిని తిరిగి ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. అయితే గతం లో 18 అడుగుల వెడల్పు ఉన్న ఈ రహదారిని కేవలం 12 అడుగుల వెడల్పుతో పునర్నిర్మించారు. రహదారి ఇరు కుగా మారడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పించుకునే సమయంలో వాహనదారులు, గ్రామస్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కనీసం రెండు ప్యాసిం జర్ ఆటోలు ఒకదానికి మరొకటి సులభంగా తప్పుకునే పరిస్థితి లేకపోవడంతో గ్రామస్థులు బజార్‌కు వెళ్లాలన్నా భయపడుతున్నారు. మొగల్తూరు మార్కెట్‌కు వచ్చే విని యోగదారులు సైకిళ్లు, బైక్‌లు పార్కింగ్ చేసుకునేందుకు స్థలం లేక తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నా యి. ప్రధాన రహదారిని అవసరమైతే ఆక్రమణలు తొల గించి, గతంలో ఉన్న వెడల్పుకంటే ఎక్కువగా నిర్మించా లని గ్రామస్థులు కొన్నేళ్లుగా అధికారులు, ప్రజాప్రతిని ధులను కోరుతున్నారు. రహదారి సమస్యను గ్రామస్థులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ దృష్టికి తీసుకెళ్లారు. మొగల్తూరుకు చెందిన పలువురు గత నెల 5న భీమవరంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
రూ.8 కోట్లతో అంచనాలు
గ్రామస్థుల విజ్ఞప్తితోపాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎమ్మెల్యే నాయకర్ చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ మొగల్తూరు ఆర్‌అండ్‌బీ రహదారికి 149.536 నుంచి 153.350 మీటర్ల వరకు విస్త రణ చేపట్టేందుకు రూ.8 కోట్లతో అంచనాలు రూపొందిం చారు. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్య దర్శి, ఆర్‌అండ్‌బీ అధికారులకు పంపించారు.
పుష్కరాల నాటికి అభివృద్ధి!
రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా కృష్ణా, గుం టూరు, ప్రకాశం జిల్లాల నుంచి నరసాపురం వైపు పెద్ద సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగించే అవకా శం ఉంది. ఈ నేపథ్యంలో మొగల్తూరు ప్రధాన రహదారిని కనీసం 18 అ డుగుల వెడల్పుతో అభివృద్ధి చేయాలని కలెక్టర్ ప్రతిపాదించారు. ప్రతిపా దనలకు ఆమోదం లభించి పనులు చేపడితే తమ గ్రామ ప్రధాన రహదా రి సమస్య పరిష్కారమవుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.61.80 కోట్లు
జిల్లాలో మారనున్న రహదారుల రూపురేఖలు
భీమవరం/నరసాపురం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కరాలు జరిగే పురపాలక సంఘాలకు రూ. 150 కోట్లు కేటాయించింది. తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో బుధవారం ఆర్‌అండ్‌బీకి రూ.300 కోట్లు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది. ఇందులో పశ్చి మ గోదావరి జిల్లాకు రూ.61.80 కోట్లు కేటాయించింది. సీఎం చంద్రబాబు సిద్ధాంతం పర్యటనలో హామీ ఇచ్చి న రహదారులకు నిధులు మంజూరు చేసింది.