తడిపేది లేదు..తొక్కించేది లేదు..!
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:53 PM
వెట్‌మిక్స్ వేసి నెల అవుతున్నా నేటి వరకు నీటితో తడపలేదు. పవర్ రోలర్‌తో పోసి న వెట్‌మిక్స్‌ను తొక్కించాల్సి ఉన్న ఆ పని చేయ లేదు. దీంతో రోడ్లపై పోసిన వెట్‌మిక్స్ మెటల్ లేచిపోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వేలేరుపాడు మండలంలో రూ.ఐదు కోట్లతో రోడ్ల నిర్మాణం.. నిర్మాణ పనుల్లో భారీ అవినీతి !
వేలేరుపాడు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పదేళ్ల తర్వాత వేలేరుపాడు మండలంలోని ఆర్‌అండ్‌బీ రహదారి పునఃనిర్మాణానికి ప్రభుత్వం రూ.ఐదు కోట్లు మంజూరు చేయడంతో మండల ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ నిధులతో మేడేపల్లి నుంచి రెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు వరకు, రెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు నుంచి రుద్రమ్మకోట వరకు అలాగే వేలేరుపాడుకు, వేలేరుపాడు నుంచి కోయిదా రోడ్ల అభివృద్ధి పనులను చేపట్టారు. రెండు నెలలుగా ఈ రహదారి పనులను చేపట్టిన కాంట్రాక్టర్ రోడ్లు పూర్తిగా ధ్వంసమైనచోట అడుగు మేర రోడ్డును త్రవ్వి వెట్‌మిక్స్ వేశారు. వెట్‌మిక్స్ వేసి నెల అవుతున్నా నేటి వరకు నీటితో తడపలేదు. పవర్ రోలర్‌తో పోసి న వెట్‌మిక్స్‌ను తొక్కించాల్సి ఉన్న ఆ పని చేయ లేదు. దీంతో రోడ్లపై పోసిన వెట్‌మిక్స్ మెటల్ లేచిపోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వెట్ మిక్స్ వేసినప్పుడు కనీసం 21 రోజుల పాటు నీటితో తడపాల్సి ఉంది. దీనివల్ల మెటల్, రాతిపొడి గట్టిపడుతుంది. ఆపై పవర్ రోలర్‌తో తొక్కిస్తే రహదారి పటిష్టంగా మారుతుంది. ఆపై తారు వేస్తే రోడ్లు సురక్షితంగా ఉంటాయి. కానీ ఇవేమి లేకుండానే కాంట్రాక్టర్ రోడ్లను తవ్వామా.. మెటల్ పోశామా.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కోట్లాది రూపాయల పనులు ఇంత నిర్లక్ష్యంగా జరుగుతున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఈ రోడ్ల పనుల్లో అవినీతి జరుగుతోందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
పది రోజుల్లో రహదారి పనులు ప్రారంభిస్తాం
వేలేరుపాడు మండలంలో జరుగుతున్న రహదారి పనులను పర్యవేక్షిస్తున్నాం. నీటి కొరత కారణంగా రోడ్లు తడిపే విషయంలో జాప్యం జరుగుతోంది. దీనిపై కాంట్రా క్టర్‌ను హెచ్చరించాం. వారం రోజుల్లో రోడ్లను పూర్తిస్థాయిలో తడిపి తారు వేస్తామని కాంట్రాక్టర్ తెలిపారు. రోడ్ల నిర్మాణం లో నాణ్యత ప్రమాణాలు పూర్తిగా పాటించిన తర్వాతే తారురోడ్డు నిర్మాణాలు చేస్తాం.
– హరికృష్ణ, ఆర్‌అండ్‌బీ డీఈ