Share News

అడ్డంకులకు చెక్‌!

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:16 AM

పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి ఏర్పాటులో భాగంగా కైకలూరు మండ లం గోపవరంలో ప్రహసనంలా సాగుతున్న భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది.

అడ్డంకులకు చెక్‌!
ఎన్‌హెచ్‌లో తొలగించాల్సిన ఇళ్లు (సర్కిల్‌లో)

కలెక్టర్‌ చొరవతో ఎన్‌హెచ్‌ 165కు భూసేకరణ

పామర్రు–దిగమర్రు హైవేకు లైన్‌క్లియర్‌

కదిలిన యంత్రాంగం..సర్వే..సరిహద్దుల గుర్తింపు

ఏలూరు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి):పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి ఏర్పాటులో భాగంగా కైకలూరు మండ లం గోపవరంలో ప్రహసనంలా సాగుతున్న భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. విస్తరణ పనుల్లో జరుగుతున్న అక్రమాలపై స్థానికులు ఈ నెల 13న కలెక్టర్‌ వెట్రిసెల్వికి ఫిర్యాదు చేయడంతో ఆమె అధికారులపై మండిపడ్డారు. సమగ్ర నివేదిక సమర్పించాలని ఆర్డీవో కిశోర్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఆదేశాలతో గురువారం కదిలిన అధికారులు రైతుల పొలాల నుంచి సరిహద్దుల గుర్తింపును సాయంత్రానికి పూర్తిచేశారు. ఇరువైపులా ఆమూలాగ్రం సర్వే చేసి.. సరిహద్దులను నిర్ణయించి రాళ్లను పాతారు. కొన్నిచోట్ల మార్కింగ్‌లను పూర్తి చేశారు. ఎన్‌హెచ్‌ ఏఈ శరత్‌చంద్ర, ఏలూరు ఆర్డీవో కార్యాలయ డివిజనల్‌ సర్వేయర్‌ రమణరావు, తహసీల్దార్‌ రామకృష్ణ, వీఆర్వో బాబీ, కాంట్రాక్టర్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

జరిగిందేమిటంటే..

రాజకీయ అండతో కొంతమంది మూడుచోట్ల స్థలాలకు భూసేకరణ చేయనివ్వకుండా తెరవెనుక నుంచి అడ్డుకోవ డం వివాదాస్పదంగా మారింది. పామర్రు వైపు నుంచి కైకలూరు వైపు వెళ్లే వాహనాల మళ్లింపునకు ఇక్కడ వై.జంక్షన్‌ వద్ద భూసేకరణ జరగలేదు. దీనికి భూసేకరణ చేస్తే ప్రజలు ప్రమాదాల బారినపడకుండా ప్రయాణాలు సాఫీగా చేయడానికి వీలుంటుంది. ఇక్కడ రెండు వైపులా రహదారి విస్తరణ చేయాలి. భూసేకరణ ప్రయత్నాలు ఆపిన ప్రాంతంలో ఇళ్లు, ఇతర కట్టడాలను తొలగించడానికి తాజాగా చేపట్టిన సర్వేలో అధికారులు మార్కింగ్‌ ఇచ్చారు. భవిష్యత్‌లో ఈ రహదారిని నాలుగు లైన్లగా విస్తరించే అవకాశాలను పరిశీలిస్తూ భూసేకరణకు పలుచోట్ల అధికారులు మార్కింగ్‌ ఇచ్చారు. సర్వే అంశంపై డివిజనల్‌ సర్వేయర్‌ రమణరావును ఆంధ్రజ్యోతి వివరణ కోరగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మా దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం సర్వే చేశాం. భూ సేకరణ, ఇతర అంశాలపై కలెక్టర్‌కు నివేదిక సమర్పించి చర్యలు చేపడతామన్నారు. కాగా ఈ సర్వేకు నేషనల్‌ హైవేస్‌ డీఈ సత్యనారాయణ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.

Updated Date - Apr 17 , 2026 | 12:16 AM