Share News

పులిని పట్టేద్దాం

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:50 AM

పశ్చిమ మన్యంలో తిరుగుతున్న పులిని బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి.

పులిని పట్టేద్దాం
ఫారెస్ట్‌ అధికారులకు సూచనలిస్తున్న రెస్కూ బృందాలు

రెస్క్యూ బృందాల ప్రత్యేక వ్యూహం

సురక్షితంగా బంధించేందుకు చర్యలు

ఆధునిక సాంకేతిక పరికరాలతో వేట

జీలుగుమిల్లి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): పశ్చిమ మన్యంలో తిరుగుతున్న పులిని బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. రోజుకో ప్రాంతంలో సంచరిస్తూ పశువు లను వేటాడుతున్న పులి జాడ కోసం అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. థర్మల్‌ డ్రోన్స్‌, నైట్‌ విజన్‌ కెమెరాలతో ట్రాకింగ్‌ టీం, వైల్డ్‌లైఫ్‌ రెస్య్కూ టీం పులి కదలికల్ని గమనిస్తున్నారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను బట్టి అందుకు తగ్గట్టుగా వైల్డ్‌లైఫ్‌ ట్రాకింగ్‌లో ఆధునిక పరిజ్ఞానంతో ప్రయత్నం చేస్తున్నారు.

టి.గంగన్నగూడెం ప్రాంతంలో సోమవారం రాత్రి సంచరించిన పులి మంగళవారం దర్భగూడెం జామాయిల్‌ అటవీ ప్రాంతానికి, టి.నరసాపురం మండలంలో బండివారిగూడెం, అప్పలరాజుగూడెం పరిసర ప్రాంతాలకు చేరుకుంది. ఆయా ప్రదేశాల్లో పులి ముందుకు వెళ్లే అవకాశాలున్న ప్రాంతాల్లో వలలు అమర్చి పులి నిర్దేశిత ప్రాంతానికి వచ్చేలా అధికారులు ఫారెస్ట్‌ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజులుగా పులి సంచరించే ప్రాంతాలు, పాద ముద్రలు, కెమెరా ట్రాప్‌ డేటా ద్వారా ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి. వైల్డ్‌ లైఫ్‌, పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌ టైగర్‌ రిజర్వ్‌ నుంచి, మత్తు మందు తుపాకీలతో పులిని బంధించే ఆరుగురు ట్రాక్విలైజింగ్‌ షూ టర్లు, రెస్క్యూ టీంలు పులిని సురక్షితంగా బంధించేందుకు రంగం సిద్ధం చేశారు. పులి వెళ్లిన ప్రదేశాల్ని జిల్లా అటవీశాఖ అధికారి పీవీ.సందీప్‌రెడ్డి ఆపరేషన్‌ టీంతో కలసి పరిశీలించారు. ప్రత్యేకంగా అమర్చిన మంచెలను గమనిస్తూ మనుషులుండే ప్రదేశాల్ని తప్పిం చుకుంటూ పులి సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం, జీలుగుమిల్లి మండలాల సరిహద్దు గ్రామాలైన దర్భగూడెం, పి.రాజవరం, చల్లవారిగూడెం, ఎ.పోలవరం, అప్పలరాజుగూడెం, చిర్రివారిగూడెం, రామన్నపాలెం, మండకంవారిగూడెం, దాట్లవా రిగూడెం, శ్రీరత్నగూడెం, సీతంపేట, సమీప గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జంగారెడ్డిగూడెం, కన్నాపురం, కుక్కు నూరు, పోలవరం అటవీ సిబ్బంది ప్రత్యేక బృందాల సూచనలు పాటిస్తూ క్షేత్రస్థాయిలో ఆయా బృందాల వెంట ఉన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 12:50 AM