సన్నబియ్యం కొనడం లేదేమి?!
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:35 AM
నాణ్యమైన సన్నబియ్యం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు లోకి తెచ్చే ఉద్దేశ్యంతో ఈ నెల మొదటి వారం లో రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలు ప్రారంభించగా, అవన్నీ నామ మాత్రంగానే సాగుతున్నాయి.
జిల్లాలోని రైతు బజార్లలో నాలుగు ప్రత్యేక కౌంటర్లు
వినియోగదారుల స్పందన అంతంతే
40.02 క్వింటాళ్లే విక్రయం.. శాఖల మధ్య సమన్వయలోపం
ప్రజల్లో అవగాహన కల్పనకు చర్యలు శూన్యం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
నాణ్యమైన సన్నబియ్యం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు లోకి తెచ్చే ఉద్దేశ్యంతో ఈ నెల మొదటి వారం లో రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలు ప్రారంభించగా, అవన్నీ నామ మాత్రంగానే సాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయలోపం, మరోవైపు సరైన ప్రచారం లేక జనం వీటివైపు చూడడం లేదు. నిబంధనలూ అడ్డంకిగా మారాయి.
బహిరంగ మార్కెట్లో ఇటీవల బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. బస్తా రూ.1400–1500 మధ్య నడిచే సన్న బియ్యం ధరలు అమాంతంగా కిలోకు రూ.10 వరకు పెరిగింది. పేద, మధ్యతరగతి ప్రజలకు రూ.1700కు పైబడి వెచ్చించి బియ్యం బహిరంగ మార్కెట్లో కొనాల్సి వస్తోంది. నాణ్యమైన సన్నబియ్యం బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.60 నుంచి రూ.65 పలుకుతుండగా.. ఆ ధరాఘాతం నుంచి సామాన్యు లకు భారంగా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ధరల స్థిరీకరణ (మార్కెట్ ఇంటర్వెన్షన్) కార్యక్రమం కింద రైతు బజార్ల ద్వారా ఏలూరులో రెండు, కైకలూరు, నూజివీడులో ఒక్కొ క్కటి చొప్పున కౌంటర్ల ద్వారా అమ్మకాలను చేపట్టింది. పౌరసరఫరాలశాఖ వైఫల్యం, మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలోపం కారణంగా జిల్లాలో పెద్దగా ప్రజలు ఉపయోగించు కోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో ఈనెల ఒకటో తేదీ నుంచి కిలో బీపీటీ రూ.52, సాధారణ రకం రూ.50లకు రాయితీ బియ్యం విక్రయాలను ప్రారంభించారు. జిల్లాలో గోదావరి వరద కారణంగా మూడోతేదీ నుంచి ప్రారంభించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు కౌంటర్లలో విక్రయా లను చూస్తే ఈ కార్యక్రమం ప్రజల్లోకి పెద్దగా వెళ్ల లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం 40.02 క్వింటాళ్లను (బీపీటీ 33.50, రా రైస్ 8.80) మాత్రమే విక్రయించారు. లక్షలాది మంది సామాన్య, మధ్య తర గతి ప్రజలు నివసించే ఏలూరు, నూజివీడు, కైకలూ రుల్లో ఇంత తక్కువ అమ్ముడుపోవడం చూస్తే శాఖల మఽధ్య సమన్వయ లోపం తేటతెల్లం అవుతోంది.
అడ్డంకిగా నిబంధనలు
రాయితీ బియ్యం కోసం తొలుత రేషన్‌కార్డు నిబం ధన అనుకున్నారు. తర్వాత ఆధార్ కార్డు ఉన్న సరి పోయే విధానం అమలు చేశారు. ఆధార్ అథెంటి కేషన్ తప్పనిసరి చేయడంతో సర్వర్లు సరిగ్గా పని చేయని సమయంలో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పది కేజీల వరకు మాత్ర మే ఇక్కడ విక్రయించే నిబంధన వల్ల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కుటుంబానికి కనీసం 25 కిలోలు బస్తా అవసరంగా కాగా, కేవలం పది కిలోలే విక్రయిస్తుండడంతో జనం నుంచి స్పందన లభించడం లేదు. మరోవైపు కౌంటర్ల ద్వారా బియ్యం తక్కువ ధరలకే అమ్ముతున్నట్టు సరైన ప్రచారమే లేదు. ఇదిలా ఉండగా రైతుబజార్లలో రాత్రి ఏడు గంటల వరకు ఈ కౌంటర్లు పనిచేసేలా చర్యలు చేపట్టాల్సి వుంది. సాయంత్రం 5 గంటలకే ఇవి మూతపడుతున్నాయి. సాధారణంగా వారాంతంలో అన్ని వర్గాల వారు శనివారం ఇంట్లోకి కావాల్సిన కూరగాయాలు, ఇతర సరుకులు సమకూర్చుకునే సమయం. సాయంత్రం వేళ్లలోనే కొంత సమయం కేటాయిస్తుంటారు. అయితే బియ్యం కౌంటర్లు ఐదు గంటలకే మూత పడడంతో రాయితీ బియ్యం కొనే అవకాశం లేకుండా పోతోంది. కౌంటర్ల నిర్ణీత సమయాలు పెంచడంతో పాటు తక్కువ ధరలకు సన్నబియ్యం విక్రయాలపై జనంలో అవగాహన పెంచేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి వుంది.