బియ్యం విక్రయ కేంద్రాలకు స్పందన
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:49 AM
బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న బియ్యం ధరల నేపథ్యంలో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలకు మంచి స్పందన లభిస్తోంది.
బియ్యం విక్రయ కేంద్రాలకు స్పందన
మూడు రోజుల్లో 500 క్వింటాళ్ల బియ్యం అమ్మకం
భీమవరం టౌన్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న బియ్యం ధరల నేపథ్యంలో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలకు మంచి స్పందన లభిస్తోంది. జిల్లావ్యాప్తంగా 21 కేంద్రాల ద్వారా బియ్యం అమ్మకాలు చేపడుతుండగా, కేవలం మూడు రోజుల్లోనే సుమారు 500 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రజలు కొనుగోలు చేశారు. మండల కేంద్రాల్లోని పి.ఎస్.ఎస్. భవనాలతో పాటు రైతుబజార్లలో ఈ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేఎన్‌ఎం రకం, నెల్లూరు సన్నాలు అందుబాటులో ఉంచారు. బహిరంగ మార్కెట్‌లో కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.64 విక్రయిస్తుండగా, ప్రభుత్వ కేంద్రాల్లో రూ.50కే అందిస్తున్నారు. ఆధార్ కార్డుపై గరిష్ఠంగా 26 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించారు.
వెయ్యి క్వింటాళ్ల బియ్యం రాక
ప్రస్తుతం విక్రయ కేంద్రాల్లో మరో 400 క్వింటాళ్ల బియ్యం నిల్వలు అమ్మకాలకు సిద్ధంగా ఉన్నా యని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే మంగళవారం నాటికి మరో వెయ్యి క్వింటాళ్ల బియ్యం జిల్లాకు చేరుకోనున్నట్లు తెలిపారు. బియ్యం విక్రయ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వి క్రయాల తీరును పరిశీలించడంతో పాటు బియ్యం నాణ్యత, నిల్వలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.