Share News

బియ్యం ధరలకు రెక్కలు

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:16 AM

బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. 20 రోజుల వ్యవఽధిలో బియ్యం రకాలను బట్టి క్వింటాకు రూ. 1200 నుంచి రూ.1500 పెరిగింది.

బియ్యం ధరలకు రెక్కలు

పాలకొల్లు, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. 20 రోజుల వ్యవఽధిలో బియ్యం రకాలను బట్టి క్వింటాకు రూ. 1200 నుంచి రూ.1500 పెరిగింది. ఎల్‌నినో ప్రభావం వర్షాభావ పరిస్థితులతో తెలుగు రాష్ర్టాల్లో ధాన్యం పంట దిగుబడి తగ్గుతుందనే అంచనాలతో మిల్లర్లు బియ్యానికి కృత్రిమకొరత సృష్టిస్తూ ఽధరలు పెంచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్‌నినో, అనావృష్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ర్టాల్లో 30 నుంచి 40 శాతం వరి సాగు తగ్గింది. నైరుతి రుతుపవనాలు బలహీన పడడంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.

కారణాలు ఎన్నో..

ధరలు పెరుగుతాయనే ముందుగానే ఊహించిన మిల్లర్లు, టోకు వర్తకులు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఎల్‌నివో ప్రభావంతో వరి సాగు తగ్గుతుందని ముందుగానే ఊహించిన మిల్లర్లు పెద్ద మొత్తంలో సన్న ధాన్యం నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

గత పంట కాలంలో కొన్న ధాన్యాన్ని ముందుగానే రైతుల నుంచి కొనుగోలు చేసి నిల్వలు చేసుకున్న కొందరు మిల్లర్లు ఇప్పుడు మరపట్టి అధిక ధరలకు చిల్లర వర్తకులకు అమ్ముతున్నారని చెబుతున్నారు.

బియ్యం చిల్లర వర్తకులకు అమ్మకాలకు సరిపడనంతగా సరఫరా చేయడం లేదని మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడ్డారని పలు చిల్లర వర్తకులు ఆవేదన వ్యక్తం చేసున్నారు.

బ్రోకర్ల బాదుడు..

మిల్లర్లకు, టోకు వర్తకులకు, చిల్లర వర్తకులకు మధ్య బియ్యం సరఫరా చేసే బ్రోకర్లు గతంలో కిలోకి అర్ధ రూపాయి లేదా రూపాయి లాభం వేసుకునే వారని ఇప్పుడు కిలోకి రూ.2 నుంచి రూ.3 బాదేస్తున్నారని పలువురు బియ్యం రిటైల్‌ వర్తకులు చెబుతున్నారు. కాగా కర్నూలు సోనామసూరి రకం బియ్యం క్వింటాకు రూ.6 వేలకు చేరింది. బీపీటీ రకం బియ్యం రూ.6200లకు పైబడి ఉంది. మిగిలిన రకం బియ్యాలు ధరలు క్వింటాకు రూ.1200 పైబడి పెరిగింది. సన్న రకం బియ్యం గత ఏడాదికి ఇప్పుడుకి 25–30 శాతం పెరిగింది.

పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాలో సన్న బియ్యం మరపట్టే మిల్లులు అంతగా లేవు. తూర్పు గోదావరి, ఇతర తెలుగు రాష్ర్టాల ఇతర జిల్లాల నుంచి సన్న బియ్యం మన జిల్లాకు దుగిమతి అవుతాయి. ఇక్కడ 95 శాతం పైబడి ముతక ధాన్యమే పండిస్తారు. ఈ కారణంగా సన్న బియ్యం పూర్తిస్థాయిలో దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు జిల్లాలో ఎల్‌నినో బూచి చూపించి బియ్యం నిల్వలు పుష్కలంగా ఉండగానే కొందరు మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచడంపై చర్యలు తీసుకోవాలని చిల్లర వర్తకులు వినియోగదారుల కోరుతున్నారు.

ధరల స్థిరీకరణ ఎక్కడ ?

నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగినప్పుడు ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగిస్తారు. ప్రైస్‌ స్టెబిలైజేషన్‌ బోర్డు(పీఎస్‌ఎఫ్‌) పాలసీని తీసుకొచ్చేదే ధరల స్థిరీకరణ మండలి. ధరలను మోనిటర్‌ చేయడం, జోక్యం చేసుకోవాలా వద్దా నిర్ణయించుకోవడం, నిధులు విడుదల చేయడం, నిల్వలు, నల్లబజారును అడ్డుకోవడం, ప్రజలకు సమాచారం ఇవ్వడం ఈ బోర్డు ప్రత్యేక విధులు. అయితే రాష్ట్రంలో ఈ విభాగం పనిచేస్తుందో లేదో అనుమానమే. ఇప్పటికైనా ఈ మండలి చర్యలు తీసుకొని బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:16 AM