బియ్యం ధరలకు రెక్కలు
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:13 AM
మిల్లర్లు సన్న బియ్యం ధరలు మరోసారి పెంచేశారు. రాష్ట్రంలో సన్న బియ్యం మర పట్టే రైస్‌మిల్లులు సుమారు 50 ఉన్నాయి.
సన్న బియ్యం ధరలు పెంచిన మిల్లర్లు
క్వింటాకు రూ.400 పెరుగుదల
జిల్లాలో తగ్గిన బియ్యం వినియోగం
రిటైల్ వ్యాపారుల్లో ఆందోళన
పాలకొల్లు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి) మిల్లర్లు సన్న బియ్యం ధరలు మరోసారి పెంచేశారు. రాష్ట్రంలో సన్న బియ్యం మర పట్టే రైస్‌మిల్లులు సుమారు 50 ఉన్నాయి. పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలో సన్న బియ్యం మరపెట్టే మిల్లులు లేవనే చెప్పవచ్చు. అయితే పాత తూర్పుగోదావరి జిల్లాతో సహా రాష్ట్రంలోని మిగిలిని ప్రాంతాల్లో సన్న బియ్యం మర పెట్టే రైస్‌మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి ధరలు పెంచేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి గత ఐదారేళ్లుగా బియ్యం వినియోగం ఘననీయంగా తగ్గింది. అన్ని వర్గాల ప్రజలలోనూ 40 శాతం పైబడి సాయంత్రం వరి అన్నం జోలికి పోకుండా అల్పాహారం తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో నలుగురు సభ్యులు ఉన్న ఒక కుటుంబంలో 25 కిలోలు బియ్యం బస్తా నెలన్నర పైనే వస్తుంది. దీంతో బియ్యం అమ్మకాలు తగ్గాయి. కర్నూలు సోనా రకం బియ్యం గతంలో రూ.4 వేలు ఉండగా ఇప్పుడు రూ.4,400లకు చేరింది. హెచ్‌ఎంపీ రకం బియ్యం రూ.4600 నుంచి రూ.5 వేలుకు చేరింది. పీఎల్ రకం బియ్యం క్వింటాకు రూ.200 పెరగ్గా స్వర్ణ రకం రూ.100 పెరిగింది. బాసుమతి బియ్యం కిలో రూ.80 నుంచి రూ.85కు పెరిగింది. జిల్లాలో పెరిగిన ధరల పట్ల రిటైల్ వర్తకులు ఆందోళన వ్యక్తం చేసున్నారు.
తగ్గిన రిటైల్ అమ్మకాలు
గత ఏడాది కాలంగా రిటైల్ అమ్మకాలు తగ్గిపోయాయు. పేద మధ్య తరగతి వర్గాలు రేషన్ బియ్యాన్ని వినియోగిస్తున్నారు. గతంలో 3 కిలోలు రేషన్ బియ్యాన్ని దుకాణాలలో అమ్మి ఒక కిలో సన్న బియ్యం కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పీడీఎస్ బియ్యం అక్రమ అమ్మకాలు ఘననీయంగా తగ్గాయి. కోటా బియ్యాన్ని వరి పిండి, వరినూకగా మార్పు చేసి వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాలలో పలువురు కోటా బియ్యాన్ని పశువులు దాణా కింద ఉపయోగిస్తున్నారు. మొత్తంగా కోటా బియ్యం అక్రమ అమ్మకాలు తగ్గిముఖం పట్టడంతో లబ్ధిదారులే అధికశాతం వినియోగిస్తున్నారు. కోటా బియ్యం వినియోగం పెరగడంతో రిటైల్ మార్కెట్‌లో అమ్మకాలు తగ్గాయి. అయినప్పటికీ మిల్లర్లు నష్టాలు వస్తున్నాయంటూ సన్న బియ్యం ధరలు పెంచడం పట్ల రిటైల్ వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నాలుగింట ఒక వంతు రిటైల్ షాపులు మూతపడ్డాయి. పలువురు రిటైల్ బియ్యం దుకాణాల్లో బోనీ కావడం లేదని గగ్గోలు పెడు తున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లో బియ్యం ధరలు స్థిరీకరించాలని రిటైల్ వర్తకులతో పాటు వినియోగదారులు కోరుతున్నారు.