రైస్ మిల్లర్లకు తుఫాన్ దెబ్బ
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:19 AM
భారీ వర్షాలు, తుపాను కారణంగా వరి పంట దెబ్బతినడంతో రైతులకే కాకుండా రైస్ మిల్లర్లకు సైతం కష్టాలు మొదలయ్యాయి.
మిల్లుల కోటా మూడు వేల నుంచి 300 టన్నులకు కుదింపు
సార్వా దిగుబడి భారీగా పడిపోవడంతో సవరించిన లక్ష్యం
పశ్చిమలో 207 రైస్ మిల్లులపై తీవ్ర ప్రభావం
రంగు మారిన ధాన్యంతో మిల్లర్లకు మరో టెన్షన్
భారీ వర్షాలు, తుపాను కారణంగా వరి పంట దెబ్బతినడంతో రైతులకే కాకుండా రైస్ మిల్లర్లకు సైతం కష్టాలు మొదలయ్యాయి. దిగుబడి భారీగా పడిపోవడంతో ప్రభుత్వం మిల్లులకు ఇచ్చే కోటాను ఊహించని స్థాయిలో తగ్గించింది. గతంలో మిల్లు సామర్థ్యాన్ని బట్టి మూడు వేల నుంచి ఐదు వేల టన్నుల వరకు కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు దానిని కేవలం మూడు వందల టన్నులకు కుదించింది. 90 శాతానికి పైగా ధాన్యం కేటాయింపులు తగ్గిపోవడంతో మిల్లులు నడపడం యాజమాన్యాలకు గడ్డుకాలంగా మారింది.
భీమవరం రూరల్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): తుపానుకు ముందు జిల్లాలో ఆరు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే, భారీ వర్షాలకు పంట నాశనం కావడంతో దిగుబడి లక్ష టన్నుల లోపుకు పడిపోయే పరిస్థితి నెలకొంది. పూర్తిగా కోతలు పూర్తయితే కానీ దిగుబడి ఎంతనేది కచ్చితంగా చెప్పలేమని, ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని 207 రైస్ మిల్లులపై తీవ్ర ప్రభావం పడింది. గత సీజన్లలో చిన్న మిల్లులకు రెండు వేల నుంచి మూడు వేల టన్నులు, పెద్ద మిల్లులకు ఐదు వేల టన్నుల వరకు ధాన్యం కేటాయించేవారు. దీని ద్వారా ప్రభుత్వ సొమ్ముతోపాటు తౌడు, నూకల రూపంలో మిల్లర్లకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు కోటా కేవలం మూడు వందల టన్నులకు పడిపోవడంతో ఆదాయానికి భారీ గండి పడి, మిల్లుల లీజు భారం యాజమాన్యాలపై పడనుంది.
రంగుమారిన ధాన్యంతో ఇబ్బందులు
భారీ వర్షాలతో రెండు లక్షల 30 వేల ఎకరాల్లో సార్వా సాగు నీటమునిగింది. పది రోజులుగా నీటిలోనే ఉండటంతో వరి రంగు మారడంతోపాటు మొలకలొచ్చాయి. ఎకరానికి 40 బస్తాలు రావాల్సిన చోట ఐదు నుంచి పది బస్తాలలోపే దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. ఆ వచ్చిన ధాన్యం కూడా నల్లగింజలు, మొలకలు, పాలు పోసుకోని గింజలతో నిండి ఉంది. ఇలాంటి ధాన్యం మిల్లులకు వస్తే బియ్యం దిగుబడి తగ్గడంతోపాటు, బియ్యం కూడా రంగు మారే ప్రమాదం ఉంది. నాణ్యమైన ధాన్యం బస్తా కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో మిల్లర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రంగు మారిన ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిబంధనలను సడలించి వెసులుబాటు కల్పించాలని మిల్లర్లు కోరుతున్నారు.
తాడేపల్లిగూడెంలో ప్రారంభమైన కోతలు
ఇప్పటికే మెట్ట ప్రాంతమైన తాడేపల్లిగూడెం పరిసరాల్లో అక్కడక్కడా కోతలు ప్రారంభమయ్యాయి. సుమారు ముప్పై మెట్రిక్ టన్నుల వరకు మాసూళ్లు జరిగినట్లు సమాచారం. డెల్టా ప్రాంతంలో కోతలు మొదలవ్వాలంటే మరో పది రోజులు పడుతుందని, వాతావరణం అనుకూలిస్తేనే ఇది సాధ్యమవుతుందని రైతులు చెబుతున్నారు.
కొనుగోళ్లు నామమాత్రం
తాడేపల్లిగూడెం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాను అర్నబ్, మురసు తుఫాన్‌తో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికందే దశలో తుఫాన్, వరద ప్రభావంతో వరిపంటకు ఎక్కువగా నష్టం జరిగింది. జిల్లాలో 2.23లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దెబ్బతిన్న పంటను రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని జేసీ కేఆర్ కల్పశ్రీ తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో ప్రారం భించారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు మండలాల్లో ప్రస్తుతం కోతలు కొద్దిగా జరుగుతున్నాయి. ఒక్కొక్క ధాన్య కొనుగోలు కేంద్రానికి ఒక మిల్లును కేటాయిస్తారు. ఆ మిల్లు నుంచే కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు వస్తాయి. ప్రస్తుతం కుంచనపల్లి కొనుగోలు కేంద్రం నుంచి ఒక్క లారీ మాత్రమే మిల్లుకు పర్మిట్ జేసీ అందజేశారు. మిగిలిన చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రధానంగా ధాన్యం కొనగోలు కార్యక్రమం సొసైటీల ధ్వారా జరుగుతుంది. రైతుల అవసరాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. మరో రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలుకు కేటాయించిన మిల్లుల నుంచి సంచులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ధాన్యం కొనుగోలు నిబంధనలు..
ధాన్యంలో మట్టి రాళ్లు, ఇసుక మొదలకు వ్యర్ద్యాలు ఒక శాతం మాత్ర మే ఉండాలి, గడ్డి, చెత్త, తప్ప కలుపు విత్తనాలు 1 శాతం, చెపోయిన, రంగుమారిని, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యంపు గింజలు 5 శాతం వరకు అనుమతి ఇస్తారు. పరిపక్వం కాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన ధాన్యం గింజులు 3 శాతం వరకు అంగీకరిస్తారు. తక్కువ శ్రేణి ధాన్యపు గింజలు లేక, కేళీలు (ఏ గ్రేడు రకం కొనుగోలులో) 6శాతం వర కు ఉంటే కొనుగులు చేయాలని, తేమ లేక నిమ్ముశాతం 17 వరకు ఉంటే కొనుగోలు చేయాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు ఆదేశాలు ఇచ్చింది.