చెక్ పెట్టారు !
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:07 AM
గ్రామ సర్పంచ్‌ల పదవీ కాలానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో పదవుల నుంచి వైదొలగనున్నారు.
సర్పంచ్‌ల చెక్ పవర్‌పై ఆంక్షలు
విచ్చలవిడి బిల్లుల మంజూరుకు చెక్
డీఎల్‌డీవో అనుతించిన తర్వాతే బిల్లు
పంచాయతీ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట
(భీమవరం–ఆంధ్రజ్యోతి) : గ్రామ సర్పంచ్‌ల పదవీ కాలానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో పదవుల నుంచి వైదొలగనున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో పంచాయతీల పన్నులు గణనీయంగా వసూళ్లయ్యాయి. ఆస్తి పన్ను, కుళాయి పన్ను, సెల్‌టవర్, లైసెన్స్ ఫీజులు ఇలా పంచాయతీలకు నిధులు సమకూరాయి. దాంతో సర్పంచ్‌లు తమ చెక్‌పవర్‌ను ఉపయోగించి నిధులు దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది. పదవీకాలం ముగుస్తున్న పరిస్థితుల్లో పంచాయతీల ఖజానా ఖాళీ చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అందుకు తగ్గట్టుగానే జిల్లాలోని అనేకమంది సర్పంచ్‌లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా సర్పంచ్‌ల చెక్‌పవర్‌పై ఆంక్షలు విధించింది. పంచాయ తీలకు ఇప్పటిదాకా బిల్లులు మంజూరుకు వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం సర్పంచ్‌లను కట్టడి చేసింది. జిల్లాలోని డివిజన్ స్థాయి పంచాయతీ అధికారులు పరిశీలించిన తర్వాతే బిల్లులు మంజూరు కానున్నాయి. గతంలో పంచాయతీ కార్యదర్శులు అంగీకరిస్తే సర్పంచ్‌లు చెక్‌పవర్‌ను ఉపయోగించి బిల్లులు మంజూరు చేసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. బిల్లు ఎందుకు పెట్టారో పరిశీలిస్తున్నారు. పారిశుధ్యం. తాగునీరు, విద్యుత్ బిల్లులకు మాత్రమే నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు క్షేత్ర స్థాయిలో డివిజన్ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బిల్లులు మంజూరులో ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారు.
పన్నుల ఆదాయంతో ఖజానా కళకళ
జిల్లాలో 409 పంచాయతీలున్నాయి. పన్నుల వసూళ్లలో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో నిలచింది. స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో పన్నులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటిదాకా 90.73 శాతం పన్ను వసూళ్లతో పంచాయతీలు కళకళలాడు తున్నాయి. ఈ ఏడాది రూ.39.72 కోట్లు పన్ను వసూలు చేయాలి. అందులో రూ.36.51 కోట్లు వసూలు చేయగలిగారు. మరోవైపు ఎరియర్స్ పైనా సిబ్బంది దృష్టిపెట్టారు. గత ఏడాది రూ.2.60 కోట్లు పన్ను పెండింగ్‌లో ఉంది. ఇప్పటిదాకా రూ.1.88 కోట్లు వసూలు చేయగలిగారు. ఎరియర్స్‌తో కలిపి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో రూ.38.39 కోట్లు పన్ను సమకూరింది. కుళాయి పన్ను, సెల్ టవర్స్, లైసెన్స్, కొబ్బరి చెట్లు పాట, చెరువుల పాటతో పంచాయ తీలకు రూ. 25.05 కోట్లు రావాల్సి ఉంది.ప్రస్తుతానికి రూ.19.48 కోట్లు రాబట్టారు. మొత్తంపైన పంచాయతీలకు రూ.57.87 కోట్లు జమయ్యాయి.ఇటీవల ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.21.50 కోట్లు విడుదల చేసింది. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ రెండో తేదీ నుంచి ముగియనుంది. అంతలోగా సర్పంచ్‌లు ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. చెక్ పవర్‌తో నిధులు దుర్వినియోగం కాకుండా బిల్లులను పరిశీలించే బాధ్యతను డివిజన్ పంచాయతీ అధికారులకు అప్పగించింది.