అన్నదాతలకు ఊరట
ABN , Publish Date - May 15 , 2026 | 12:52 AM
2026–27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నదాతల్లో స్వల్పఊరట కలిగించింది.
వరి క్వింటాల్‌కు రూ.72..
అత్యఽధికంగా పొద్దుతిరుగుడు గింజలకు క్వింటాల్‌కు రూ.622 పెంపు
2026–27 ఖరీఫ్‌కు 14 రకాల పంటలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి : రైతు సంఘాల డిమాండ్
2026–27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నదాతల్లో స్వల్పఊరట కలిగించింది. గిట్టుబాటు ధర లభించేలా చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా వరి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధరను స్వల్పంగానే పెంచడంపై రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
(ఏలూరుసిటీ – ఆంధ్రజ్యోతి)
రైతులకు పెట్టుబడిపై కనీసం 50 శాతం లాభం చేకూర్చాలన్న లక్ష్యంతో పంటలకు మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 2014–26 మధ్య వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, రైతుల నుంచి వరి ధాన్యం సేకరణ, చెల్లింపులు గణనీయం గా పెరిగాయని చెబుతున్నారు. నూనెగింజలు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆ పంట లకు మద్దతు ధర ఎక్కువగా పెంచారు. వరి సాధా రణ రకానికి, ఏ–గ్రేడ్ రకానికి రూ.72 మాత్రమే పెం చడంతో క్వింటాల్‌కు సాధారణ వరి రకం రూ.2,441 లకు, ఏ–గ్రేడ్ రకం రూ.2,461లకు చేరింది. మొక్క జొన్నకు క్వింటాల్‌కు కేవలం రూ.10, పెసర క్వింటా ల్‌కు రూ.12 మాత్రమే పెంచారు. రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలో ఉన్న సన్ ఫ్లవర్ గింజలకు అత్యధికంగా క్వింటాల్‌కు రూ.622, అవిసెలుకు క్వింటాల్‌కు రూ.515 పెంచారు. జొన్నలకు (హైబ్రీడ్‌కు) క్వింటా ల్‌కు రూ.324, జొన్నలు (మల్లండి)కు క్వింటాల్‌కు రూ.324 పెంచారు. సాగు విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతున్న కందుల పంటను ప్రోత్సహించే విధంగా క్వింటాల్‌కు రూ.450 వరకు పెంచారు. జిల్లాలో మెట్ట ప్రాంతంలో పండించే మినుములుకు క్వింటా ల్‌కు రూ.400 పెంచారు. మిగిలిన పంటలను క్వింటాల్‌కు పరిశీలిస్తే సజ్జలు రూ.125, రాగులు రూ.319, వేరుశనగకు రూ.254, సోయాబీన్ రూ.380, నువ్వులు రూ.500, పత్తి (మధ్యస్థ పింజ) కు రూ.557, పత్తి (పొడుగు గింజ) రూ.557 పెంచా రు. ఈ గిట్టుబాటు ధరల పెంపు అన్నదాతకు కాస్త ఊరట నిచ్చే అంశమైనా కనీస మద్దతు ధర పెంచే సమయంలో వ్యవసాయంలో పెరిగిన ఖర్చులను పరిగణలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయంపై 50శాతం అదనంగా కలిపి అన్ని పంటలకు మద్దతు ధరలు పెంచాలే తప్ప ఎరువుల ధరలు విపరీతంగా పెంచి మద్దతు ధర పెంచుతామని చెప్పడం రైతులకు ఎంత వరకు ప్రయోజనకరంగా ఉంటుందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.
50 శాతం ధర పెంచామని చెప్పడం హాస్యాస్పదం
ఎరువుల ధరలపై 15 నుంచి 20శాతానికి పైగా పెంచుకునేందుకు ఎరువుల కంపెనీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు కేవలం 0.01 శాతం నుంచి 8శాతం వరకు మాత్రమే ధరలు పెంచడం, పెట్టుబడి ఖర్చులపై 50 శాతం అదనంగా ధర నిర్ణయించామని చెప్పడం హాస్యాస్పదం. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలి.
కె.శ్రీనివాస్ , ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
గత రెండేళ్లలో మద్దతు ధరలు పెంపు ఇలా..
పంటపేరు 2025–26 ఎంఎస్‌పీ (క్వింటాల్‌కు) 2025–26 ఎంఎస్‌పీ (క్వింటాల్‌కు)
వరి సాధారణ 2,369 2,441
వరి (గ్రేడ్ –ఏ) 2,389 2,461
జొన్న(హైబ్రీడ్) 3,699 4,023
జొన్న(మాల్డండి) 3,749 4,073
సజ్జ 2,775 2,900
రాగులు 4,886 5,205
మొక్కజొన్న 2,400 2,410
కంది 8,000 8,450
పెసర 8,768 8,780
మినుములు 7,800 8,200
వేరుశనగ 7,263 7,517
ప్రొద్దుతిరుగుడు 7,721 8,343
సోయాబీన్ 5,328 5,708
నువ్వులు 9,846 10,346
అవిసెలు 9,537 10,052
ప్రత్తి(మధ్యస్థ పింజ) 7,710 8,267
ప్రత్తి (పొడుగుపింజ) 8,110 8,667