పునరావాసం..పరుగు
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:29 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో 2027 మే నాటికి పూర్తి చేయాలనే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పునరావాస పనులు వేగంగా జరుగుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు పరిధిలో వరరామచంద్రాపురం మండల నిర్వాసితుల కోసం..
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో రైతుల నుంచి
వెయ్యి ఎకరాల భూసేకరణ
వేలేరుపాడు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో 2027 మే నాటికి పూర్తి చేయాలనే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పునరావాస పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం అవసరమైన భూముల సేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. గిరిజన రైతులకు భూమికి భూమిని ఇచ్చేందుకు వీలుగా గిరిజనేతరుల భూములను సేకరించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పోలవరం జిల్లా వరరామచంద్రాపురం మండలంలోని గిరిజనులకు భూమికి భూమి ఇచ్చేందుకు వీలుగా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వెయ్యి ఎకరాల భూములను భూసేకరణ ద్వారా చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
వరరామచంద్రాపురం, చింతూరు మండలాల్లోని గిరిజన రైతులకు భూములిచ్చేందుకు పోలవరం జిల్లాలో భూముల కొరత ఉన్నందున ఆ జిల్లాలోని గిరిజనులకు ఏలూరు జిల్లాలో పునరావాస కాలనీల నిర్మాణం గిరిజనులకు భూమికి భూమి ఇచ్చే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇప్పటికే ఆ రెండు మండలాల్లోని గిరిజనేతర నిర్వాసితులకు తాడువాయి సమీపంలోని చల్లావారిగూడెం ప్రాంతంలో గృహాలు నిర్మిస్తున్నారు. గిరిజనులకు భూమికి భూమితోపాటు గృహ నిర్మాణాల కోసం వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో భూముల సేకరణకు సిద్ధపడగా వేలేరుపాడు మండలం మేడేపల్లి పంచాయతీ పరిధిలో, కుక్కునూరు మండలం నెమలిపేట, దాచారం, కుక్కునూరు గ్రామాల్లో ముంపులో లేని భూములు సేకరిస్తున్నారు.
ఇప్పటికే ఈ రెండు మండలాల్లో రైతులు వెయ్యి ఎకరాల వరకు తమ భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. సర్వే ప్రక్రియ పూర్తి చేసి జూన్‌లో వేలేరుపాడు మండలం రాళ్లపూడి ప్రాంతంలో 200 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయగా తాజాగా కుక్కు నూరు మండలంలో 67 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేశారు. ప్రస్తుతం వేలేరుపాడు మండలంలోని ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన భూములకు సంబంధించి చింతూరు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదన్న కారణంతో వ్యవసాయం చేయలేని రైతులు ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం సంతృప్తికరంగా ఉండడంతో భూములిచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
2017లో జరిపిన భూసేకరణలో ఎకరానికి రూ.10.50 లక్షలు ఇవ్వగా ప్రస్తుతం భూసేకరణలో రూ.15.50 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుండడమే ఇందుకు కారణం.