Share News

లక్ష్యం దిశగా..

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:35 PM

మార్చి మాసాంతానికి అనుకున్నట్టుగా రెవెన్యూ రప్పిం చేందుకు రిజిస్ర్టేషన్‌ శాఖలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఫిబ్రవరి మాసాంతానికి రూ.425 కోట్లు ఆదాయం సమకూరింది. లక్ష్యంలో దాదాపు 90 శాతం చేరుకోగలి గారు.

లక్ష్యం దిశగా..

లక్ష్యానికి చేరువుగా రెవెన్యూ

రిజిస్ర్టేషన్‌ శాఖ కొత్త పుంతలు

పెరిగిన ఆదాయం..

100 శాతం లక్ష్యం చేరుకునేందుకు కృషి

ఫిబ్రవరికి రూ.425 కోట్లు వసూలు

మార్చిలో రూ.42 కోట్లు టార్గెట్‌

(భీమవరం –ఆంధ్రజ్యోతి)

గడువు ముంచుకొస్తున్నది. లక్ష్యాన్ని చేరుకోవాలంటూ ఉన్నతాధికారుల నుంచి పదేపదే ఆదేశాలు వస్తున్నాయి. మార్చి మాసాంతానికి అనుకున్నట్టుగా రెవెన్యూ రప్పిం చేందుకు రిజిస్ర్టేషన్‌ శాఖలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఏ ఒక్క దస్తా వేజు కూడా తిప్పి పంపకుండా రిజిస్ర్టేషన్‌ అయ్యేలా చర్యలు చేపట్టారు. ఇటీవల ప్రతీ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో బుకింగ్‌ స్లాట్‌ల సంఖ్య కూడా పెంచారు. దాంతో స్థలం రిజిస్ర్టేషన్‌ వేగవంతం అవుతుంది. నిజానికి జిల్లా వ్యాప్తంగా 15 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సుమారు రూ.520 కోట్లు ఆదాయం తెచ్చి పెట్టాలని లక్ష్యంగా ఇచ్చారు. తరువాత దానిని రూ.467 కోట్లకు తగ్గించారు. వాస్తవానికి 2025–26 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ర్టేషన్‌ ఆదాయం పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌లు ఎక్కువుగా జరుగు తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌లోనే ఆశించిన స్థాయిలో రిజిస్ర్టేషన్‌లు నమోదు కావడం లేదు. అయినా సరే జిల్లాలో కొత్త ఆర్థిక సంవత్సరానికి లక్ష్యాన్ని చేరుకుంటా మన్న ధీమా అధికారుల్లో నెలకొంది. జిల్లాలో ఫిబ్రవరి మాసాంతానికి రూ.425 కోట్లు ఆదాయం సమకూరింది. లక్ష్యంలో దాదాపు 90 శాతం చేరుకోగలి గారు. మరో రూ.42 కోట్లు రెవెన్యూ లభిస్తే 100 శాతం లక్ష్యాన్ని చేరు కునేందుకు అవకాశం ఉంటుంది.

రెండు వారాలే కీలకం

ప్రతీ ఏటా మార్చి నెలలో రిజిస్ర్టేషన్‌లు అధికంగా నమోదవుతుంటాయి.ఆర్థిక లావాదేవీలు కుదించుకోవాలన్న ఉద్దేశంతో రిజిస్ర్టేషన్‌లు చేసుకుంటారు. అగ్రిమెంట్‌లతో ఉన్న స్థలాల లావాదేవీలు మార్చిలో ముగించుకోవడానికి రిజిస్ర్టేషన్‌లు ఎక్కువగా నిర్వహి స్తుంటారు. ఫలితంగా ఆదాయం కూడా ఈ నెలలో భారీగానే ఉంటుందని అధికారులు అంచనాతో ఉన్నారు. సెలవలు కూడా ఉండటం వల్ల ఆ ప్రభావం రిజిస్ర్టేషన్‌లపై పడుతుందని అధికారుల్లో ఒకింత గుబులు నెలకొంది. జిల్లాలోని భీమవరం, గునుపూడి, తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, తదితర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అత్యధిక ఆదాయం లభిస్తుంది. ఈసారి మరింత రెవెన్యూ రావడంతో అధికారులు వీటిపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రతీరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజువారీ లక్ష్యాలను చేరుకునేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తంపైన లక్ష్య సాధన కోసం క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరుకు పరుగులు పెడుతున్నారు.

Updated Date - Mar 16 , 2026 | 11:35 PM