రిజిస్ట్రేషన్ సేవల్లో సిక్సర్ !
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:25 AM
రిజిస్ర్టేషన్ల శాఖ సేవల్లో ఏలూరు జిల్లాకు ప్రజలు మంచి మార్కులే వేశారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఓవరాల్‌గా ఆరో స్థానం (ర్యాంకు)ను దక్కించు కుంది.
రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచిన జిల్లా..
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ముదినేపల్లి టాప్
పలు అంశాలపై జనాభిప్రాయ సేకరణ
రిజిస్ర్టేషన్ల శాఖ సేవల్లో ఏలూరు జిల్లాకు ప్రజలు మంచి మార్కులే వేశారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఓవరాల్‌గా ఆరో స్థానం (ర్యాంకు)ను దక్కించు కుంది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రిజిస్ర్టేషన్ల శాఖలో వేగంగా చేపట్టిన సంస్కరణలు ఏలూరు జిల్లాలో 75.3 బాగుందని, 24.7 బాగాలేదని తేల్చి చెప్పారు.
(ఏలూరు–ఆంధ్ర జ్యోతి)
స్టాంప్స్, రిజిస్ర్టేషన్లశాఖ పరంగా సేవల్లో రాష్ట్రంలో జిల్లా ఆరో స్థానం దక్కించుకుంది. సేవల పరంగా ప్రజల సంతృప్తి స్థాయిలపై వివిధ అంశాలపై వరుసగా నవంబర్, డిసెంబరు, జనవరిలో వివిధ దశల్లో రాష్ట్ర స్థాయిలో ఐవీఆర్‌ఎస్ సర్వే జరిగింది. దీంట్లో అత్యధికులు సేవల పరంగా భేష్ అంటూ తమ వాయిస్ ద్వారా కితాబులు ఇచ్చారు. స్లాట్ బుకింగ్, కార్డు–2.0 సేవలు, అర్బన్ మ్యుటేషన్లు, వారసత్వ రిజిస్ర్టేషన్లలో పార దర్శకంగా సేవలందించి నందుకు జిల్లాకు మంచి స్థానమే దక్కిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
1,08,480 మంది అభిప్రాయ సేకరణ
రిజిస్ర్టేషన్ల సేవలన్నీ డిజిటల్ రూపంలో అందు బాటులో ఉన్నాయని మీకు తెలుసా ? రిజిస్ర్టేషన్ కోసం మీరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయానికి వెళ్లినప్పుడు సిబ్బంది మర్యాద పూర్వకంగా, సహాయ పూర్వకంగా ఉన్నారా? డాక్యుమెంట్ రిజిస్ర్టేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ సులభతరంగా ఉందా? రిజిస్ర్టేషన్ సేవల్లో అనధికార చెల్లింపులు ఉన్నాయని మీరు భావిస్తున్నారా..? అంటూ తర్కించి ప్రజల సంతృప్తి స్థాయిని ప్రభుత్వం సర్వే చేసింది. డిజిటల్ సేవలపై 27,120 మందిని సర్వే చేయగా 19,485 భాగస్వామ్యులై బాగుందని 75.4 శాతం, బాగాలేదని 24.6 శాతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సిబ్బంది సేవలపై 27,120 మందికి 20,374 మంది భాగస్వామ్యం వహించి 84.1 శాతం బాగుందని, 15.9 శాతం బాగా లేదని తేల్చి చెప్పారు. స్లాట్ బుకింగ్‌పై 27,120 మందికి 19,257 మంది సర్వేలో పాల్గొని 80.6 శాతం బాగుందని, 19.4 శాతం బాగా లేదన్నారు. అనధికారిక చెల్లింపులపై 58.1శాతం వసూళ్ల లేవని తెలపగా, 41.9 జరుగుతున్నట్టు సర్వేలో వెల్లడించారు.
ముదినేపల్లి అరుదైన ఘనత
జిల్లాలో ఏలూరు రిజిస్ర్టార్ కార్యాలయంతో పాటు 11 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో సేవల పరంగా రాష్ట్రంలో ఏడో స్థానంలో ముదినేపల్లి నిలిచి అరుదైన ఘనత సాధించింది. ఇక్కడ సేవల పరంగా ప్రజల సంతృప్తి స్థాయి మెరుగ్గా ఉంది. ఓవరాల్‌గా నాలుగు కీలకమైన అంశాల్లోను 90.97 శాతం బాగుందని, కేవలం 9.03 శాతమే బాగా లేదని తేల్చి చెప్పారు.
రిజిస్ట్రార్లు, సిబ్బంది పనితీరు బాగుంది
జిల్లా వ్యాప్తంగా రిజిస్ర్టేషన్ల సేవల్లో ప్రజలు బాగుందనడానికి ప్రధాన కారణంగా సబ్ రిజిస్ర్టార్లు, సిబ్బంది చాలావరకు మర్యాదగానే సమాధానాలు చెప్పడం.. సేవల్లో సంతృప్తికరంగా వివరించడం జరుగు తోంది. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగిస్తాం.
– కె.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ర్టార్