Share News

తగ్గించండి

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:40 AM

గోదావరి పుష్కరాలకు మౌలిక వసతులు కల్పించడానికి అన్ని శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి.

తగ్గించండి

ప్రాథమిక అంచనా రూ.2,850 కోట్లు

నాలుగు శాఖలకే రూ.2,600 కోట్లు

సవరించాలంటూ అధికారుల సూచన

సగానికి సగం తగ్గే అవకాశం

మొత్తం 16 శాఖలకు భాగస్వామ్యం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

గోదావరి పుష్కరాలకు మౌలిక వసతులు కల్పించడానికి అన్ని శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. ప్రధానంగా జలవనరులు, మునిసిపాల్టీలు, రహదారులు, పంచాయతీరాజ్‌ ప్రతిపాదనలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. వాస్తవంగా జిల్లా పరిధిలో 15 శాఖలు పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. దాదాపు రూ.2,850 కోట్లతో అంచనాలు రూపొందించారు. దీనిపై కలెక్టర్‌, జేసీ, సంబంధిత శాఖలతో సమీక్ష చేశారు. నాలుగు శాఖల్లో అంచనాలు సవరించాలని కలెక్టర్‌ సూచించారు. జలవనరులు, మునిసిపాల్టీ, పంచాయతీరాజ్‌ రహదారుల శాఖల్లోనే రూ.2,600 కోట్లతో పనులు చేపట్టాలని అంచనా వేశారు. వీటిని సవరించి మళ్లీ ప్రతిపాదనలు చేయాలని సూచించడంతో సంబంధిత శాఖలు మల్లగు ల్లాలు పడుతున్నాయి. కొత్తగా అంచనాల వ్యయం సగానికి తగ్గిపోతుందని భావిస్తున్నారు.

ప్రధాన ఘాట్‌లకు ప్రాధాన్యం

గోదావరి పుష్కరాల్లో భాగంగా జిల్లాలో 40 ఘాట్‌లను అభివృద్ధి చేయనున్నారు. వాటిని మూడు కేటగిరీలుగా విభజించారు. రోజూ లక్ష మంది స్నానాలు చేసే ఘాట్‌లను ఎ–కేటగిరీగా, 50 వేల నుంచి లక్షమంది స్నానాలు చేసే ఘాట్‌లను బి–కేటగిరి, 50 వేలు అంతకంటే తక్కువైతే సి–కేటగిరీలో చేర్చారు. జలవనరుల శాఖ వీటిని అభివృద్ధి చేయనుంది. పార్కులు, వరద నియంత్రణ పనులకు ఆ శాఖ ప్రాధాన్యం ఇస్తోంది. మునిసిపాల్టీ పరిధిలోని ఘాట్లలో రహదారులు, డ్రెయిన్లు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, లైటింగ్‌, తదితర పనుల బాధ్యతలను మునిసిపల్‌ శాఖకు అప్పగించారు. ఆ మేరకే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఘాట్‌ల వద్దకు నడచి చేరుకునే రహదారుల అభివృద్ధి పనుల కోసం ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ శాఖకే దాదాపు రూ.750 కోట్లు అవసరం కానుందని గుర్తించారు. జలవనరుల శాఖ, మునిసిపల్‌ శాఖలు కలిపి రూ.1300 కోట్ల విలువైన పనులకు అంచనాలు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గోదావరి పుష్కరాలకు వచ్చే ప్రజల కోసం సౌకర్యాలు అతిఽథి గృహాల నిర్వహణ, ఘాట్‌లు, ఆలయాల వద్ద సౌకర్యాలు కల్పించే బాధ్యతను పంచాయతీరాజ్‌ శాఖ నిర్వహించనుంది. ఆ శాఖ ఇప్పటికే రూ.575 కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. వీటినే సవరించాలని అధికారులు దిశా నిర్ధేశం చేశారు. త్వరలోనే అవి జిల్లా కలెక్టర్‌కు చేరుకుంటున్నాయి.

పనులకు ప్రతిపాదించిన శాఖలు

పుష్కరాల్లో భాగస్వామ్యం కావలసిన 16 శాఖలను గుర్తించారు. జలవనరులు, మునిసిపల్‌, పంచాయితీరాజ్‌, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌, పోలీసు, పర్యాటకం, ఆర్టీసీ, విద్యుత్‌, దేవదాయ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, వైద్యం, అగ్ని మాపక విభాగం, మత్స్య, అటవీ శాఖలు ఉన్నాయి. ఒక అటవీ శాఖ తప్ప మిగిలిన ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిలో అత్యధిక బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసిన శాఖల్లో అంచనాలు సవరించాలని అధికారులు సూచించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో సన్నహాలు చేస్తున్నారు. నరసాపురం మునిసిపాల్టీలో పొన్నపల్లి ఘాట్‌, అమరేశ్వరస్వామి, వలంధర్‌, కొండాలమ్మ, నందమూరి కాలనీ, స్మృతివనం ఘాట్‌లు, పెనుగొండ మండలం సిద్ధాంతం, యలమంచిలి మండలం యలమంచిలి ఘాట్‌లను ప్రాముఖ్యత గలవిగా గుర్తించారు. వీటి కోసం అధిక నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:40 AM